'డుప్లెసిస్ వ్యూహాత్మక తప్పిదంవల్లే తొలిరోజు టీమిండియాకు ఆధిక్యం'

హైదరాబాద్: పూణె వేదికగా టీమిండియాతో జరుగుతున్న రెండో టెస్టులో దక్షిణాఫ్రికా కెప్టెన్ డుప్లెసిస్ చేసిన వ్యూహాత్మక తప్పిదంవల్లే తొలి రోజు కోహ్లీసేన ఆధిక్యం సాధించిందని టీమిండియా మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ అన్నాడు. తొలిరోజు ఆటపై వీవీఎస్ లక్ష్మణ్ మాట్లాడుతూ విశాఖ టెస్టు నుంచి డుప్లెసిస్ కెప్టెన్సీ నిరాశపరుస్తోందని తెలిపాడు.
లక్ష్మణ్ మాట్లాడుతూ "డుప్లెసిస్ ఎల్లప్పుడూ చాలా తెలివైన క్రికెటర్. అయితే, విశాఖ టెస్టు నుంచి కెప్టెన్‌గా అతడు నిరాశపరుస్తున్నాడు. రబాడ తొలిసెషన్‌లో వికెట్ తీశాక, భోజన విరామం తర్వాత బంతి నేరుగా అతడికే ఇవ్వాల్సింది. టీ విరామానికి అరగంట ముందు మాత్రమే అతడి చేతికి బంతి వచ్చింది. ఇలా చేయడం వల్ల కొత్తగా వచ్చిన బ్యాట్స్‌మన్ క్రీజులో కుదురుకునే అవకాశం దొరికింది. పుజారా, కోహ్లీ, మయాంక్ లాంటి నైపుణ్యం గల ఆటగాళ్లు ఒక్కసారి కుదురుకుంటే వాళ్లని ఔట్ చేయడం కష్టం" అని మ్యాచ్ అనంతరం స్టార్ స్పోర్ట్స్ విశ్లేషణలో పేర్కొన్నాడు.

డుప్లెసిస్ చేసిన తప్పు వల్లే
లక్ష్మణ్ మాటలతో దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్ కూడా ఏకీభవించాడు. డుప్లెసిస్ చేసిన తప్పు వల్లే తొలిరోజు టీమిండియా ఆధిక్యం సాధించిందని అన్నాడు. గ్రేమ్ స్మిత్ మాట్లాడుతూ "ఈ రోజు మొత్తం దక్షిణాఫ్రికాకు కలిసి రాలేదు. లంచ్ నుంచి టీ విరామం వరకు రబాడ కేవలం మూడు ఓవర్లే బౌలింగ్ చేశాడు. వికెట్లు తీసి మంచి ఫామ్‌లో ఉన్న అతడికి బంతి ఎందుకు ఇవ్వలేదని అనుకున్నాం" అని అన్నాడు.

రబాడ తగినన్ని ఓవర్లు
"రబాడ తగినన్ని ఓవర్లు బౌలింగ్ చేయలేదనిపించింది. భారత జట్టు రన్‌రేట్ తగ్గించడమే దక్షిణాఫ్రికా లక్ష్యంగా పెట్టుకున్నట్టు కనిపించింది. ఒకవైపు కేశవ్ మహారాజ్, ఫిలాండర్ లాంటి బౌలర్లను వాడుతూనే మరో ఎండ్ నుంచి అటాకింగ్ చేయాల్సింది. టెస్టుల్లో గెలవాలంటే 20 వికెట్లు తీయాలి" అని గ్రేమ్ స్మిత్ తెలిపాడు.

లక్ష్మణ్ మాట్లాడుతూ
చివర్లో మళ్లీ లక్ష్మణ్ మాట్లాడుతూ "తొలిరోజు మొత్తంగా రబాడ 18 ఓవర్లు వేశాడు. అతడు వేసిన 18 ఓవర్లు బ్యాట్స్‌మన్ కుదురుకోకముందే వేశాడు. అయితే, సరైన సమయాల్లో వేయాల్సింది. అయినా సరే అతడు పుజారా, మయాంక్ వికెట్లు తీశాడు. దీనిని బట్టి డుప్లెసిస్ ఎలాంటి వ్యూహాత్మక తప్పిదం చేశాడో అర్థం చేసుకోవచ్చు" అని లక్ష్మణ్ తెలిపాడు.

తొలి రోజు ఆట ముగిసే సమయానికి
ఇదిలా ఉంటే, తొలి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 3 వికెట్లు కోల్పోయి 273 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో విరాట్ కోహ్లీ(63), అజ్యింకె రహానే(18) పరుగులతో ఉన్నారు. విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ అనంతరం కొద్దిసేపటికే వెలుతురు లేకపోవడంతో అంపైర్లు తొలిరోజు ఆటను 85.1 ఓవర్ల వద్ద నిలిపివేశారు.

మూడు వికెట్లు తీసిన రబాడ
మయాంక్ అగర్వాల్ (108), పుజారా (58) రాణించడంతో పాటు కోహ్లీ (63 బ్యాటింగ్), రహానె(18బ్యాటింగ్) విలువైన భాగస్వామ్యం నెలకొల్పారు. దీంతో భారత జట్టు భారీ స్కోర్ దిశగా అడుగులు వేస్తోంది. ఓపెనర్ రోహిత్‌శర్మ (14) ఒక్కడే నిరాశ పరిచినా దక్షిణాఫ్రికా పేసర్ రబాడ మూడు వికెట్లు తీశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications