
హైదరాబాద్: మూడు టెస్టులు, ఆరు వన్డేలు, మూడు టీ20ల సిరిస్ కోసం కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో పర్యటిస్తోన్న సంగతి తెలిసిందే. మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌ను మరో టెస్టు మిగిలుండగానే 0-2తో కోహ్లీసేన సిరిస్‌ను చేజార్చుకున్న సంగతి తెలిసిందే.
అయితే ఈ రెండు టెస్టుల్లో టీమిండియా ఓటమికి అనేక కారణాలు ఉన్నాయి. విదేశీ గడ్డపై అద్భుతమైన రికార్డు ఉన్న టెస్టు కెప్టెన్ అజ్యింకె రహానేను మొదటి రెండు టెస్టులకు దూరంగా పెట్టడం.... సెంచూరియన్ వేదికగా జరిగిన రెండో టెస్టులో ఫామ్‌లో ఉన్న భువీ స్థానంలో ఇషాంత్ చోటు కల్పించడం ఇలాంటివి ప్రభావం చూపాయి.
టీమిండియా టెస్టు సిరిస్‌ను కోల్పోయిన నేపథ్యంలో కెప్టెన్ కోహ్లీపై సర్వత్రా విమర్శలు వచ్చాయి. కోహ్లీకి అసలు బెస్ట్-11 ఎంచుకోవడం తెలియదని కొందరు అంటే, మరికొందరు తుది జట్టుని ఎంపిక చేసిన సెలక్టర్లపై తీవ్ర విమర్శలు చేశారు. రహానే స్థానంలో రోహిత్ శర్మను ఆడించడం కోహ్లీ తీసుకున్న అతిపెద్ద తప్పుడు నిర్ణయమని అన్నారు.
దక్షిణాఫ్రికా పర్యటనకు ముందు కోహ్లీసేన వరుసగా తొమ్మిది టెస్టు సిరిస్ విజయాలను సాధించి ప్రపంచ రికార్డుని సైతం నెలకొల్పింది. అదే ఊపులో సఫారీ గడ్డపై కోహ్లీసేన విజృంభిస్తుందని, వరుసగా పదో టెస్టు సిరిస్ విజయాన్ని సొంతం చేసుకుని ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్లు నెలకొల్పిన రికార్డుని అధిగమిస్తుందని అంతా భావించారు.
అయితే సఫారీ గడ్డపై అడుగుపెట్టిన తర్వాత కోహ్లీసేన సత్తా ఏంటో అందరికీ తెలిసింది. సఫారీ పర్యటన ముందు నుంచీ సీనియర్లు హెచ్చరిస్తూనే ఉన్నారు. అక్కడి పిచ్‌లపై బంతులు దూసుకొస్తాయని, ఇక, సఫారీ బౌలర్లు విసిరే బంతులను ఎదుర్కొనడం కత్తి మీద సాము లాంటిదేనని ఎంతో మంది చెప్పినా కోహ్లీసేన పెడచెవిన పెట్టింది.
దాని ఫలితమే సిరిస్‌ను 0-2తో చేజార్చుకోవడం. ఇక మిగిలింది మూడో టెస్టు. కనీసం ఈ టెస్టులోనైనా విజయం సాధించి పరువు నిలుపుకోవాలని కోహ్లీసేన భావిస్తుంటే, సఫారీ జట్టు మాత్రం వైట్ వాష్ చేసి 2015 పర్యటనకు ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తోంది. అయితే మూడో టెస్టు మ్యాచ్ జరిగే వాండరర్స్ స్టేడియం కోహ్లీసేన వైట్ వాష్ కాకుండా కాపాడుతుందని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు.
ఇరు జట్ల మధ్య మూడో టెస్టు జనవరి 24న జోహెన్స్‌బర్గ్‌లోని వాండరర్స్ స్టేడియంలో ప్రారంభం కానుంది. ఈ స్టేడియంలో ఇప్పటివరకు టీమిండియా నాలుగు టెస్టులు ఆడింది. అంతేకాదు ఈ స్టేడియంలో టీమిండియా ఒక్క టెస్టు మ్యాచ్‌లో కూడా ఓటమి పాలు కాలేదు. ఆడిన నాలుగింట్లో ఒక టెస్టులో విజయం సాధించగా, మూడు టెస్టులు డ్రాగా ముగించింది.
దక్షిణాఫ్రికా గడ్డపై టీమిండియా కేవలం రెండు టెస్టుల్లో మాత్రమే నెగ్గింది. అందులో ఒకటి ఈ వాండరర్స్ స్టేడియంలోనే కావడం విశేషం. 2006లో ద్రవిడ్ కెప్టెన్సీలో టీమిండియా దక్షిణాఫ్రికా పర్యటనకు వచ్చింది. సిరిస్‌లో భాగంగా తొలి టెస్టు మ్యాచ్ వాండరర్స్ స్టేడియంలోనే జరిగింది. ఈ టెస్టులో శ్రీశాంత్ (5/40) రాణించడంతో తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియాకు 165 పరుగుల ఆధిక్యం లభించింది.
ఇక, రెండో ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా 278 పరుగులకే ఆలౌట్ కావడంతో భారత్ 123 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో టీమిండియాకు ఎంతో అచ్చొచ్చిన వాండరర్స్ స్టేడియంలో జరిగే మూడో టెస్టులో భారత్ విజయం సాధించి పరువు నిలుపుకోవాలని క్రికెట్ అభిమానుల ఆశ.
2006 (డిసెంబర్ 15-18 వరకు), జోహెన్స్ బర్గ్ టెస్టు:
భారత్ తొలి ఇన్నింగ్స్: 249 ఆలౌట్
దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్: 84 ఆలౌట్
భారత్ రెండో ఇన్నింగ్స్: 236 ఆలౌట్
దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్: 278 ఆలౌట్
మ్యాచ్ ఫలితం: 123 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం.