జొహానెస్‌బర్గ్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా పేసర్ అర్షదీప్ సింగ్ వికెట్ల వేట మొదలుపెట్టాడు. నిప్పులు చెరిగే బంతులతో సౌతాఫ్రికా బ్యాటర్లకు వణుకుపుట్టిస్తున్నాడు. తన తొలి ఓవర్‌లోనే వరుస బంతుల్లో కీలక రెండు వికెట్లు పడగొట్టి ప్రత్యర్థి జట్టును ఒత్తిడిలోకి నెట్టాడు.
టాస్ గెలిచిన సౌతాఫ్రికా బ్యాటింగ్ ఎంచుకుంది.ముకేశ్ కుమార్ భారత్ బౌలింగ్‌ను ప్రారంభించాడు. ముకేశ్ కట్టుదిట్టమైన బంతులతో ఒక్క పరుగే ఇచ్చి ఓవర్ ముగించాడు. ఆ ఒక్క పరుగు కూడా వైడ్ రూపంలోనే వచ్చింది. అనంతరం బంతిని అందుకున్న అర్షదీప్ అదరగొట్టాడు. ఫామ్‌లో ఉన్న హెండ్రిక్స్‌ను క్లీన్‌బౌల్డ్ చేశాడు.

అర్షదీప్ వేసిన బంతిని షాట్ ఆడటానికి యత్నించగా ఇన్‌సైడ్ ఎడ్జ్ తీసుకుని హెండ్రిక్స్ ఔటయ్యాడు. ఖాతా తెరవకముందే అతడు పెవిలియన్‌కు చేరాడు. తర్వాతి బంతికే డసెన్(0)ను అర్షదీప్ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. అర్షదీప్ ధాటికి ఇద్దరు సౌతాఫ్రికా బ్యాటర్లు డకౌటయ్యారు.
కాగా,ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా పింక్ జెర్సీతో బరిలోకి దిగింది. బ్రస్ట్ కాన్సర్ అవగాహన కోసం సఫారీ సేన పింక్ జెర్సీని ధరించనుంది.మరోవైపు భారత యువ ప్లేయర్ సాయి సుదర్శన్ ఇవాళ మ్యాచ్‌తో వన్డేల్లో అరంగేట్రం చేశాడు.లిస్ట్-ఎ క్రికెట్‌లో ఓపెనర్‌గా అతడు 56 సగటుతో పరుగులు చేశాడు.
జట్టు వివరాలు
భారత్: సాయి సుదర్శన్, రుతురాజ్ గైక్వాడ్, తిలక్ వర్మ, శ్రేయస్ అయ్యర్, KL రాహుల్ (కెప్టెన్ ), సంజు శాంసన్, అక్షర్ పటేల్,అర్షదీప్ సింగ్,అవేష్ ఖాన్,కుల్‌దీప్ యాదవ్,ముకేశ్ కుమార్
దక్షిణాఫ్రికా: హెండ్రిక్స్, టోనీ డి జోర్జి, డస్సెన్, మార్క్‌రమ్ (కెప్టెన్),హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, వియాన్ ముల్డర్, ఫెహ్లుక్వాయో , కేశవ్ మహారాజ్, నాండ్రే బర్గర్, షంసీ