
హైదరాబాద్: డర్బన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి వన్డేలో భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫీల్డింగ్ చేస్తూ గాయపడ్డాడు. ఇన్నింగ్స్ ఏడో ఓవర్ వేసిన భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో ఓపెనర్ హసీమ్ ఆమ్లా (16) బంతిని మిడాఫ్ దిశగా బాదాడు. బంతి వేగంగా బౌండరీ లైన్‌కి సమీపిస్తుండటంతో ఎక్స్‌ట్రా కవర్‌లో ఫీల్డింగ్ చేస్తున్న కోహ్లీ ఆ బంతి వెంట పరిగెత్తాడు.
బౌండరీ లైన్‌కి సమీపంలో వేగంగా పరిగెత్తుతూనే బంతిని చేత్తో అందుకునేందుకు కోహ్లీ మోకాళ్లపై జారాడు. అయితే.. ఔట్ ఫీల్డ్ పేలవంగా ఉండటంతో విరాట్ కోహ్లీ జారిన చోట మోకాలు చిన్న గుంతలో పడి ఆగిపోయాడు. అప్పటికే వేగంగా రావడంతో కోహ్లీ శరీరం అలానే ముందుకు జారింది.
దీంతో కాసేపు నొప్పితో విలవిలలాడిన కోహ్లీ చాలా ఇబ్బందిగా కదిలాడు. అయినప్పటికీ ఆ ఓవర్ మొత్తం మైదానంలోనే ఫీల్డింగ్ చేసిన కోహ్లీ.. ఓవర్ ముగిసిన తర్వాత డగౌట్ చేరాడు. దీంతో ధోని కెప్టెన్సీ బాధ్యతలను చేపట్టాడు. అనంతరం ఫిజియో సాయంతో ప్రాథమిక చికిత్స తీసుకుని మళ్లీ మైదానంలోకి వచ్చాడు.
అనంతరం కళ్లుచెదిరే ఫీల్డింగ్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. గాయం తీవ్రతపై ఫిజియోతో చర్చించిన కోహ్లీ మైదానంలోకి వచ్చి వెంటనే డైవ్ క్యాచ్ పట్టాడు. ఇన్నింగ్స్ 28వ ఓవర్ వేసిన కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో దక్షిణాఫ్రికా ఆటగాడు డేవిడ్ మిల్లర్ (7) బంతిని షార్ట్ కవర్ దిశగా నెట్టేందుకు ప్రయత్నించాడు.
బ్యాట్ ఎడ్జ్‌ని తాకిన బంతి తక్కువ ఎత్తులో గాల్లోకి లేవగా.. కళ్లు చెదిరే రీతిలో ముందుకి డైవ్ చేసిన కోహ్లీ చక్కగా ఒడిసిపట్టుకున్నాడు. కాగా, గతేడాది మార్చిలో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్‌లో కోహ్లీ భుజానికి గాయమైన సంగతి తెలిసిందే. గాయం తీవ్రత లేకున్నా.. భవిష్యత్‌ని దృష్టిలో పెట్టుకుని అప్పట్లో కోహ్లీ ధర్మశాల వేదికగా జరిగిన టెస్టుతో పాటు కొన్ని ఐపీఎల్ మ్యాచ్‌లకు దూరమైన సంగతి తెలిసిందే.