India vs South Africa: మూడు డబుల్ సెంచరీలు.. 64 ఏళ్ల తర్వాత తొలిసారి!!

రాంచీ: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ (212; 255 బంతుల్లో 28x4, 6x6) డబుల్ సెంచరీ చేసాడు. 249 బంతుల్లో 28 ఫోర్లు, 5 సిక్సులతో ద్విశతకం సాధించిన అనంతరం పెవిలియన్ చేరాడు. ఇప్పటికే ఈ సిరీస్‌లో రెండు శతకాలు బాదిన రోహిత్.. మూడో టెస్ట్‌లో ఏకంగా డబుల్ సెంచరీ చేశాడు. వన్డేల్లో మూడు డబుల్ సెంచరీలు చేసిన రోహిత్‌కు టెస్టుల్లో తొలి ద్విశతకం. ఒకవైపు వికెట్స్ పడుతున్నా.. ఎంతో ఓపికగా ఆడుతూ వచ్చిన రోహిత్ డబుల్ సెంచరీ చేశాడు.

64 ఏళ్ల తర్వాత తొలిసారి:
మూడో టెస్టులో 'హిట్‌మ్యాన్' రోహిత్ శర్మ డబుల్ సెంచరీ సాధించడం ద్వారా భారత జట్టు సుదీర్ఘం విరామం తర్వాత అరుదైన ఘనతను అందుకుంది. టీమిండియా ఒక సిరీస్‌లో మూడు డబుల్ సెంచరీలు సాధించిన ఘనతను 64 ఏళ్ల తర్వాత మళ్లీ నమోదు చేసింది. 1955-56 సీజన్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన ద్వైపాక్షిక సిరీస్‌లో మూడు డబుల్ సెంచరీలు నమోదయ్యాయి. ఆ సిరీస్‌లో వినోద్ మన్కడ్ రెండు డబుల్ సెంచరీలు సాధించగా.. పాలీ ఉమ్ర్‌గర్ ద్విశతకం చేశాడు.

ఒకే సిరీస్‌లో మూడు డబుల్ సెంచరీలు:
64 ఏళ్ల తర్వాత టీమిండియా ఒకే సిరీస్‌లో మూడు డబుల్ సెంచరీలు చేసింది. ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో జరుగుతున్న సిరీస్‌లో తొలి టెస్టులో మయాంక్ అగర్వాల్ డబుల్ సెంచరీ చేయగా.. రెండో టెస్టులో విరాట్ కోహ్లీ ద్విశతకం చేసాడు. తాజా టెస్టు మ్యాచ్‌లో రోహిత్ శర్మ డబుల్ సెంచరీతో సత్తాచాటాడు. మూడు డబుల్ సెంచరీలు రావడం భారత్‌కు ఓవరాల్‌గా రెండోసారి.

అర్ధ సెంచరీకి చేరువలో జడేజా:
ప్రస్తుతం మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా ఆరో వికెట్ కోల్పోయింది. 104వ ఓవర్ వేసిన లిండే మూడో బంతికి వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా (24; 42 బంతుల్లో 3x4)ను బౌల్డ్ చేశాడు. మరోవైపు రవీంద్ర జడేజా వేగంగా పరుగులు చేస్తున్నాడు. రవిచంద్రన్ అశ్విన్ అండతో అర్ధ సెంచరీకి చేరువగా వచ్చాడు. 111 ఓవర్లు పూర్తయ్యేసరికి టీమిండియా ఆరు వికెట్ల నష్టానికి 446 పరుగులు చేసింది. క్రీజులో జడేజా (47), అశ్విన్ (13) ఉన్నారు.

రహానే సెంచరీ:
అంతకుముందు ఓపెనర్ రోహిత్ శర్మ (212) ద్విశతకం చేయగా.. వైస్ కెప్టెన్ అజింక్య రహానే (115) సెంచరీతో రాణించాడు. శనివారం 39 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన జట్టును రోహిత్-రహానేలు ఆదుకొని నాలుగో వికెట్‌కు 267 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ క్రమంలో సెంచరీ చేశాక రహానే, డబుల్ సెంచరీ చేశాక రోహిత్ పెవిలియన్ బాటపట్టారు. అనంతరం జడేజా, సాహా నిలకడగా ఆడుతున్న క్రమంలో.. సాహా ఔట్ అయ్యాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications