తొలి వన్డేలో ఆల్‌రౌండ్ షోతో సత్తాచాటిని టీమిండియా రెండో మ్యాచ్‌లో తడబడింది. గబేహా వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో వన్డేలో భారత్ ఎనిమిది వికెట్ల తేడాతో ఓటమిపాలైంది.మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా సఫారీ బౌలర్ల ధాటికి 46.2 ఓవర్లలో 211 పరుగులకు ఆలౌటైంది. అనంతరం ఛేదనలో సౌతాఫ్రికా రెండు వికెట్లు కోల్పోయి 42.3 ఓవర్లలో లక్ష్యాన్ని అందుకుంది.
అయితే ఈ మ్యాచ్‌తో రింకూ సింగ్ వన్డేల్లో అరంగేట్రం చేశాడు. 136 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు రింకూ క్రీజులోకి వచ్చాడు. దూకుడుగా ఆడే ప్రయత్నం చేసి ఔటయ్యాడు. 14 బంతుల్లో 17 పరుగులు చేశాడు. దీనిలో రెండు ఫోర్లు,ఒక సిక్సర్ ఉన్నాయి. అయితే రింకూ బౌలింగ్‌లో సత్తాచాటడం విశేషం.

212 పరుగుల లక్ష్యంతో ఛేదనకు దిగిన దక్షిణాఫ్రికా ఓపెనర్లు డి జోర్జి (119*; 122 బంతుల్లో), హెండ్రిక్స్ (52; 81 బంతుల్లో) అదరగొట్టారు. తొలి వికెట్‌కు 130 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.హెండ్రిక్స్ ఔటైనా డసెన్ (36)తో కలిసి జోర్జి స్కోరుబోర్డు ముందుకు నడిపించాడు. అయితే వాండర్ డసెన్‌ను రింకూ తెలివిగా బోల్తాకొట్టించాడు.
రింకూ వేసిన బంతిని అంచనా వేయడంలో విఫలమైన వాండర్ డసెన్ వికెట్ కీపర్ సంజు శాంసన్ చేతికి చిక్కాడు. వికెట్ తీసిన అనంతరం రింకూ గ్రాండ్‌గా సంబరాలు చేసుకున్నాడు. సహచర ఆటగాళ్లు ఆశ్చర్యంతో ఆనందం వ్యక్తం చేశారు. రింకూకి అంతర్జాతీయ క్రికెట్‌లో ఇదే తొలి వికెట్.
రింకూ సింగ్ తొలి వన్డేలో చోటు దక్కించుకోలేకపోయాడు. టెస్టు సిరీస్ కోసం శ్రేయస్ అయ్యర్ వన్డేలకు దూరమవ్వడంతో, రింకూ రెండో మ్యాచ్‌లో స్థానం దక్కించుకున్నాడు. అరంగేట్ర వన్డేలో సిక్సర్లతో అలరిస్తాడనుకుంటే వికెట్‌తో సత్తాచాటాడు. కాగా, మూడు వన్డేల సిరీస్‌లో నిర్ణయాత్మక ఆఖరి మ్యాచ్ డిసెంబర్ 21న జరగనుంది.