
హైదరాబాద్: కేవలం వన్డే మ్యాచ్‌లకే పరిమితమైన మనీశ్ పాండే తాజాగా భారత టీ20 జట్టుకు ఎంపికయ్యాడు. అతనిపై నమ్మకముంచుకున్న సెలక్టర్లను నిరుత్సాహపర్చలేదు. 48బంతుల్లో 79పరుగులు చేసి ధోనీ భాగస్వామ్యానికి సరితూగాడు. నాలుగు వికెట్ల అనంతరం క్రీజులోకి వచ్చిన మనీశ్ పాండే తనదైన వేగంతో దూసుకుపోయాడు.
భారత బౌలర్లను పట్టించుకోకుండా ఏకధాటిగా బాదుడే పనిగా పెట్టుకొని బౌండరీల వర్షం కురిపించిన సఫారీలు గెలిచారు. దీంతో మ్యాచ్ అనంతరం మనీశ్ పాండే మనో గతాన్ని ట్విట్టర్ ద్వారా వెలిబుచ్చాడు. 'మమ్మల్ని ప్రోత్సహించినందుకు అందరికీ ధన్యవాదాలు. దురదృష్టవశాత్తు ఇవాళ కలిసిరాలేదు. తర్వాతి మ్యాచ్‌లో మేమెంటో చూపిస్తాం' అని పేర్కొన్నాడు.
ఐపీఎల్ లీగ్‌లోని భారత ఆటగాళ్లలో మొదట సెంచరీని 2009 సంవత్సరంలోనే నమోదు చేశాడు పాండే. ఇప్పటికే ఈ సిరీస్‌లో ఇరు జట్లు 1-1తో టై అయ్యాయి. ఇక జరగబోయే డిసైడింగ్ మ్యాచ్ శనివారం కేప్‌టౌన్‌లోని న్యూ లాండ్స్‌లో జరగనుంది.
ఇదే మ్యాచ్‌లో ధోనీ కోపోద్రిక్తుడై మనీశ్ పాండేను తిట్టిపోశాడు. మ్యాచ్ ఆఖరి ఓవర్లో మనీశ్ పాండే చెప్పిన మాట వినకపోవడంతో కాస్త ఆవేశానికి గురైయ్యాడు ధోనీ. 'ఓయ్... ఇక్కడ చూడు. అటు ఏముందని చూస్తున్నావ్' అంటూ కాస్త గట్టిగానే చెప్పాడు. అయితే ఆఖరి వాక్యం వినపడింది కానీ, మొదటి వాక్యం స్టంప్ మైక్ లో సరిగా వినబడకపోవడంతో నెటిజన్లు తమదైన శైలిలో ఆ ఖాళీలను పూరిస్తున్నారు.