
హైదరాబాద్: కేప్ టౌన్ వేదికగా శుక్రవారం భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభమైంది. ఈ టెస్టులో టీమిండియా తుది జట్టు ఎంపికలో జట్టు మేనేజ్‌మెంట్ కొన్ని అనూహ్య నిర్ణయాలు తీసుకుంది. తొలి టెస్టులో టీమిండియా టెస్టు వైస్ కెప్టెన్ రహానేను జట్టు నుంచి తప్పించింది.
కెప్టెన్ కోహ్లీ... రహానే స్ధానంలో హిట్ మ్యాన్ రోహిత్ శర్మను తుది జట్టులోకి తీసుకున్నాడు. మరోవైపు సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మ స్ధానంలో జస్ప్రీత్ బుమ్రాకు అవకాశమిచ్చాడు. మ్యాచ్ ప్రారంభానికి ముందు కెప్టెన్ కోహ్లీనే బుమ్రా చేతికి టెస్టు క్యాప్‌ను అందించి అభినందించాడు.
అయితే తొలి టెస్టులో రహానేను పక్కకు పెట్టడంపై సోషల్ మీడియా వేదికగా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రహానే టెస్టు జట్టుకు వైస్ కెప్టెన్ అని, విదేశాల్లో అత్యుత్తమ సగటు ఉన్న ప్లేయర్ అని... అలాంటి ఆటగాడిని కాదని రోహిత్ శర్మకు అవకాశం ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారు.