తొలి టెస్టులో ఓటమిపాలైన టీమిండియా దక్షిణాఫ్రికాతో ఆఖరి టెస్టుకు సిద్ధమైంది. కేప్ టౌన్‌లో జరగనున్న ఈ రెండో టెస్టులో విజయం సాధించాలని భారత్ కసిగా బరిలోకి దిగుతోంది. సిరీస్‌ను 1-1తో సమంగా పంచుకోవాలంటే ఈ మ్యాచ్‌లో రోహిత్ సేన తప్పక గెలవాల్సిందే. మ్యాచ్ 'డ్రా' గా ముగిసినా సిరీస్ చేజారినట్లే. కాగా, రెండో టెస్టు ప్రారంభానికి ముందు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ విలేకరుల సమావేశంలో మాట్లాడాడు.
''తొలి టెస్టు ఫస్ట్ ఇన్నింగ్స్‌లో సుమారు 160 పరుగుల వెనుకంజలో ఉన్నాం. సెంచూరియన్ పిచ్‌పై ఆ పరుగులు ఎంతో కీలకం. అయితే మేం మొదట 245 పరుగులు చేశాం. అది మంచి స్కోరే. కానీ దక్షిణాఫ్రికాను కట్టడి చేయలేకపోయాం. మేం మార్గాలు అన్వేషిస్తున్నాం. గతంలో కూడా తొలుత తడబడినా తర్వాత సత్తాచాటాం''

''తుదిజట్టు విషయానికొస్తే.. ఇంకా ఖరారు కాలేదు. దాని గురించి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. మా జట్టులో అనుభవం లేని పేసర్లు ఉన్నారు. కానీ జట్టుగా మేం వారిపై నమ్మకం ఉంచాలి. తొలి టెస్టు ముందు ప్రెస్ మీట్‌లో చెప్పిన మాటలకి ఇప్పటికీ కట్టుబడిఉన్నా. ప్రసిధ్ కృష్ణ మంచి సామర్థ్యం ఉన్న బౌలర్. అది అతడి తొలి టెస్టు మాత్రమే. మొదటి మ్యాచ్‌లో ఎవరైనా కాస్త ఇబ్బంది పడతారు'' అని రోహిత్ అన్నాడు. ప్రసిధ్ స్థానంలో ముకేశ్‌ను తీసుకోవాలని చర్చలు జరుగుతున్న నేపథ్యంలో రోహిత్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
అయితే న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్ కోసం సౌతాఫ్రికా ప్రకటించిన జట్టుపై రోహిత్ శర్మ స్పందించాడు. న్యూజిలాండ్ పర్యటనకు ఎంపిక చేసిన 14 మంది జట్టులో సగం మందికి పైగా అన్‌క్యాప్డ్ ప్లేయర్లే ఉండటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 'సౌతాఫ్రికా20' లీగ్ (SA20) కోసం దక్షిణాఫ్రికా బోర్డు ఈ నిర్ణయం తీసుకుందని పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.
''నా దృష్టిలో టెస్టు క్రికెటే అత్యుత్తమం. ఆ ఫార్మాట్‌లోనే ప్రధాన ఆటగాళ్లు ఆడాలనుకుంటా. కానీ వాళ్లకు వారి సమస్యలు ఉంటాయి. వారికో ఏదో సమస్య ఉందని కచ్చితంగా భావిస్తున్నా. కానీ అదేంటో తెలియదు. సౌతాఫ్రికా క్రికెట్ బోర్డులో అంతర్గతంగా ఏం జరుగుతుందో నాకు తెలియదు. కానీ టెస్టులను కాపాడాలి. ఇది ఏ ఒకట్రెండు దేశాల బాధ్యత మాత్రమే కాదు. క్రికెట్ ఆడుతున్న ప్రతి ఒక్కరి బాధ్యత'' అని రోహిత్ అన్నాడు.