భారత్ విశ్వవిజేతగా నిలిచింది. టీ20 వరల్డ్ కప్-2024 ఛాంపియన్‌గా అవతరించింది. 13 ఏళ్లుగా ఎదురుచూస్తున్న ప్రపంచకప్ నిరీక్షణకు తెరదించుతూ చిరస్మరణీయ విజయాన్ని అందుకుంది. బార్బడోస్ వేదికగా నరాలు తెగే ఉత్కంఠభరితంగా దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్‌లో టీమిండియా ఏడు పరుగుల తేడాతో గెలిచి టైటిల్ సాధించింది.
మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 176 పరుగులు చేసింది. విరాట్ కోహ్లి (76; 59 బంతుల్లో, 6 ఫోర్లు, 2 సిక్సర్లు), అక్షర్ పటేల్ (47; 31 బంతుల్లో, 1 ఫోర్, 4 సిక్సర్లు), శివమ్ దూబె (27; 16 బంతుల్లో, 3 ఫోర్లు, 1 సిక్సర్) సత్తాచాటారు. కేశవ్ మహరాజ్ (2/23), నోకియా (2/26) చెరో రెండు వికెట్లు తీశారు.

అనంతరం ఛేదనలో దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లకు 169 పరుగులు చేసింది. హెన్రిచ్ క్లాసెన్ (52; 27 బంతుల్లో, 2 ఫోర్లు, 5 సిక్సర్లు), డికాక్ (39; 31 బంతుల్లో, 4 ఫోర్లు, 1 సిక్సర్) పోరాడాడు. హార్దిక్ పాండ్య (3/20) మూడు వికెట్లు, బుమ్రా (2/18), అర్షదీప్ సింగ్ (2/20) చెరో రెండు వికెట్లతో విజృంభించారు. అయితే సౌతాఫ్రికా విజయానికి ఆఖరి అయిదు ఓవర్లలో 30 పరుగులే అవసరం. సఫారీ జట్టు చేతిలో ఇంకా ఆరు వికెట్లు ఉండటం.. క్రీజులో క్లాసెన్, మిల్లర్ కూడా ఉండటంతో విజయంపై భారత్ ఆశలు సన్నగిల్లాయి.
కానీ బుమ్రా, హార్దిక్, అర్షదీప్ అద్భుతంగా బౌలింగ్ చేశారు. ప్రత్యర్థిని చిత్తుచేస్తూ జగజ్జేతగా టీమిండియాను నిలిపారు. 2007 తర్వాత భారత్ మరోసారి టీ20 ప్రపంచకప్ అందుకుంది. ఈ నేపథ్యంలో తొలి టీ20 కప్‌ను దేశానికి అందించిన భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ సోషల్ మీడియా వేదికగా స్పందించాడు. ఉత్కంఠ పోరులో ప్రశాంతతో ఉంటూ విజయాన్ని అందుకున్న టీమిండియాను ధోనీ కొనియాడాడు.
''వరల్డ్ కప్ ఛాంపియన్స్-2024. నా హార్ట్ రేటు పెరిగిపోయింది. ప్రశాంతతో ఉండి, ఆత్మవిశ్వాసంతో మీరు చేయాలనుకున్నది చేశారు. వరల్డ్ కప్ అందించినందుకు భారతీయులందరి తరఫున ధన్యవాదాలు. కంగ్రాట్స్. అరె.. నాకు వెలకట్టలేని బర్త్‌డే గిఫ్ట్ ఇచ్చినందుకు థ్యాంక్యూ'' అని ధోనీ అన్నాడు. జులై 7న ధోనీ బర్త్‌డే. తన స్పెషల్ డేకు మరికొన్ని రోజులే సమయం ఉండటంతో బర్త్‌డే గిఫ్ట్ ఇచ్చారంటూ టీమిండియాకు ధోనీ థ్యాంక్స్ చెప్పాడు.