
హైదరాబాద్: గత అనుభవాలను ఉపయోగించుకుని ఉపఖండంలో అద్భుత ప్రదర్శన చేస్తామని దక్షిణాఫ్రికా పేసర్ కగిసో రబాడ అన్నాడు. మూడు టీ20లు, మూడు టెస్టు మ్యాచ్‌ల పర్యటన కోసం సఫారీ జట్టు త్వరలో టీమిండియా పర్యటనకు రానున్న సంగతి తెలిసిందే.
భారత్‌లో సపారీ జట్టు పర్యటన సెప్టెంబర్ 15 నుంచి ఆరంభం కానుంది. ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికా యువపేసర్ కగిసో రబాడ మాట్లాడుతూ "జట్టు విజయం సాధించేందుకు ఏం చేయాలో ముందు ఆలోచించాలి. నేనిప్పుడు దానిపైనే దృష్టి సారించా. ఉపఖండంలో అంతకముందు ఆడిన అనుభవం ఉంటే కఠిన పరిస్థితుల్లో ఏం చేయాలో ఒక అవగాహన వస్తుంది" అని అన్నాడు.
గతంలో భారత పర్యటనకు వచ్చిన సఫారీ జట్టు వన్డే, టీ20 సిరీసులు గెలిచినప్పటికీ టెస్టు సిరిస్‌ను 3-0తో ఓడిపోయింది. దీనిపై రబాడ "గత పర్యటనలో మేం విజయవంతం అయ్యాం. వన్డే, టీ20 సిరీసులు గెలిచాం. కానీ టెస్టు సిరీసులో ఓటమి పాలయ్యాం. ఎందుకంటే అప్పుడు పిచ్‌లు చాలా కఠినంగా ఉన్నాయి" అని చెప్పుకొచ్చాడు.
"ఉదాహరణకు తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో పరిస్థితి 200 vs 200గా ఉంది. మేము గనుత తొలుత బ్యాటింగ్ చేసుంటే పరిస్థితి మరోలా ఉండేది. గేమ్‌ను ఛేజ్ చేసి ఉండి ఉండేవాళ్లం. అయితే, 3-0తో సిరిస్‌ను చేజార్చుకోవడం నిరాశకు గురి చేసింది" అని రబాడ అన్నాడు. ఈ పర్యటనలో స్పిన్ బౌలింగ్‌ను ఏవిధంగా ఎదుర్కొంటారన్న ప్రశ్నకు
"ఇటీవలే కఠిన పరిస్థితులు ఉండే శ్రీలంక పర్యటన ముగించాం. స్పిన్‌ను ఎలా ఎదుర్కొంటారని అంతా ప్రశ్నించారు. కానీ ఏం జరిగిందో మీకు తెలుసు. ఇంతకు ముందు అక్కడ ఆడిన ఆటగాళ్లు ఉన్నారు. శ్రీలంకలో ఎలా ఆడాలో, ఎలాంటి వ్యూహాలు అమలు చేయాలో వారు చెప్పారు. అవన్నీ అక్కడ పనిచేశాయి" అని రబాడ చెప్పుకొచ్చాడు.
"మీరు మొదటిసారి అక్కడకు వెళ్ళినప్పుడు... అక్కడ ఏమి చేయాలో మీకు తెలియదు. శ్రీలంకలో డుప్లెసిస్ ఎలా బ్యాటింగ్ చేశాడో చూస్తే మీకు అర్ధం అవుతుంది. అతడు జట్టుకు మంచి ఆరంభాన్నిచ్చాడు. అతడి ఆట అక్కడ పరిస్థితులు తెలుసని మనందరికీ చూపించింది" అని రబాడ పేర్కొన్నాడు.