
హైదరాబాద్: సెంచూరియన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టు తొలిరోజైన శనివారం టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మైదానంలో దూకుడుగా కనిపించిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్ ఔటైన సమయంలో కెప్టెన్‌గా తన హుందాతనాన్ని పక్కన పెట్టి మరీ మైదానంలో సంబరాలు చేసుకున్నాడు.
రెండో టెస్టులో దక్షిణాఫ్రికా యువ ఓపెనర్ మార్క్రమ్ (94: 150 బంతుల్లో 15 ఫోర్లు) తృటిలో సెంచరీని చేజార్చుకున్న సంగతి తెలిసిందే. తొలిరోజు దక్షిణాఫ్రికా ఓపెనర్లు మార్క్రమ్(94), ఎల్గర్(31) భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ పరుగుల వరద పారించారు.
ఈ జోడీని విడగొట్టేందుకు కోహ్లీ బౌలర్లను మార్చిమార్చి ప్రయోగించినా లాభం లేకపోయింది. ఈ క్రమంలో బౌలింగ్‌కు దిగిన అశ్విన్.. ఎల్గర్‌ను ఊరించే బంతితో బోల్తా కొట్టించాడు. ముందుకు వచ్చి ఆడే ప్రయత్నంలో ఫార్వర్డ్ లెగ్‌లో మురళీ విజయ్ సమయోచిత క్యాచ్‌కు ఎల్గర్ తొలి వికెట్‌గా పెవిలియన్‌కు చేరాడు.
దీంతో 85 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఆ తర్వాత క్రీజులోకొచ్చిన ఆమ్లా.. మార్క్రమ్ అదే జోరులో అలవోకగా పరుగులు సాధించారు. సెంచరీకి సమీపిస్తున్న సమయంలో ఆఫ్ స్టంప్‌కి దూరంగా అశ్విన్ విసిరిన బంతిని పాయింట్ దిశగా కట్ చేసేందుకు ప్రయత్నిస్తూ మార్క్రమ్.. వికెట్ కీపర్ పార్థీవ్ పటేల్ చేతికి చిక్కాడు.
తన ఔట్‌పై డీఆర్‌ఎస్‌కు వెళ్లిన మార్క్రమ్‌కు నిరాశే ఎదురైంది. 148 పరుగుల వద్ద దక్షిణాఫ్రికా రెండో వికెట్ కోల్పోయింది. దీంతో నిరాశగా పెవిలియన్‌కి వెళ్తున్న మర్‌క్రమ్ సమీపానికి వెళ్లిన కోహ్లి ఏదో మాట్లాడాడు. అందరూ.. విరాట్ కోహ్లీ హావభావాలు చూసి మార్క్రమ్‌ని స్లెడ్జింగ్ చేశాడని భావించారు.
'సెంచరీ చేజార్చుకుని నేను నిరాశగా పెవిలియన్‌కి వెళ్తుండగా.. విరాట్ కోహ్లి నా దగ్గరికి వచ్చాడు. చాలా బాగా ఆడావు.. ఇలా ఔటవడం దురదృష్టం అన్నాడు. నాకు ఆ మాటలు చాలా గొప్పగా అనిపించాయి. అతను నా ప్రత్యర్థి.. టీవీల్లో కోట్లాది మంది చూస్తున్నారు. కానీ.. వాటిని లెక్కచేయకుండా కోహ్లీ చాలా ఉన్నతంగా వ్యవహరించాడు' అని 23 ఏళ్ల మార్క్రమ్ వెల్లడించాడు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.