
హైదరాబాద్: మొహాలీ వేదికగా టీమిండియాతో జరుగుతున్న రెండో టీ20లో దక్షిణాఫ్రికా కెప్టెన్ క్వింటన్ డీకాక్ 37 బంతుల్లో 52(8 ఫోర్లు) హాఫ్ సెంచరీ చేయగా... బవుమా 43 బంతుల్లో 49(3 ఫోర్లు, ఒక సిక్స్)తో రాణించడంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 149 పరుగులు చేసింది.
దీంతో ఆతిథ్య జట్టుకు 150 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సఫారీలను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. మ్యాచ్ అరంభంలోనే దక్షిణాప్రికాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. దీపక్ చాహర్ వేసిన ఇన్నింగ్స్ ఐదో ఓవర్‌లో హెండ్రిక్స్ (6) సుందర్‌కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన బవుమాతో కలిసి కెప్టెన్ డికాక్ నిలకడగా ఆడుతూ స్కోరు బోర్డుని నడిపించాడు. ఈ క్రమంలో కెప్టెన్ క్వింటన్ డీకాక్ 37 బంతుల్లో 8 ఫోర్ల సాయంతో 52 పరుగులు చేశాడు. హాఫ్ సెంచరీ అనంతరం టీమిండియా యువ పేసర్ నవదీప్ సైనీ బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు.
డికాక్ ఔటైన తర్వాత దక్షిణాఫ్రికా స్కోరు బోర్డులో వేగం తగ్గింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కి వచ్చిన డస్సన్(1) విఫలమయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన మిగితా బ్యాట్స్‌మెన్ కూడా తేలిపోయారు. భారత బౌలర్లలో దీపక్ చాహర్ రెండు వికెట్లు తీయగా, నవదీప్ సైనీ, జడేజా, హార్ధిక్ పాండ్యా తలో వికెట్ తీశారు.
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న టీమిండియా
అంతకముందు టాస్ గెలిచిన టీమిండియా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఈ సిరిస్‌లో ధర్మశాల వేదికగా జరగాల్సిన తొలి టీ20 వర్షం కారణంగా రద్దైన సంగతి తెలిసిందే. దీంతో ఈ మ్యాచ్‌లో రెండు జట్లు విజయం కోసం తహతహలాడుతున్నాయి. మూడు టీ20ల సిరిస్‌లో తొలి టీ20 మ్యాచ్ ఒక్క బంతి కూడా పడకుండానే రద్దు కావడంతో భారత్, దక్షిణాఫ్రికా పోరు రెండు మ్యాచ్‌ల సిరీస్‌కే పరిమితమైంది.
ఆరు నెలల తర్వాత టీమిండియా సొంతం గడ్డపై అంతర్జాతీయ మ్యాచ్‌ను ఆడుతోంది. ఈ మ్యాచ్‌ని గెలిచి సిరీస్‌ను శుభారంభం చేయాలని టీమిండియా భావిస్తోంది. ఇటీవలే ఇంగ్లాండ్ వేదికగా ముగిసి వన్డే వరల్డ్‌కప్‌లో పేలవ ప్రదర్శన చేసిన సఫారీలు ఆ తర్వాత ఆడుతోన్న తొలి టీ20 సిరిస్ కావడంతో ఈ మ్యాచ్‌లో విజయం సాధించి బోణీ కొట్టాలని సఫారీలు భావిస్తున్నారు.
వచ్చే ఏడాది ఆస్ట్రేలియా వేదికగా టీ20 వరల్డ్‌కప్ జరగనున్న నేపథ్యంలో ఇరు జట్లు యువ ఆటగాళ్లతో బరిలోకి దిగాయి. భారత్-దక్షిణాఫ్రికా జట్లు ఇప్పటివరకు 13 టీ20లు ఆడాయి. ఇందులో టీమిండియా 8 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా... 5 మ్యాచ్‌ల్లో దక్షిణాఫ్రికా విజయం సాధించింది. టీమిండియా చేతిలో అత్యధిక టీ20 మ్యాచ్‌ల్లో ఓటమి పాలైన జట్టుగా ఆస్ట్రేలియా(11) అగ్రస్థానంలో ఉంది.