కేప్‌టౌన్‌లో దక్షిణాఫ్రికా బ్యాటర్లు వణికిపోతున్నారు. టాస్ గెలిచిన తర్వాత బ్యాటింగ్ ఎందుకు తీసుకునన్నామని బాధపడుతున్నారు. ఆ రీతిలో భారత్ బౌలర్లు బెంబేలెత్తిస్తున్నారు. సిరాజ్ (4/9), బుమ్రా (1/16) ధాటికి 34 పరుగులకే సౌతాఫ్రికా అయిదు వికెట్లు కోల్పోయింది. సఫారీ సేన టాప్-4 బ్యాట్స్‌మెన్ సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా అయిదు పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది. ఓపెనర్ మార్క్‌రమ్ (2)ను సిరాజ్ పెవిలియన్‌కు చేర్చాడు. సిరాజ్ విసిరిన నిప్పులు చెరిగే బంతిని డిఫెండ్ చేయడానికి యత్నించిన మార్క్‌రమ్ స్లిప్‌లో ఉన్న యశస్వీ జైశ్వాల్ చేతికి చిక్కాడు. ఆ తర్వాత డీన్ ఎల్గర్ (4) క్లీన్ బౌల్డ్ చేశాడు. దక్షిణాఫ్రికా కెప్టెన్ ఎల్గర్ తన కెరీర్ చివరి టెస్టు ఆడుతున్న విషయం తెలిసిందే.

అనంతరం అరంగేట్ర ప్లేయర్ ట్రిస్టన్ స్టబ్స్ (3)ను బుమ్రా బౌన్సర్‌తో బోల్తా కొట్టించాడు. డిఫెండ్ చేయడానికి యత్నించిన స్టబ్స్ రోహిత్ చేతికి చిక్కాడు. కాసేపటికే సిరాజ్.. టోనీ డి జోర్జి (2), బెండింగ్‌హమ్ (12)ని ఔట్ చేసి సౌతాఫ్రికాను పీకల్లోతు కష్టాల్లోకి నెట్టాడు. సిరాజ్, బుమ్రా సాధించిన వికెట్ల వీడియోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది.
కాగా, టాస్ అనంతరం రోహిత్ శర్మ మాట్లాడుతూ .. తొలి టెస్టులో సత్తాచాటలేకపోయామని, కానీ ఇవాళ మ్యాచ్‌లో టీమిండియా సామర్థ్యం చూపిస్తామని అన్నాడు.''పిచ్ చాలా బాగుంది. ఈ పిచ్‌పై తొలుత బ్యాటింగ్ చేస్తే వచ్చే సవాళ్లను మేం అర్థం చేసుకోగలం. సీమర్లకు ఇది అనుకూలంగా ఉంటుంది. ఈ అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకుంటాం. గతం గురించి మర్చిపోవడమే చాలా కీలకం. స్కోరుబోర్డుపై సాధ్యమైన పరుగులు, 20 వికెట్లు తీయడానికి ప్రయత్నిస్తాం. తొలి టెస్టులో ఇది సాధ్యం కాలేదు. కానీ, ఈసారి సత్తాచాటుతాం. జట్టులో రెండు మార్పులు ఉన్నాయి. అశ్విన్ స్థానంలో జడేజా, శార్దూల్ ఠాకూర్ స్థానంలో ముకేశ్ కుమార్ వచ్చారు'' అని రోహిత్ చెప్పాడు.
ముకేశ్ కుమార్ ఈ మ్యాచ్‌తో టెస్టుల్లో అరంగేట్రం చేస్తున్నాడు. కాగా, తొలి టెస్టులో టీమిండియా ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో ఓటమిపాలైన సంగతి తెలిసిందే. 31 ఏళ్ల నుంచి ఇప్పటివరకు భారత్ సౌతాఫ్రికా పర్యటనకు ఎనిమిది సార్లు వచ్చింది. కానీ సిరీస్‌ను అందుకోలేకపోయింది. ఒకసారి సిరీస్‌ను డ్రా గా ముగించింది. ఆ ఘనతను 2011లో ఎంఎస్ ధోనీ సాధించాడు.