
జోహన్నెస్‌బర్గ్ వేదికగా జరిగిన టెస్టు మ్యాచ్‌లో టీమిండియా ఓడడంతో సిరీస్ ఫలితం కోసం ఈ నెల 11 నుంచి కేప్‌టౌన్‌లో జరగనున్న మూడో టెస్టు మ్యాచ్ కోసం వేచి చూడక తప్పని పరిస్థితి నెలకొంది. అంతకుముందు సెంచూరియన్ వేదికగా జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో ఇండియా గెలిచింది. దీంతో ప్రస్తుతం భారత్, సౌతాఫ్రికా టెస్టు సిరీస్‌లో 1-1తో సమంగా నిలిచాయి. కేప్‌టౌన్‌లో జరగనున్న మూడో టెస్టు మ్యాచ్‌లో ఏ జట్టు గెలిస్తే సిరీస్ ఆ టీంనే వరిస్తుంది. దీంతో సిరీస్ గెలుపే లక్ష్యంగా సౌతాఫ్రికాలో టీమిండియా అడుగుపెట్టడంతో మ్యాచ్ జరగనున్న కేప్‌టౌన్ వేదికలో మన రికార్డుల గురించి చర్చ మొదలైంది. 1992 నుంచి 2018 వరకు కేప్‌టౌన్ వేదికగా సౌతాఫ్రికాతో టీమిండియా 5 టెస్టు మ్యాచ్‌లు ఆడింది. ఒక్క సారి కూడా విజయం సాధించలేకపోయింది. రెండు మ్యాచ్‌లను డ్రా చేసుకోగా, మూడింట్లో ఓడింది.
1992లో తొలి సారి సౌతాఫ్రికాతో టీమిండియా కేప్‌టౌన్‌లో తలపడింది. జనవరి 2 నుంచి 6 మధ్య జరిగిన ఆ మ్యాచ్ డ్రాగా ముగిసింది. సిరీస్‌లో అది నాల్గో మ్యాచ్. ఆ తర్వాత 1996లో మళ్లీ కేప్‌టౌన్ వేదికగా సౌతాఫ్రికాతో భారత్ తలపడింది. ఆ మ్యాచ్ కూడా జనవరి 2 నుంచి 6 మధ్య జరిగింది. అయితే ఆ మ్యాచ్‌లో భారత్ 282 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. అది సిరీస్‌లో రెండవ మ్యాచ్. అనంతరం 2006లో కేప్‌టౌన్ వేదికగా భారత్ టెస్టు మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్ కూడా జనవరి 2 నుంచి 6 మధ్యే జరిగింది. ఆ మ్యాచ్‌లోనూ టీమిండియా ఓడిపోయింది. సౌతాఫ్రికా 5 వికెట్ల తేడాతో గెలిచింది. సిరీస్‌లో ఆ మ్యాచ్ మూడవది.
ఇక ఇరు జట్లు నాలుగో సారి 2010లో కేప్‌టౌన్ వేదికగా తలపడ్డాయి. ఈ మ్యాచ్ కూడా జనవరి 2 నుంచి 6 మధ్యనే జరిగింది. ఇలా కేప్‌టౌన్ వేదికగా భారత్ ఆడిన తొలి నాలుగు టెస్టు మ్యాచ్‌లు జనవరి 2 నుంచి 6 మధ్యనే జరగడం విశేషం. అయితే ఆ మ్యాచ్‌ను టీమిండియా డ్రాగా ముగించింది. సిరీస్‌లో అది మూడో మ్యాచ్. ఇక చివరి సారిగా 2018లో కేప్‌టౌన్ వేదికగా భారత జట్టు సఫారీలతో తలపడింది. ఆ మ్యాచ్‌లో 72 పరుగుల తేడాతో ప్రోటీస్ జట్టునే విజయం వరించింది. జనవరి 5 నుంచి 8 మధ్య ఈ మ్యాచ్ జరిగింది. సిరీస్‌లో మొదటి మ్యాచ్. కాగా ఇప్పుడు జరగబోయే మూడో టెస్టు మ్యాచ్ కూడా జనవరిలోనే జరగనుంది. దీంతో ఇప్పటివరకు కేప్‌టౌన్ వేదికగా భారత్ ఆడిన టెస్టు మ్యాచ్‌లన్నీ జనవరిలోనే జరగడం విశేషం. అయితే ఇప్పటివరకు కేప్‌టౌన్‌లో విజయం సాధించని భారత్ ఈ సిరీస్ నెగ్గాలంటే మాత్రం గత రికార్డులను పక్కన పెట్టి గెలిచి చరిత్ర తిరగ రాయాల్సిందే.