
మైదానంలోకి అభిమాని:
విరాట్ కోహ్లీపై ఉన్న అభిమానంతో కొందరు అభిమానులు అయితే ఓ అడుగు ముందుకేసి సెక్యూరిటీని తప్పించుకుని అతన్ని కలవాలని చూస్తుంటారు. తాజాగా ఇలాంటి ఘటనే మొహాలీలో జరిగింది. దక్షిణాఫ్రికాతో బుధవారం జరిగిన రెండో టి20 మ్యాచ్‌లో కోహ్లీ బ్యాటింగ్ చేస్తుండగా.. ఓ అభిమాని స్టేడియంలోకి దూసుకొచ్చాడు. కరచాలనం చేయాలని ప్రయత్నించగా.. కోహ్లీ ఆందోళనకు గురై వెనక్కు తగ్గాడు. ఇంతలో సెక్యూరిటీ గార్డులు వచ్చి అభిమానిని బయటికి తీసుకెళ్లిపోయారు.

మ్యాచ్‌కు రెండుసార్లు అంతరాయం:
ఈ సమయంలో కోహ్లీతో పాటు క్రీజులో ఉన్న రిషబ్ పంత్ ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యాడు. అంతకు ముందు దక్షిణాఫ్రికా బ్యాటింగ్ చేస్తున్నప్పుడు కూడా ఓ అబిమాని స్టేడియంలోకి వచ్చాడు. అభిమానులు మైదానంలోకి రావడంతో మ్యాచ్‌కు రెండుసార్లు అంతరాయం కలిగింది. ఈ ఘటనలతో ఆటగాళ్ల భద్రతపై క్రికెట్ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

బెంగళూరులో చివరి మ్యాచ్:
విరాట్ కోహ్లీ (52 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 72 నాటౌట్), శిఖర్ ధవన్ (31 బంతుల్లో 4 ఫోర్లు, సిక్సర్‌తో 40) రాణించడంతో దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌లో భారత్ బోణీ చేసింది. బుధవారం రాత్రి జరిగిన రెండో టీ20లో టీమిండియా 7 వికెట్లతో దక్షిణాఫ్రికాను చిత్తు చేసింది. ఈ విజయంతో మూడు టీ20ల ఈ సిరీస్‌లో కోహ్లీ సేన 1-0 ఆధిక్యంలో నిలిచింది. ధర్మశాలలో జరగాల్సిన మొదటి మ్యాచ్ వర్షంతో రద్దయిన సంగతి తెలిసిందే. చివరి మ్యాచ్ 22న బెంగళూరులో జరగనుంది.

టీ20ల్లో అత్యధిక పరుగులు:
రెండో టీ20లో కోహ్లీ అర్ధ సెంచరీ చేసే క్రమంలో అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ప్రస్తుతం కోహ్లీ 2,441 పరుగులతో అగ్ర స్థానంలో ఉన్నాడు. అగ్ర స్థానం చేరే క్రమంలో టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మను కోహ్లీ దాటేశాడు. రోహిత్ శర్మ అంతర్జాతీయ టీ20ల్లో 2,434 పరుగులతో రెండో స్థానానికి పడిపోయాడు. రెండో టీ20లో రోహిత్ 12 పరుగులు చేసిన విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications
