For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పింక్ వన్డేలో తేలిపోయిన కోహ్లీసేన: విజయం సఫారలదే, ధావన్ సెంచరీ వృధా

By Nageshwara Rao
Dhawan

హైదరాబాద్: పింక్ వన్డేలో విజయం సఫారీలనే వరించింది. దీంతో సఫారీ గడ్డపై తొలి సిరీస్‌ విజయం కోసం భారత్‌ మరో వన్డే కోసం ఎదురుచూడక తప్పడం లేదు. కోహ్లీసేన చరిత్ర సృష్టించేందుకు వాన, వాండరర్స్‌ మైదానం రెండూ సహకరించలేదు. శనివారం ఆగి... ఆగి... సాగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతిలో 5 వికెట్ల తేడాతో భారత్‌పై విజయం సాధించింది.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు చేసిన భారత్‌ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 289 పరుగులు చేసింది. శిఖర్‌ ధావన్‌ (109) సెంచరీ సాధించగా, కోహ్లీ (75) రాణించారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో రబాడ, ఎంగిడిలు తలో రెండు వికెట్లు తీయగా, మోర్నీ మోర్కెల్‌, క్రిస్‌ మోరిస్‌లకు చెరో వికెట్‌ తీశారు.

అనంతరం 290 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన సఫారీలకు ఓపెనర్లు మార్క్రమ్ (22), ఆమ్లా(33) చక్కటి శుభారంభం ఇచ్చారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 43 పరుగులు జోడించారు. 8వ ఓవర్లో మర్క్రమ్‌... బుమ్రా బౌలింగ్‌లో వికెట్ల ముందు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. అప్పుడే వర్షం వల్ల మ్యాచ్‌ ఆగింది.

ఆ తర్వాత వర్షం కారణంగా దక్షిణాఫ్రికా లక్ష్యాన్ని 28 ఓవర్లలో 202 పరుగులుగా నిర్ణయించారు. మళ్లీ మ్యాచ్‌ మొదలయ్యాక లక్ష్యాన్ని సవరించడంతో దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్‌ దూకుడుగా ఆడారు. డుమిని (10) త్వరగానే ఔటైనప్పటికీ.... గాయం తర్వాత జట్టులోకి వచ్చిన డివిలియర్స్ మాత్రం భారీ షాట్లతో చెలరేగాడు.

అయితే పాండ్యా.. అతడిని ఔట్‌ చేయడంతో భారత్‌ ఊపిరి పీల్చుకుంది. ఆ తర్వాత బరిలోకి దిగిన మిల్లర్‌, క్లాసెన్‌లు ఆకాశమే హద్దుగా విజృంభించారు. చాహల్‌ బౌలింగ్‌లో మిల్లర్‌ 6 పరుగులపై ఉండగా అతడి క్యాచ్‌ను అయ్యర్‌ వదిలేయగా.. అదే ఓవర్లో మిల్లర్‌ బౌల్డయినప్పటికీ, అది నోబాల్‌గా తేలడంతో అతను మరోసారి బతికిపోయాడు.

ఇక్కడే మ్యాచ్‌ మలుపు తిరిగింది. చాహల్‌ బౌలింగ్‌లో లైఫ్‌లు పొందిన మిల్లర్‌ (28 బంతుల్లో 39; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) సఫారీకి గెలుపుబాట వేశాడు. ఆ తర్వాత జట్టుస్కోరు 174 పరుగుల వద్ద మిల్లర్‌ ఔటయ్యాడు. అప్పటికే క్రీజులో కుదురుకున్న క్లాసెన్‌ (27 బంతుల్లో 43 నాటౌట్‌; 5 ఫోర్లు, 1 సిక్స్‌) చివరి వరకు నిలిచి జట్టును గెలిపించాడు.

చివర్లో ఫెలుక్‌వాయో (5 బంతుల్లో 23 నాటౌట్‌; 1 ఫోర్, 3 సిక్స్‌లు) భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. దీంతో 28 ఓవర్లలో 202 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా.. 25.3 ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. భారత బౌలర్లలో కుల్దీప్‌ 2 వికెట్లు తీయగా... చాహల్‌, బూమ్రా, పాండ్యాలకు తలో వికెట్‌ దక్కింది.

భారత ఫీల్డింగ్‌ వైఫల్యాలు, కీలకమైన క్యాచ్‌ల నేలపాలు సఫారీకి కలిసొచ్చాయి. ఆరు వన్డేల సిరీస్‌లో ప్రస్తుతం భారత్‌ 3-1తో ఆధిక్యంలో ఉంది. సిరీస్‌లో ఐదో వన్డే మంగళవారం పోర్ట్‌ ఎలిజబెత్‌ వేదికగా జరుగుతుంది.


ధావన్ సెంచరీ, సఫారీల విజయ లక్ష్యం 290

జోహెన్స్ బర్గ్ వేదికగా దక్షిణాప్రికాతో జరుగుతోన్న నాలుగో వన్డే టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 289 పరుగులు చేసింది. దీంతో ఆతిథ్య దక్షిణాఫ్రికాకు 290 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. భారత బ్యాట్స్‌మెన్‌లలో శిఖర్‌ ధావన్‌(109), విరాట్‌ కోహ్లీ(75), ధోని( 42 నాటౌట్‌)లతో రాణించారు.

ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత్ ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. ఇన్నింగ్స్ నాలుగో ఓవర్‌లో రోహిత్‌(5) తొలి వికెట్‌గా పెవిలియన్‌ చేరాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన కోహ్లీ, ధావన్‌తో కలిసి రెండో వికెట్‌కు 158 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. ఈ క్రమంలో వీరిద్దరూ హాఫ్ సెంచరీలు నమోదు చేశారు.

అనంతరం కోహ్లీ (75) పరుగుల వద్ద పెవిలియన్‌కు చేరాడు. అనంతరం సెంచరీ పూర్తి చేసుకున్న ధావన్ కూడా ఔట్ కావడంతో భారత స్కోరులో వేగం తగ్గింది. రహానే(8), శ్రేయాస్‌ అయ్యర్‌(18), పాం‍డ్యా(9)లు స్వల్ప స్కోర్లుకే పెవిలియన్‌కు చేరారు. చివర్లో ధోని మెరుపులు మెరిపించడంతో భారత్ నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 289 పరుగులు చేసింది.

దక్షిణాఫ్రికా బౌలర్లలో రబాడ, ఎంగిడిలు తలో రెండు వికెట్లు తీయగా, మోర్నీ మోర్కెల్‌, క్రిస్‌ మోరిస్‌లకు చెరో వికెట్‌ లభించింది.


భారత్ ఇన్నింగ్స్ సాగిందిలా:

4వ వన్డే తిరిగి ప్రారంభం..: వెంటవెంటనే రెండు వికెట్లు కోల్పోయిన భారత్
జోహెన్స్ బర్గ్ వేదికగా దక్షిణాప్రికాతో జరుగుతోన్న నాలుగో వన్డే తిరిగి ప్రారంభమైంది. 34.2 ఓవర్‌ వద్ద వెలుతురు లేమితో పాటు, సన్నగా చినుకులు ప్రారంభం కావడంతో అంపైర్లు మ్యాచ్‌ను తాత్కాలికంగా నిలిపివేసిన సంగతి తెలిసిందే. వాయిదా కారణంగా మ్యాచ్‌ నిడివిలో ఎటువంటి మార్పులు లేవని, ఓవర్లను కుదించడం లేదని అంపైర్లు ప్రకటించారు.

అయితే మ్యాచ్ ప్రారంభమైన కొంత సమయానికి భారత్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. దూకుడుగా ఆడుతున్న భారత ఓపెనర్ శిఖర్ ధవన్(109) మోర్కెల్ బౌలింగ్‌‌లో డివిలియర్స్‌కి క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాతి ఓవర్‌లోనే రహానె రబాడకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో 37 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. క్రీజ్‌లో ధోని(1), అయ్యర్(3) ఉన్నారు.


తాత్కాలికంగా నిలిచిన మ్యాచ్‌
జోహెన్స్ బర్గ్ వేదికగా దక్షిణాప్రికాతో జరుగుతోన్న నాలుగో వన్డేకు వాతావరణ పరిస్థితులు అడ్డంకిగా మారాయి. 34.2 ఓవర్‌ వద్ద వెలుతురు లేమితో పాటు, సన్నగా చినుకులు ప్రారంభం కావడంతో అంపైర్లు మ్యాచ్‌ను తాత్కాలికంగా నిలిపివేశారు. మ్యాచ్ నిలిపివేసే సమయానికి భారత్ 2 వికెట్లు కోల్పోయి 200 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో ధావన్ (107), రహానే (5) పరుగులతో ఉన్నారు. అంతకముందు విరాట్ కోహ్లీ (75), రోహిత్ శర్మ(5) పరుగుల వద్ద ఔటైన సంగతి తెలిసిందే.


ఫోర్‌తో సెంచరీ సాధించిన ఓపెనర్ శిఖర్ ధావన్
జోహెన్స్ బర్గ్ వేదికగా దక్షిణాప్రికాతో జరుగుతోన్న నాలుగో వన్డేలో టీమిండియా ఓపెనర్ సెంచరీ సాధించాడు. తద్వారా 100వ వన్డేలో సెంచరీ సాధించిన ఆటగాడిగా ధావన్ అరుదైన ఘనత సాధించాడు. 99 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద క్రిస్ మోరిస్ బౌలింగ్‌లో ఫోర్ బాదడంతో ధావన్ సెంచరీని పూర్తి చేశాడు. వన్డేల్లో ధావన్‌కి ఇది 14వ సెంచరీ కావడం విశేషం. ప్రస్తుతం 34 ఓవర్లకు గాను భారత్ 2 వికెట్లు కోల్పోయి 197 పరుగులు చేసింది. క్రీజులో ధావన్ (104), రహానే (5) పరుగులతో ఉన్నారు.


కోహ్లీ ఔట్: రెండో వికెట్ కోల్పోయిన భారత్
దక్షిణాప్రికాతో జరుగుతోన్న నాలుగో వన్డేలో భారత రెండో వికెట్ కోల్పోయింది. ఓపెనర్‌ రోహిత్‌ శర్మ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ విరాట్‌ కోహ్లీ... ధావన్‌తో కలిసి తొలి వికెట్‌కు 158 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఈ క్రమంలో జట్టు స్కోరు 178 పరుగుల వద్ద క్రిస్ మోరిస్ బౌలింగ్లో డేవిడ్ మిల్లర్‌కు క్యాచ్‌ ఇచ్చి విరాట్‌ కోహ్లీ(75) వెనుదిరిగాడు. కోహ్లీ ఔటైన తర్వాత క్రీజులోకి రహానే వచ్చాడు. మరో ఎండ్‌లో ధావన్‌ 91 పరుగులతో నాటౌట్‌గా క్రీజులో ఉన్నాడు.


వన్డేల్లో 45వ హాఫ్ సెంచరీని నమోదు చేసిన కోహ్లీ
జోహెన్స్ బర్గ్ వేదికగా దక్షిణాప్రికాతో జరుగుతోన్న నాలుగో వన్డేలో భారత బ్యాట్స్‌మెన్‌ విరాట్‌ కోహ్లి, శిఖర్‌ ధావన్‌ దూకుడుగా ఆడుతున్నారు. ఈ క్రమంలో 21.2 ఓవర్‌లో మోర్నీ మోర్కెల్‌ వేసిన బంతిని బౌండరీకి తరలించడం ద్వారా టీమిండియా కెప్టెన్‌ కోహ్లీ హాఫ్ సెంచరీని సాధించాడు. వన్డేల్లో కోహ్లీకి ఇది 45వ హాఫ్ సెంచరీ. 25 ఓవర్లు ముగిసే సమయానికి భారత్‌ ఒక వికెట్‌ నష్టానికి 150 పరుగులు చేసింది. తొలి వికెట్‌కు వీరిద్దరూ 130 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించారు. ప్రస్తుతం ధావన్‌ 79(71), కోహ్లి60(66) పరుగులతో క్రీజులో ఉన్నారు.


Dhawan

100వ వన్డేలో ధావన్ హాఫ్ సెంచరీ

జోహెన్స్ బర్గ్ వేదికగా దక్షిణాప్రికాతో జరుగుతోన్న నాలుగో వన్డేలో టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ హాఫ్ సెంచరీ సాధించాడు. తన కెరీర్‌లో 100వ వన్డే ఆడుతోన్న ధావన్ 53 బంతుల్లో హాఫ్ సెంచరీని నమోదు చేశాడు. వన్డే కెరీర్‌లో అతడికిది 26వ హాఫ్ సెంచరీ కావడం విశేషం. వీరిద్దరిని విడదీసేందుకు దక్షిణాఫ్రికా చేస్తున్న ప్రయత్నాలు ఫలించట్లేదు. ప్రస్తుతం 20 ఓవర్లకు గాను భారత్ వికెట్ నష్టానికి 114 పరుగులు చేసింది. క్రీజులో ధావన్‌(41), కోహ్లీ(62) పరుగులతో ఉన్నారు.


10 ఓవర్లకు భారత్‌ స్కోరు 53/1
జోహెన్స్ బర్గ్ వేదికగా దక్షిణాప్రికాతో జరుగుతోన్న నాలుగో వన్డేలో టీమిండియా 10 ఓవర్లు ముగిసేసరికి వికెట్‌ కోల్పోయి 53 పరుగులు చేసింది. సఫారీ బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటూ భారత బ్యాట్స్‌మెన్‌ పరుగులు సాధిస్తున్నారు. మూడో వన్డేలో భారీ భాగస్వామ్యం నెలకొల్పిన విరాట్‌ కోహ్లీ, శిఖర్‌ ధావన్‌ జోడీ మరోసారి భారీ స్కోరు చేసేలా దూసుకెళ్లోంది. ప్రస్తుతం ధావన్‌(29), కోహ్లీ(14) క్రీజులో ఉన్నారు.


తొలి వికెట్ కోల్పోయిన భారత్
జోహెన్స్ బర్గ్ వేదికగా దక్షిణాప్రికాతో జరుగుతోన్న నాలుగో వన్డేలో టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. ఇన్నింగ్స్ మూడో ఓవర్ చివరి బంతికి రబాడ బౌలింగ్‌లో రోహిత్ శర్మ (5) వికెట్ల ముందు దొరికిపోయాడు. దీంతో వరుసగా నాలుగో వన్డేలో కూడా రోహిత్ శర్మ నిరాశపరిచాడు. సఫారీ పర్యటనలో రబాడ బౌలింగ్‌లో రోహిత్ శర్మ ఔటవ్వడంతో ఇది ఆరోసారి. ప్రస్తుతం 7 ఓవర్లకు భారత్ వికెట్ నష్టానికి 35 పరుగులు చేసింది. క్రీజులో ధావన్ (25), కోహ్లీ (1) పరుగుతో ఉన్నారు.


టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా
ఆరు వన్డేల సిరిస్‌లో భాగంగా భారత్-దక్షిణాప్రికా జట్ల మధ్య నాలుగో వన్డే ప్రారంభమైంది. జోహెన్స్‌బర్గ్‌లోని వాండరర్స్ స్టేడియంలో జరుగుతున్న ఈ వన్డేలో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. కాగా, ధావన్‌కి ఇది 100వ వన్డే.

గాయపడిన కేదార్ జాదవ్ స్థానంలో శ్రేయాస్ అయ్యర్ తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు. మరోవైపు దక్షిణాఫ్సారికా కెప్టెన్ మర్క్రమ్ మాట్లాడుతూ డివిలియర్స్‌, మోర్నీ మోర్కెల్‌ తిరిగి జట్టులోకి వచ్చారని తెలిపాడు.

ఈ సిరిస్‌లో ఇప్పటివరకు టీమిండియానే పూర్తి ఆధిపత్యం చెలాయించింది. దక్షిణాఫ్రికాపై వరుసగా మూడు వన్డేల్లో విజయం సాధించి సిరిస్‌లో 3-0 ఆధిక్యంలో నిలిచింది. ఈ వన్డే గెలిస్తే చాలు సఫారీ గడ్డపై కోహ్లీసేన చరిత్ర సృష్టిస్తుంది. ఎందుకంటే సఫారీ గడ్డపై భారత్ ఇప్పటివరకూ ఒక్క వన్డే సిరీస్‌ను కూడా గెలవలేదు.

దీంతో ఈ సిరిస్‌ను గెలిచేందుకు గాను భారత్‌కు ఓ సువర్ణావకాశం. నాలుగో వన్డేలో విజయం సాధించి కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టాలని కోహ్లీసేన భావిస్తుండగా, శనివారం నాటి మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ రేసులో నిలవాలని సఫారీలు చూస్తున్నారు. గాయం కారణంగా తొలి మూడు వన్డేలకు దూరమైన డివిలియర్స్‌ నాలుగో వన్డేలో చోటు దక్కించుకున్నాడు.

కాగా, రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన పెంచే కార్యక్రమంలో భాగంగా నాలుగో వన్డేని 'పింక్‌ వన్డే'గా పరిగణిస్తున్నారు. దీంతో నాలుగో వన్డేలో దక్షిణాఫ్రికా జట్టు గులాబీ రంగు జెర్సీతో బరిలోకి దిగనుంది. ఈ జెర్సీతో బరిలోకి దిగిన ప్రతిసారీ డివిలియర్స్ ప్రత్యర్ధి జట్లకు చుక్కలు చూపించడం విశేషం. ఇదే పిచ్‌పై గతంలో డివిలియర్స్ గులాబీ జెర్సీ ధరించి ఆడిన 5 మ్యాచ్‌ల్లో 112.5 సగటుతో 450 పరుగులు చేశాడు.

ఇందులో ప్రపంచ రికార్డు(31 బంతుల్లో సెంచరీ) సాధించిన ఇన్నింగ్స్ కూడా ఉంది. 2015లో జరిగిన ఆ పింక్‌ వన్డేలో వెస్టిండిస్‌పై రెచ్చిపోయి ఆడిన డివిలియర్స్ 44 బంతుల్లోనే 149 పరుగులు చేసి ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. అంతేకాదు 2011 నుంచి దక్షిణాఫ్రికా ఐదు వన్డేల్లో పింక్‌ దుస్తులతో బరిలోకి దిగగా ఐదింటిలోనూ విజయం సాధించింది.

నాలుగో వన్డేలో టీమిండియా గెలిస్తే నంబర్‌ వన్‌ ర్యాంకును పదిలంగా ఉంచుకుటుంది. సెంచూరియన్‌లో జరిగిన రెండో వన్డే తర్వాత అగ్రస్థానాన్ని దక్కించుకున్న టీమిండియా మూడో వన్డేలో గెలిచి ఆ స్థానాన్ని మరింత మెరుగుపరుచుకుంది. అయితే ఈ సిరీస్‌ను కోహ్లీసేన 4-2తో గెలిస్తే అగ్రస్థానంలో నిలుస్తుంది. చివరి రెండు వన్డేల్లో ఓటమి పాలైనా భారత్ నెంబర్ వన్ ర్యాంకులో ఉండటం విశేషం.

జట్ల వివరాలు:
ఇండియా: విరాట్ కోహ్లీ(కెప్టెన్), శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, అజ్యింకె రహానే, కేదార్ జాదవ్, ధోని(వికెట్ కీపర్), హార్థిక్ పాండ్యా, చాహల్, కుల్దీప్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, బుమ్రా

దక్షిణాఫ్రికా: ఐడెన్ మర్క్రమ్, ఆమ్లా, జెపీ డుమిని, ఇమ్రాన్ తాహిర్, డేవిడ్ మిల్లర్, మోర్నీ మోర్కెల్, క్రిస్ మోరిస్, లుంగిడి ఎంగ్డి, కగిసో రబాడ, ఏబీ డివిలియర్స్, హెన్రిచ్‌ క్లాసెన్‌

Match starts at: 4.30 pm IST
Live: Sony TEN

Story first published: Sunday, February 11, 2018, 8:08 [IST]
Other articles published on Feb 11, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+