
హైదరాబాద్: దక్షిణాఫ్రికా జట్టుతో తలపడి 4-0తేడాతో భారత జట్టును గెలిపిద్దామని ఆశపడిన కెప్టెన్ కోహ్లీ ఆశలు నీరుగారిపోయాయి. అన్ని మ్యాచ్‌లలోనూ బౌలర్లు ప్రత్యేక ప్రతిభ చూపించి మ్యాచ్‌ను విజయం దిశగా నడిపించారు. నాలుగో వన్డేలో మాత్రం దానికి వ్యతిరేకంగా జరిగింది. చాహల్ బౌలింగ్ లోనే మిల్లర్ అధిక పరుగులు చేశాడు. ఇదే విషయాన్ని భారత జట్టు మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ పేర్కొన్నాడు.
ముమ్మాటికీ చాహల్ అలా చేయడం వల్ల మ్యాచ్ ఓటమికి కారణం అయిందని నొక్కి చెప్పాడు. నాలుగో వన్డేలో ఓటమికి లెగ్‌స్పిన్నర్ యజ్వేంద్ర చాహల్ కారణమంటూ దిగ్గజ బ్యాట్స్‌మన్ సునీల్ గవాస్కర్ ధ్వజమెత్తాడు. అతడిలో ప్రొఫెషనలిజం లేదని విమర్శించాడు. అదేసమయంలో సఫారీల విజయానికి కారకులంటూ మిల్లర్, కార్లెసన్‌ను ప్రశంసించాడు.
'ఆ నోబాల్ వల్లే భారత్ ఓడిపోయింది. ఆ బంతికి బౌల్డయిన మిల్లర్ నోబాల్ కావడంతో బతికిపోయాడు. ఆపై పుంజుకొని ఎదురు దాడికి దిగాడు. మ్యాచ్ టర్నింగ్ పాయింట్ అదే' అని విశ్లేషించాడు. అప్పటి వరకూ మ్యాచ్‌పై భారత్‌దే పట్టని తెలిపాడు. ప్రస్తుత క్రికెట్‌లో ఏ బౌలర్ కూడా నోబాల్స్ వేయరాదన్నాడు.
అసలేం జరిగేందంటే:
మ్యాచ్ ఉత్కంఠగా సాగుతున్న సమయంలో చాహల్ విసిరిన నోబాల్ మ్యాచ్ ఫలితాన్ని మార్చేసింది. ఇన్నింగ్స్ 17 ఓవర్ చివరి బంతికి చాహల్ మిల్లర్‌ను అవుట్ చేశాడు. కానీ చాహల్ క్రీజ్ వెలుపలికి వచ్చి బంతిని విసరడంతో మిల్లర్ బతికిపోయాడు. లైఫ్ వచ్చాక రెచ్చిపోయి ఆడి 31 బంతుల్లోనే 21 పరుగులు చేశాడు. హెన్రిక్ క్లాసేన్‌తో కలిసి మ్యాచ్ ఫలితాన్ని మార్చేశాడు.
తర్వాత కూడా చాహల్ మరో నోబాల్ వేశాడు. ఇన్నింగ్స్ 22వ ఓవర్లో ఈ స్పిన్నర్ విసిరిన బంతి నో బాల్ కావడంతో క్లాసేన్ మరుసటి బంతిని సిక్సర్ బాదాడు. ఆ ఓవర్లో దక్షిణాఫ్రికా 15 పరుగులు రాబట్టింది. మిల్లర్‌ను చాహల్ ఎల్బీగా పెవిలియన్ చేర్చాడు. కానీ తర్వాత క్రీజులోకి వచ్చిన ఆండిలె ఫెహ్లుక్వాయో ఐదు బంతుల్లోనే 23 పరుగులు చేసి మ్యాచ్ ఫలితాన్ని మార్చేశాడు.
ఈ జనరేషన్‌కు ఇంతటి టెక్నాలజీ అందుబాటులో ఉన్నా నోబ్‌లు వేయడం సరికాదన్నాడు. నో బాల్ తర్వాత ఫ్రీ హిట్ వస్తుందని తెలిసీ ఇలా చేసుండకూడదని అభిప్రాయపడ్డాడు. 50 ఓవర్ల క్రికెట్‌లో ఒక్కోసారి ఫాస్ట్ బౌలర్లు పొరబాటు పడుతుంటారని తెలిపాడు. అదీ గాక భారత జట్టు 3-0 తేడాతో దక్షిణాఫ్రికా జట్టుపై గెలవడంతో కాస్త రిలాక్స్‌డ్‌గా ఆడిందంటూ వ్యంగ్యంగా వివరణ ఇచ్చాడు. ఈ అవకాశాన్ని మిల్లర్ బాగా వాడుకున్నాడంటూ విశ్లేషించాడు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.