సెంచూరియన్‌లో హాఫ్ సెంచరీతో ధోని సాధించిన రికార్డులివే


హైదరాబాద్: సెంచూరియన్ వేదికగా ఆతిథ్య దక్షిణాఫ్రికాతో బుధవారం జరిగిన రెండో టీ20లో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని హాఫ్ సెంచరీతో చెలరేగిన సంగతి తెలిసిందే. చాన్నాళ్ల తర్వాత ధోని హాఫ్ సెంచరీ నమోదు చేయడంతో అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. సోషల్ మీడియా వేదికగా ధోనిపై ప్రశంసల వర్షం కురిపించారు.
ఈ మ్యాచ్‌లో ధోని కేవలం 28 బంతుల్లో నాలుగు ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో 52 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. టీ20ల్లో ధోనికి ఇది రెండో హాఫ్ సెంచరీ కావడం విశేషం. టీ20ల్లో తొలి హాఫ్ సెంచరీ చేయడానికి 65 ఇన్నింగ్స్‌లు ఆడిన ధోని గత 12 ఇన్నింగ్స్‌లలో రెండు హాఫ్ సెంచరీలు నమోదు చేయడం గమనార్హం.
16వ ఓవర్ నుంచి పాండే, ధోనిలు దూకుడుగా ఆడటంతో చివరి ఐదు ఓవర్లలో 69 పరుగులు వచ్చాయి. తొలి 10 ఓవర్లలో 85 పరుగులు చేసిన టీమిండియా చివరి 10 ఓవర్లలో 103 పరుగులు చేసింది. ఈ ఇద్దరు ఐదో వికెట్‌కు అజేయంగా 98 పరుగులు జోడించారు. ఈ హాఫ్ సెంచరీతో అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో ధోని అనేక రికార్డులు తన పేరిట సొంతం చేసుకున్నాడు.

నాలుగో స్థానంలో పాండే-ధోని జోడీ
మనీశ్ పాండే-ధోనీ జోడీ ఐదో వికెట్‌కు అజేయంగా 98 పరుగులు జోడించారు. అంతర్జాతీయ టీ20 క్రికెట్లో ఐదో వికెట్‌కు అత్యధిక భాగస్వామ్యం నెలకొల్పిన జాబితాలో వీరు నాలుగో స్థానంలో నిలిచారు. ఈ జాబితాలో షోయబ్ మాలిక్-మిస్బా ఉల్ హాక్(119 నాటౌట్), యువీ-ధోనీ(102 నాటౌట్), కోలింగ్ ఉడ్-షా(102) తొలి మూడు స్థానాల్లో ఉన్నారు.

తక్కువ బంతుల్లో ఎక్కువ పరుగులు
సెంచూరియన్‌లో ఆతిథ్య దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో చివరి రెండు ఓవర్లలో ధోని 28 పరుగులు సాధించాడు. దీంతో అతి తక్కువ బంతుల్లో ఎక్కువ పరుగులు సాధించిన భారత బ్యాట్స్‌మెన్లలో ధోని రెండోవాడిగా అరుదైన ఘనత సాధించాడు. 2007లో ఇంగ్లాండ్‌పై యువరాజ్ సింగ్ 10 బంతుల్లో 44 పరుగులు సాధించాడు.

ధోని రెండోవాడు
సఫారీ గడ్డపై వేగవంతమైన హాఫ్ సెంచరీ సాధించిన భారత ఆటగాళ్ల జాబితాలో ధోని రెండోవాడిగా నిలిచాడు. భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగిన తొలి టీ20లో ఓపెనర్ శిఖర్ ధావన్ కూడా 27 బంతుల్లో హాఫ్ సెంచరీ నమోదు చేయడం విశేషం.

టీ20ల్లో అత్యధిక సిక్సులు బాదిన మూడో క్రికెటర్
అంతర్జాతీయ టీ20ల్లో ధోనీ ఇప్పటి వరకు బాదిన సిక్స్‌ల సంఖ్య 44. టీ20 క్రికెట్‌లో అత్యధిక సిక్స్‌లు బాదిన వికెట్ కీపర్ల జాబితాలో ధోని మూడోవాడిగా నిలిచాడు. మహమ్మద్ షెజాద్(68), బ్రెండన్ మెకల్లమ్(58) ఈ జాబితాలో ధోని కంటే ముందున్నారు.

ధోని వేగవంతమైన హాఫ్ సెంచరీ చేయడం రెండోసారి
అంతర్జాతీయ క్రికెట్‌లో టెస్టు, వన్డే, టీ20 ఇలా మూడు ఫార్మాట్లలో ధోని వేగవంతమైన హాఫ్ సెంచరీ సాధించడం ఇది రెండోసారి. 2011లో ఇంగ్లాండ్‌పై 26 బంతుల్లోనే హాఫ్ సెంచరీని నమోదు చేశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications