
సెంచూరియన్: ఆదివారం నుంచి ప్రారంభం కాబోయే భారత్, సౌతాఫ్రికా టెస్ట్ సిరీస్ కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. అయితే ఈ మ్యాచ్‌కు వరుణిడి నుంచి ఆటంకం తప్పేలా లేదు. మొత్తం ఐదు రోజుల మ్యాచ్‌లో దాదాపు ఓ రోజు మొత్తాన్ని వరుణుడు అడ్డుకునే అవకాశాలు ఉన్నాయి. మ్యాచ్ జరగనున్న సెంచూరియన్‌లో మొదటి రోజు వర్షం పడే అవకాశాలు తక్కువగా ఉన్నప్పకీ తర్వాతి రోజుల్లో వరుణుడు అడ్డుపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని స్థానిక వాతావరణశాఖ కేంద్రం హెచ్చరించింది.
దక్షిణాఫ్రికా ప్రభుత్వ వాతావరణ శాఖ ఇచ్చిన నివేదిక ప్రకారం సెంచూరియన్‌లో ఆదివారం రాత్రి వర్షం కురిసే అవకాశం ఉంది. రోజంతా వాతావరణం మేఘావృతమై ఉంటుంది. అలాగే ఆటలో రెండో రోజైనా సోమవారం జల్లులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంది. సోమవారం తొలి రెండు సెషన్‌లపాటు వర్షం కురిసే అవకాశం ఉందని, తద్వారా మొదటి రెండు సెషన్‌లు ఆట సాధ్యం కాకపోవచ్చని వాతావరణ శాఖ చెప్పింది.
ఇదే జరిగితే మ్యాచ్ ఫలితం తేలడం కష్టం అయ్యే అవకాశం ఉంటుంది. డ్రా అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి. కాగా వర్షం పడితే పిచ్ పేసర్లకు అనుకూలించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తద్వారా బ్యాటింగ్ చేయడం కష్టం అవ్వొచ్చు.
మరోవైపు ఈ బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్ కోసం భారత్, సౌతాఫ్రికా తీవ్రంగా ప్రాక్టీస్ చేశాయి. ఎవరికీ వారే సిరీస్ తామే గెలుస్తామనే ఆత్మవిశ్వాసంలో ఉన్నారు. గత పర్యటనలో సౌతాఫ్రికా వచ్చిన భారత ఆటగాళ్లలో చాలా మంది ఈ సారి కూడా జట్టులో ఉండడం టీమిండియాకు లాభించే అంశం. ఇప్పటివరకు సౌతాఫ్రికాలో ఒక్క సారి కూడా సిరీస్ గెలవని భారత జట్టు ఈ సారి గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది.
సిరీస్‌కు ఎంపికైన భారత జట్టు:
విరాట్ కోహ్లీ (కెప్టెన్), ప్రియాంక్ పంచాల్, కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, చటేశ్వర్ పుజారా, అజింక్య రహానే, శ్రేయాస్ అయ్యర్, హనుమ విహారి, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), అశ్విన్, జయంత్ యాదవ్, ఇషాంత్ శర్మ, మహమ్మద్ షమీ, ఉమేష్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్.
దక్షిణాఫ్రికా జట్టు:
డీన్ ఎల్గర్ (కెప్టెన్), టెంబా బావుమా (వికెట్ కీపర్), క్వింటన్ డి కాక్ (వికెట్ కీపర్), కగిసో రబడ, సరెల్ ఎర్వీ, బ్యూరాన్ హెండ్రిక్స్, జార్జ్ లిండే, కేశవ్ మహరాజ్, లుంగి ఎన్‌గిడి, ఐడెన్ మార్క్‌రామ్, వియాన్ ముల్డర్, అన్రిచ్ నోర్ట్జే, కీగన్ పీటర్సన్, రాస్సీ వాన్ డెర్ డుస్సెన్, కైల్ వెర్రెయిన్, మార్కో జాన్సెన్, గ్లెంటన్ స్టౌర్మాన్, ప్రేనెలన్ సుబ్రేయన్, సిసాండా మగాలా, ర్యాన్ రికెల్టన్, డువాన్ ఒలివియర్.