IND vs SA: ఓవైపు వర్షం.. మరోవైపు కరోనా.. తొలి వన్డే మ్యాచ్ అనుమానమే!!

ధర్మశాల: న్యూజిలాండ్ పర్యటనలో వన్డే, టెస్టు సిరీస్‌లలో వైట్‌వాష్‌కు గురైన భారత జట్టు మరో పోరుకు సన్నద్ధమైంది. అయితే ఇప్పుడు వేదిక సొంతగడ్డకు మారింది. గత అక్టోబరులో భారత గడ్డపై జరిగిన టెస్టు సిరీస్‌లో చిత్తుగా ఓడిన దక్షిణాఫ్రికా.. నాటి పర్యటనకు కొనసాగింపుగా ఇప్పుడు వన్డే సిరీస్ ఆడనుంది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా గురువారం జరిగే తొలి వన్డేలో ఇరు జట్లు తలపడనున్నాయిు. వరుసగా ఐదు అంతర్జాతీయ మ్యాచ్‌లలో ఓటముల తర్వాత విజయాన్ని అందుకోవాలని భారత్ భావిస్తుండగా.. డి కాక్ నేతృత్వంలో సత్తా చాటాలని సఫారీలు పట్టుదలగా ఉన్నారు.

మ్యాచ్ జరగడం అనుమానమే:
ప్రస్తుతం ధర్మశాలలో కురుస్తున్న వర్షాల కారణంగా తొలి వన్డే మ్యాచ్ జరగడం అనుమానమే. మంగళవారం రాత్రి నుంచి ధర్మశాలలో ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తోంది. ఇక బుధవారం ఉదయం కాస్త విరామం ఇచ్చిన వరుణుడు.. భారత జట్టు సాధన ముగియగానే మరోసారి తన ప్రతాపం చూపించాడు. కుండపోతగా వాన కురుస్తుండటంతో సిబ్బంది మైదానంను కవర్లతో కప్పేశారు. ఇక మ్యాచ్ జరిగే గురువారం కూడా 90 శాతం వర్షం కురిసే అవకాశముందని సమాచారం తెలుస్తోంది. దీంతో మ్యాచ్ జరగడంపై అనుమానాలు మొదలయ్యాయి.

టికెట్ల అమ్మకాలపై కరోనా ప్రభావం:
మరోవైపు తొలి వన్డేకు వర్షంతో పాటు కరోనా వైరస్ ప్రభావం కూడా భారీ స్థాయిలో ఉంది. ముఖ్యంగా కరోనా వైరస్ ప్రభావం టికెట్ల అమ్మకాలపై పడింది. 22,000 టికెట్లకు మంగళవారం వరకు 16,000 టికెట్లు మాత్రమే అమ్ముడుపోయాయి. వైరస్ భారత దేశంలోనూ వేగంగా వ్యాప్తి చెందుతుండడంతో మ్యాచ్ చూడడానికి అభిమానులు ఆసక్తి చూపట్లేదు. సాధారణంగా ధర్మశాలలో మ్యాచ్ ఉంటే టికెట్లకు భారీ డిమాండ్ ఉంటుంది. ఈసారి కరోనా ప్రభావంతో విదేశీ అభిమానులు రావడం లేదు. పక్కనే ఉన్న పంజాబ్, హరియాణా, డిల్లీ నుంచి కూడా ఎవరూ రావట్లేదు.

మైదానాన్ని సిద్ధం చేయగలం:
'మైదానానికీ వచ్చే అభిమానులు కరోనా బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో స్టేడియం చుట్టూ హోర్డింగులు పెట్టించాం. ఈసారి వాతావరణమూ అనుకూలంగా లేదు. మంగళవారం రాత్రి ఉరుములతో కూడిన భారీ వర్షం పడింది. బుధవారం జట్ల సాధన ముగిసిన వెంటనే మరోసారి వర్షం కురిసింది. అయితే గురువారం వర్షం కురిసినా.. రెండు గంటల్లో మైదానాన్ని సిద్ధం చేయగలం' అని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ సంఘం ఓ ప్రకటనలో తెలిపింది. గతేడాది సెప్టెంబర్ నెలలో ఇదే ధర్మశాలలో భారత్, దక్షిణాఫ్రికా టీ20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దైన విషయం తెలిసిందే.

వర్షం పడొద్దని పూజలు:
తొలి వన్డేకు వర్షం ఆటంకం కలిగించకుండా చూడాలని స్థానిక ఇంద్రునాగ్ ఆలయంలో హెచ్‌పీసీఏ అధికారులు గతవారం పూజలు నిర్వహించారట. ఈ విషయాన్ని హెచ్‌పీసీఏ కార్యదర్శి ఒకరు ధృవీకరించారు. కొండమీద ఉన్న ఆలయంలో పూజలు చేస్తే కోరికలు నెరవేరుతాయని అక్కడి స్థానికుల నమ్మకం. ఈ నేపథ్యంలో వరుణుడిని శాంతింపజేశారట హెచ్‌పీసీఏ అధికారులు. మరి వారి పూజలు ఫలిస్తాయేమో లేదో ఈరోజు తేలనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications