వన్డే వరల్డ్ కప్ ఆద్యంతం గొప్పగా పోరాడి ట్రోఫీని చేజార్చుకున్న భారత్, దక్షిణాఫ్రికా జట్లు మరో సుదీర్ఘ పోరాటాన్ని ప్రారంభించనున్నాయి. సౌతాఫ్రికాలో సఫారీలతో టీమిండియా మూడు టీ20లు, మూడు వన్డేలు, మూడు టెస్టుల సిరీస్ లు ఆడనుంది. దానిలో భాగంగా డర్బన్ వేదికగా ఇవాళ తొలి టీ20 మ్యాచ్ ప్రారంభం కానుంది.
ప్రపంచకప్ ఓటమి అనంతరం సూర్యకుమార్ కెప్టెన్సీలో టీమిండియా యువ జట్టు ఆస్ట్రేలియాను 4-1 తేడాతో చిత్తుగా ఓడించింది. ఇప్పుడు సౌతాఫ్రికా టీ20 సిరీస్ ను కైవసం చేసుకోవాలని సూర్యసేన పట్టుదలతో ఉంది. అంతేగాక సీనియర్ ఆటగాళ్లు రవీంద్ర జడేజా, మహ్మద్ సిరాజ్ చేరడం జట్టుకు మరింత బలాన్ని ఇస్తుంది.

మరోవైపు బవుమా గైర్హాజరీలో దక్షిణాఫ్రికా జట్టు పగ్గాలను మార్క్రమ్ అందుకున్నాడు. డికాక్,డసెన్, రబాడ, నోర్జె, ఎంగిడీ లేకపోయినా జట్టులో స్టార్ ప్లేయర్లకు కొదవలేదు. దీంతో టీ20 సిరీస్ హోరాహోరీగా సాగడం ఖాయం.
ఇక సౌతాఫ్రికాతో జరిగిన గత నాలుగు టీ20 సిరీస్ లో టీమిండియా రెండు సార్లు విజేతగా నిలిచింది. మరో రెండు సిరీస్ లు డ్రాగా ముగిశాయి. 2015లో జరిగిన టీ20 సిరీస్ విజయమే టీమిండియాపై దక్షిణాఫ్రికాకు ఆఖరిది. ఆ తర్వాత భారత్ దే పైచేయి.
డర్బన్ లో ఇప్పటివరకు 19 టీ20 మ్యాచ్ లు జరిగాయి. తొలుత బ్యాటింగ్ చేసిన జట్టు, అలాగే ఛేజింగ్ చేసిన జట్టు కూడా ఎనిమిది సార్లు గెలిచాయి. రెండు మ్యాచ్ ల్లో ఫలితం రాలేదు. 2007లో భారత్-పాకిస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్ టైగా ముగిసింది. ఈ గణాంకాలతో డర్బన్ లో టాస్ నామమాత్రమే అని చెప్పొచ్చు.
ఇక డర్బన్ పిచ్ విషయానికొస్తే.. గత కొన్నేళ్లు ఇది 'స్లో' గా ఉంది. కానీ ఇటీవల సౌతాఫ్రికా-ఆస్ట్రేలియా టీ20 సిరీస్ లో తొలుత బ్యాటింగ్ చేసిన జట్టు 190కి పైగా పరుగులు సాధించడం విశేషం. అయితే ఉదయం వర్షం పడే అవకాశాలు ఉన్నాయి. అలాగే మధ్యాహ్నం కూడా జల్లులు పడే ఛాన్స్ ఉంది. మ్యాచ్ జరుగుతున్న సమయంలోనూ డర్బన్ లో భారీ మేఘాలు ఉండొచ్చు.