టీమిండియాలో శుభ్‌మన్ గిల్ ప్లేస్‌కు డేంజర్ బెల్స్ మోగినట్టే ఉన్నాయి. గిల్ స్థానానికి ముప్పు మొదలైందని ఇటీవల వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్ అభిప్రాయపడిన సంగతి తెలిసిందే. వన్డేలు మినహా టెస్టు, టీ20 ఫార్మాట్‌లో తేలిపోతున్నాడని మంజ్రేకర్ అన్నాడు. భారత్ జట్టులో ఉండే పోటీనీ అర్థం చేసుకుని నిలకడగా పరుగులు చేయాలని సూచించాడు.
తాజాగా గిల్ బ్యాటింగ్‌పై దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ కూడా మాట్లాడాడు. గిల్ బ్యాటింగ్‌ను ఉద్దేశించి కీలకమైన వ్యాఖ్యలు చేశాడు. టెస్టు క్రికెట్ ఆడుతున్నామనే విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఆడాలన్నాడు. ''టెస్టు క్రికెట్‌లో గిల్ దూకుడుగా ఆడటానికి ప్రయత్నిస్తున్నట్లు ఉంది. టీ20, వన్డే ఫార్మాట్‌లతో పోలిస్తే టెస్టు ఫార్మాట్ భిన్నంగా ఉంటుంది. వైట్ బాల్ కంటే సుదీర్ఘ ఫార్మాట్‌లో వాడే రెడ్ బాల్ గాల్లో కాస్త ఎక్కువగా కదులుతుంది. బౌన్స్ కూడా ఎక్కువగా లభిస్తుంది. అది మైండ్‌లో ఉంచుకొని గిల్ ఆడాలి''

''శుభ్‌మన్ గిల్ తన కెరీర్‌ను గొప్పగా ఆరంభించాడు. అతడు ఆడిన షాట్లను మనం కొనియాడాం. అతడు మునపటిలా ఫామ్‌ను అందుకుంటాడని ఆశిస్తున్నా. మరింత గొప్పగా శ్రమించి భవిష్యత్తులో బాగా ఆడాలని కోరుకుంటున్నా'' అని గవాస్కర్ అన్నాడు.
ఇటీవల సెంచూరియన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో గిల్ రెండు ఇన్నింగ్స్‌ల్లో విఫలమయ్యాడు. మొదటి ఇన్నింగ్స్‌లో రెండు పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 26 పరుగులు చేసి ఔటయ్యాడు. అంతేగాక టెస్టుల్లో ఏవరేజ్ స్కోరు 30 కంటే తక్కువగా 2023ని కూడా ముగించాడు. వరుసగా మూడేళ్ల నుంచి టెస్టుల్లో అతడి సగటు స్కోరు 30 కంటే తక్కువగానే ఉండటం గమనార్హం.
మరోవైపు గిల్ ఆడిన గత 10 ఇన్నింగ్స్‌లో ఒక్కసారే 30కు పైగా పరుగులు సాధించాడు. అది కూడా ఫ్లాట్ పిచ్ అహ్మదాబాద్‌పై ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టులోనే. ఈ నేపథ్యంలో నెట్టింట్లో అతడిపై విపరీతంగా ట్రోల్స్ వస్తున్నాయి. కఠిన పిచ్‌లపై కాకుండా అహ్మదాబాద్ పిచ్‌పై మ్యాచ్‌ను నిర్వహించండి, తిరిగి గిల్ ఫామ్‌లోకి వస్తాడంటూ నెటిజన్లు వ్యంగ్యంగా ట్రోల్ చేస్తున్నారు.