టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్(6/15) ధాటికి దక్షిణాఫ్రికా వణికిపోయింది. బంతిని బ్యాటుకు తాకించాలంటే భయపడేలా సిరాజ్ బ్యాటర్లను బెంబేలెత్తించాడు. నిప్పులు చెరిగే బంతులు విసురుతూ వికెట్లతో సత్తాచాటాడు. అతడికి తోడుగా సీనియర్ బుమ్రా (2/25), కుర్రాడు ముకేశ్ కుమార్ (2/0) కూడా చెలరేగడంతో దక్షిణాఫ్రికా 23.2 ఓవర్లలోనే 55 పరుగులకే కుప్పకూలింది.
కేప్ టౌన్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో టాస్ గెలిచిన సౌతాఫ్రికా బ్యాటింగ్ ఎంచుకుంది. మ్యాచ్ మొదలైన కాసేపటికే బ్యాటింగ్ ఎందుకు తీసుకున్నామని దక్షిణాఫ్రికా బాధపడి ఉంటుంది. ఆ రీతిలో భారత్ బౌలర్లు చెలరేగారు. వికెట్ల వేటను సిరాజ్ మొదలుపెట్టగా ముకేశ్ ముగించాడు. మన పేసర్ల ధాటికి సౌతాఫ్రికా బ్యాటర్లు ఇద్దరంటే ఇద్దరే రెండంకెల స్కోరు చేశారు. టాప్ స్కోరర్లు కైల్ వెరియెన్నె (15), బెడింగ్‌హమ్ (12).

తొలుత ఓపెనర్ మార్క్‌రమ్ (2)ను సిరాజ్ పెవిలియన్‌కు చేర్చాడు. సిరాజ్ విసిరిన నిప్పులు చెరిగే బంతిని డిఫెండ్ చేయడానికి యత్నించిన మార్క్‌రమ్ స్లిప్‌లో ఉన్న యశస్వీ జైశ్వాల్ చేతికి చిక్కాడు. ఆ తర్వాత డీన్ ఎల్గర్ (4) క్లీన్ బౌల్డ్ చేశాడు. అనంతరం అరంగేట్ర ప్లేయర్ ట్రిస్టన్ స్టబ్స్ (3)ను బుమ్రా బౌన్సర్‌తో బోల్తా కొట్టించాడు.కాసేపటికే సిరాజ్.. టోనీ డి జోర్జి (2), బెండింగ్‌హమ్ (12)ని ఔట్ చేసి సౌతాఫ్రికాను పీకల్లోతు కష్టాల్లోకి నెట్టాడు.
ఆ తర్వాత బ్యాటర్లు క్రీజులోకి రావడం, పెవిలియన్‌కు చేరేడం.. ఇదే రిపీట్ అయ్యింది. సౌతాఫ్రికా స్కోరు 50 దాటితే స్టేడియంలో సఫారీసేన అభిమానులంతా సంతోషంతో చప్పట్లు కొట్టారు. దీన్నిబట్టి భారత్ పేసర్ల జోరు అర్థమై ఉంటుంది. ఈ క్రమంలో సిరాజ్ రికార్డు సృష్టించాడు. తొలి రోజు ఆటలో లంచ్ విరామంలోపు అయిదు వికెట్లు తీసిన భారత రెండో బౌలర్‌గా చరిత్రకెక్కాడు.
సిరాజ్ కంటే ముందు 1987లో భారత్ తరపున మణిందర్ సింగ్ ఈ ఘనత సాధించాడు. పాకిస్థాన్‌తో జరిగిన ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో మణిందర్ ఏడు వికెట్లు పడగొట్టాడు. 36 ఏళ్ల తర్వాత ఈ అరుదైన జాబితాలో సిరాజ్ చేరడం విశేషం. మరోవైపు భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాకు ఇదే అత్యల్ప స్కోరు. గతంలో 2015లో జరిగిన టెస్టులో సౌతాఫ్రికాను భారత్ 79 పరుగులకు ఆలౌట్ చేయడం అత్యుత్తమంగా ఉండేది.