దక్షిణాఫ్రికా పర్యటనలో భారత్ చివరి పోరుకు సిద్ధమైంది. కేప్‌టౌన్ వేదికగా జనవరి 3వ తేదీ నుంచి సఫారీసేనతో రెండో టెస్టు ఆడనుంది. రెండు టెస్టుల సిరీస్‌ను సమం చేసుకోవాలంటే టీమిండియా ఆఖరి టెస్టులో తప్పక గెలవాల్సి ఉంది. సెంచూరియన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో రోహిత్ సేన ఘోరపరాజయాన్ని చవిచూసిన సంగతి తెలిసిందే. ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.
అయితే రెండో టెస్టు కోసం భారత ప్లేయర్లు తీవ్రంగా సన్నద్ధమవుతున్నారు. విజయం సాధించి విమర్శకుల నోళ్లు మూయించాలని పట్టుదలతో కఠోర సాధన చేస్తున్నారు. రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా, యశస్వీ జైశ్వాల్ మినహా మిగిలిన అందరూ ప్రాక్టీస్‌లో పాల్గొన్నారు. అయితే టీమిండియా ప్రాక్టీస్‌కు సంబంధించిన ఓ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. దీనిలో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. సీనియర్ స్పిన్నర్ అశ్విన్ బౌలింగ్‌లో సిక్సర్ బాదాడు.

అలాగే ఎడమచేతి వాటం అయిన నెట్ బౌలర్‌ను, మరో ఇండియన్ పేసర్‌ను కూడా కోహ్లి వదిలిపెట్టలేదు. అతడి బౌలింగ్‌లో విధ్వంసకరంగా బ్యాటింగ్ చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. కాగా, తొలి టెస్టులో మిస్ అయిన 81వ సెంచరీ రెండో టెస్టులో కోహ్లి సాధించేలా ఉన్నాడని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
బాక్సింగ్ డే టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో కోహ్లి 38 పరుగులు చేసి రబాడ బౌలింగ్‌లో ఔటయ్యాడు. రెండో ఇన్నింగ్స్‌లో 82 బంతుల్లో 76 పరుగులు చేసి ఆఖరి వికెట్ వెనుదిరిగాడు. అయితే బుధవారం ప్రారంభం కానున్న కేప్‌టౌన్‌లో భారత్ రికార్డు పేలవంగా ఉంది. ఈ మైదానంలో ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో టీమిండియా నాలుగింట్లో ఓడిపోయింది. మరో రెండు మ్యాచ్‌లను డ్రా గా ముగించింది. అయితే బ్యాటింగ్‌కు ఈ పిచ్ కాస్త అనూలిస్తుంది. కానీ ఈ మైదానంలో భారత్ అత్యల్ప స్కోరు 135 కాగా, అత్యధిక స్కోరు 414 పరుగులుగా ఉంది.