టీ20 ప్రపంచకప్‌లో భారత్ మహా సమరానికి సిద్ధమైంది. బార్బడోస్ వేదికగా దక్షిణాఫ్రికాతో శనివారం ఫైనల్‌లో తలపడనుంది. 11 ఏళ్ల నుంచి కలగా మిగిలిపోతున్న ఐసీసీ ట్రోఫీను దక్కించుకోవడానికి టీమిండియా మరో అడుగు దూరంలో మాత్రమే నిలిచింది. జట్టు నిండా మ్యాచ్ విన్నర్లు ఉన్న భారత్ జట్టే టైటిల్ ఫేవరేటే. కానీ ప్రత్యర్థి సౌతాఫ్రికాను తక్కువగా అంచనా వేయలేని పరిస్థితి.
ఈ ప్రపంచకప్‌లో భారత్, దక్షిణాఫ్రికా రెండూ ఓటమెరుగని జట్లే. లీగ్, సూపర్-8 స్టేజ్‌ల్లో విజయాలతో హోరెత్తించి, సెమీఫైనల్స్‌ను సునాయాసంగా గెలిచి ఫైనల్‌కు దూసుకొచ్చాయి. టీ20ల్లో ఇరు జట్లు 26 సార్లు తలపడగా 14 మ్యాచ్‌ల్లో టీమిండియా గెలిచింది. 11 మ్యాచ్‌ల్లో సౌతాఫ్రికా విజయం సాధించగా, ఓ మ్యాచ్ రద్దయింది. టీ20 ప్రపంచకప్‌లో ఇరు జట్లు ఆరు సార్లు తలపడగా భారత్ నాలుగు, సఫారీ సేన రెండు సార్లు విజయం సాధించాయి.

అయితే రికార్డుల పరంగా భారత్ మెరుగైన స్థితిలో ఉన్నప్పటికీ దక్షిణాఫ్రికాను తక్కువగా అంచనా వేయలేని పరిస్థితి. బలమైన బ్యాటింగ్, బౌలింగ్‌తో జట్టు పటిష్టంగా ఉంది. అంతేగాక మెరుపు ఫీల్డింగ్ చేస్తుంది. ఈ నేపథ్యంలో తొలిసారి ప్రపంచకప్ ఫైనల్‌కు వచ్చిన దక్షిణాఫ్రికాను కట్టడి చేయాలంటే భారత్ పక్కా ప్రణాళికలతో బరిలోకి దిగాలి. ప్రతి ప్లేయర్ తమ అత్యుత్తమ ప్రదర్శన చేయాలి. విజయంలో కీలక పాత్ర పోషించే ఆటగాళ్లతో జట్టు కూర్పు సిద్ధం చేయాలి.
కానీ సౌతాఫ్రికా ఫైనల్‌లో గత మ్యాచ్‌ల్లో తుదిజట్టునే కొనసాగించాలని భారత కెప్టెన్ రోహిత్ శర్మ భావిస్తున్నాడు. కీలక మార్పులో ఆటగాళ్లను మార్చకూడదని యోచిస్తున్నాడు. అందుకే ఫామ్ కోల్పోయిన విరాట్ కోహ్లి, శివమ్ దూబెను తుదిజట్టులో కొనసాగించనాలనుకుంటున్నాడు. అయితే వన్డే వరల్డ్ కప్ ఫైనల్‌లోనూ రోహిత్ ఇదే తరహా ప్లాన్‌తో వచ్చాడు. సూర్యకుమార్ ఫామ్ లేకపోయినా జట్టుకూర్పు మార్చవద్దని తుదిపోరులో కొనసాగించాడు.
ఈ వ్యూహం విఫలమైంది. సూర్య ఫైనల్‌లోనూ ఫ్లాప్ అయ్యాడు. జట్టుకు కీలక పరుగులు అవసరమైన సమయంలో భాధ్యతాయుతంగా ఆడకుండా వికెట్ చేజార్చుకున్నాడు. ఇది జట్టుపై తీవ్ర ప్రతికూలత చూపించింది. ఇప్పుడు దూబె, కోహ్లి ఇద్దరిని కొనసాగించడం కూడా అలాంటి నెగటివ్ ఎఫెక్ట్ చూపుతుందేమోనని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దూబెను తప్పించి యశస్వీ జైస్వాల్‌కు అవకాశం ఇవ్వడం సరైనదిగా భావిస్తున్నారు.
భారత తుది జట్టు (అంచనా)
రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లి, రిషభ్ పంత్, సూర్యకుమార్, శివమ్ దూబె, హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్‌దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, జస్‌ప్రీత్ బుమ్రా