
హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఖాతాలో మరో రికార్డు బద్దలు కొట్టాడు. ఓ విదేశీ పర్యటనలో అత్యధిక పరుగులు చేసిన కెప్టెన్ల జాబితాలో కోహ్లీ రెండో స్థానంలో నిలిచాడు. అతనికంటే ముందు స్థానంలో దక్షిణాఫ్రికా మాజీ సారథి గ్రేమ్ స్మిత్ కొనసాగుతున్నాడు. సఫారీ పర్యటనలో అద్భుతమైన ప్రదర్శన చేసిన విరాట్ కోహ్లీ వెన్నునొప్పి కారణంగా చివరి టీ20 మ్యాచ్ ఆడలేకపోయాడు. అయినప్పటికీ అతను చేసిన పరుగుల జాబితా ప్రపంచంలోనే అత్యధిక పరుగులు చేసిన కెప్టెన్‌గా రెండో స్థానంలో ఉంది.
మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ను కోల్పోయిన భారత్ ఆ తర్వాత జరిగిన వన్డే, టీ20 సిరీస్‌లను సొంతం చేసుకుంది. ఈ పర్యటనలో మూడు ఫార్మాట్లలో 14 ఇన్నింగ్స్‌ల ద్వారా కోహ్లీ చేసిన పరుగులు 871. ఇందులో నాలుగు సెంచరీలు, రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. దీంతో కెప్టెన్ కోహ్లీ.. ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ అలెన్ బోర్డర్ రికార్డును అధిగమించాడు. 1985లో ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లిన ఆసీస్ జట్టుకు నాయకత్వం వహించిన బోర్డర్ 14 ఇన్నింగ్స్‌ల ద్వారా 785 పరుగులు సాధించాడు.
దక్షిణాఫ్రికా మాజీ సారథి గ్రేమ్ స్మిత్ 2003లో ఇంగ్లాండ్ పర్యటనలో 16 ఇన్నింగ్స్‌ల ద్వారా 937 పరుగులు సాధించి.. విదేశీ పర్యటనల్లో కెప్టెన్‌గా అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. కోహ్లీ(14 ఇన్నింగ్స్‌లు, 871 పరుగులు), బోర్డర్(14 ఇన్నింగ్స్‌లు, 785 పరుగులు), అలెస్టర్ కుక్(13 ఇన్నింగ్స్‌లు, 769 పరుగులు) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
సఫారీ పర్యటనకు ముందు టీమిండియా స్వదేశంలో ఆడిన అన్ని టెస్టు సిరిస్‌లను కైవసం చేసుకుని తిరుగులేని జట్టుగా నిలిచింది. అదే ఫామ్‌ను సఫారీ గడ్డపై కూడా ప్రదర్శిస్తారని ఊహించిన అభిమానులకు నిరాశ ఎదురైంది. జట్టు ఎంపిక, మైదానంలో అనవసర తప్పిదాలతో టెస్టు సిరీస్ 1-2తో చేజార్చుకుంది. దీంతో కోహ్లీసేనపై తీవ్ర విమర్శలు వచ్చాయి. అయితే జోహెన్స్ బర్గ్ వేదికగా జరిగిన మూడో టెస్టులో కోహ్లీసేన పుంజుకున్న తీరు అద్భుతం. దీంతో పాటు పలు చారిత్రాత్మక రికార్డులను సైతం కైవసం చేసుకుంది.