
హైదరాబాద్: దక్షిణాఫ్రికా గడ్డపై భారత్ మిడిలార్డర్ వైఫల్యం జట్టుని కంగారుపెడుతోందని మాజీ ఆల్‌రౌండర్ మహీందర్ అమరనాథ్ అభిప్రాయపడ్డాడు. 'సఫారీ గడ్డపై భారత మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ ఇంకా తమ బాధ్యతలు గుర్తించడం లేదు. ఒకవేళ టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ ఫెయిలైతే.. అప్పుడు జట్టు పరిస్థితి ఏంటి..? సిరీస్‌లో ఇప్పటి వరకు మిడిలార్డర్‌కి పెద్దగా పరీక్షలు ఎదురుకాలేదు.
ఒకవేళ విరాట్ కోహ్లి లేదా శిఖర్ ధావన్ క్రీజులో నిలిచి భారీ ఇన్నింగ్స్‌లు ఆడుతుండకపోతే పరిస్థితి ఎలా ఉండేదని ప్రశ్నించాడు. కానీ.. కఠిన పరిస్థితులు ఎదురైనప్పుడు బాధ్యతలు తీసుకునేందుకు మిగిలార్డర్ సిద్ధంగా ఉండాలి' అని అమరనాథ్ సూచించాడు.
పనిలో పనిగా అమర్‌నాథ్ యజువేంద్ర చాహల్, కుల్‌దీప్ యాదవ్‌లను పొగిడేశాడు. వన్డే సిరీస్ మొత్తానికి స్పిన్నర్లు కీలక పాత్ర పోషించారని తెలిపాడు. ఆరు వన్డేల సిరీస్‌లో ఇప్పటికే ఐదు వన్డేలు ముగియగా.. భారత్ జట్టు 4-1తో సిరీస్‌ని దక్కించుకుంది.
ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన అమరనాథ్.. వన్డే సిరీస్‌లో భారత్ బ్యాటింగ్ భారమంతా కెప్టెన్ విరాట్ కోహ్లి, ఓపెనర్ శిఖర్ ధావన్ మోస్తున్నారన్నాడు. గత మంగళవారం ముగిసిన ఐదో వన్డేలో రోహిత్ శర్మ శతకంతో ఫామ్‌లోకి రావడం కెప్టెన్‌కి ఉపశమనమని మాజీ ఆల్‌రౌండర్ వివరించాడు.
వన్డే సిరీస్‌లో ఇప్పటికే రెండు శతకాలు, ఒక అర్ధశతకం బాదిన విరాట్ కోహ్లి 429 పరుగులు చేయగా.. ఒక శతకం బాదిన శిఖర్ ధావన్ 305 పరుగుతో సత్తాచాటాడు. తాజాగా ఐదో వన్డేలో రోహిత్ శర్మ కూడా శతకంతో మెరిశాడు. దీంతో టాప్-3 బ్యాట్స్‌మెన్ ఫామ్‌లో ఉండి ఎవరోఒకరు భారీ స్కోరు చేస్తుండటంతో.. మిడిలార్డర్‌కి పరీక్షలు ఎదురవలేదు. స్లాగ్ ఓవర్లలో మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్‌కి బ్యాటింగ్ అవకాశం వస్తున్నా.. హిట్టింగ్ చేసిన దాఖలాలు లేవు.
రవిశాస్త్రి స్పందన:
మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌పై దృష్టి పెడుతున్నాం. మ్యాచ్ కీలకంగా మారినప్పుడు అతని ప్రతిభను అందరూ చూస్తారు. ఇప్పటి వరకు టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌లు అలాంటి పరిస్థితులు రాకుండానే మ్యాచ్‌ను గెలిపిస్తూ వస్తున్నారు.