For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సఫారీ గడ్డపై కోహ్లీ తొలి సెంచరీ: డర్బన్‌లో చరిత్ర సృష్టించిన భారత్

By Nageshwara Rao
Kohli

హైదరాబాద్: డర్బన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో టీమిండియా 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 270 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన కోహ్లీసేన 45.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి నిర్దేశిత లక్ష్యాన్ని చేధించింది. అంతకముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 269 పరుగులు చేసింది.

అనంతరం చేధనకు దిగిన భారత జట్టులో కెప్టెన్ కోహ్లీ (112; 119 బంతుల్లో 10 ఫోర్లు), రహానే (79‌; 86 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సుల)తో అద్ఫుత ప్రదర్శన చేయడంతో 270 పరుగుల లక్ష్యం చిన్నబోయింది. చివర్లో రహానే, కోహ్లీ ఔటైనా పాండ్య(3 నాటౌట్), ధోని(4 నాటౌట్) మరో వికెట్‌ పడకుండా లక్ష్యాన్ని చేధించారు.

ఈ వేదికలో టీమిండియాకు ఇదే తొలి విజయం. 1992 నుంచి డర్బన్‌లో సఫారీలతో ఆడిన ఏడు వన్డేల్లో టీమిండియా ఆరింట్లో ఓడింది. ఒక మ్యాచ్ మాత్రం వర్షం కారణంగా ఫలితం తేలలేదు. ఈ స్టేడియంలో 2003 వరల్డ్‌కప్‌లో భాగంగా జరిగిన మ్యాచ్‌ల్లో ఇంగ్లాండ్, కెన్యాలపై విజయం సాధించింది.

అయితే, ఇప్పుడు ఆ రికార్డుని కోహ్లీసేన బద్దలు కొట్టింది. డర్బన్‌లో గెలిచి చూపించింది. దీంతో పాత రికార్డులను కోహ్లీసేన తిరగరాసింది. మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ కోల్పోయినప్పటికీ పరిమిత ఓవర్ల సిరిస్‌ను మాత్రం కోహ్లీసేన విజయంతో మొదలుపెట్టింది.


సఫారీ గడ్డపై కోహ్లీ తొలి సెంచరీ
సఫారీ గడ్డపై వన్డేల్లో కెప్టెన్ కోహ్లీ తొలి సెంచరీని నమోదు చేశాడు. 106 బంతుల్లో 9 ఫోర్ల సాయంతో కోహ్లీ సెంచరీని నమోదు చేశాడు. ఈ వన్డేకు ముందు వరకు కోహ్లీ ఆడిన 11 మ్యాచ్‌ల్లో సెంచరీ చేయకపోవడం విశేషం. సఫారీ గడ్డపై దక్షిణాఫ్రికాతో మొత్తం 8 వన్డేలాడిన కోహ్లీ, మిగతా మూడు మ్యాచ్‌లను 2009లో జరిగిన ఛాంపియన్స్‌లో ఆస్ట్రేలియా, పాకిస్థాన్, వెస్టిండిస్ జట్లపై ఆడాడు.

విరాట్ కోహ్లీ అత్యధిక స్కోరు 87 పరుగులు మాత్రమే. అయితే ఇప్పుడు ఆ రికార్డుని విరాట్ కోహ్లీ అధిగమించాడు. తొలి వన్డేలో విరాట్ కోహ్లీ (112) పరుగులతో సెంచరీని నమోదు చేశాడు. తన క్రికెట్ కెరీర్‌లో వన్డేల్లో 33 సెంచరీలు చేసిన కోహ్లీకి సఫారీ గడ్డపై ఇదే తొలి సెంచరీ.


రహానే హాఫ్ సెంచరీ
డర్బన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి వన్డేలో ఫోర్‌తో రహానే హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. వన్డేల్లో రహానేకి ఇది 24వ హాఫ్ సెంచరీ కావడం విశేషం. దీంతో 35 ఓవర్లకు గాను టీమిండియా 2 వికెట్లు కోల్పోయి 190 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో కోహ్లీ (77), రహానే (51) పరుగులతో ఉన్నారు.


Kohi

కోహ్లీ హఫ్ సెంచరీ


డర్బన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ 56 బంతుల్లో హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. వన్డేల్లో కోహ్లీకి ఇది 46వ హాఫ్ సెంచరీ కావడం విశేషం. కోహ్లీ చాలా దూకుడుగా ఆడుతున్నాడు.
రహానే (32) అండగా ఉన్నాడు. వీరిద్దరూ 100 బంతుల్లో 89 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. దీంతో 29 ఓవర్లు ముగిసే సరికి భారత్‌ 2 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. మరో 114 పరుగులు చేస్తే విజయం మన సొంతం అవుతుంది.


రెండో వికెట్ కోల్పోయి భారత్

డర్బన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి వన్డేలో భారత్ రెండో వికెట్ కోల్పోయింది. ఓపెనర్‌ శిఖర్ ధావన్‌ (35) రనౌటయ్యాడు. కెప్టెన్ కోహ్లీ (17)తో సమన్వయ లోపం కారణంగా ధావన్ ఔట్ కావడం విశేషం. క్రిస్‌ మోరిస్‌ వేసిన 12.2వ బంతిని ధావన్‌ ఆడగా బంతి వికెట్ల వెనుకకు వెళ్లింది. అంతలో కోహ్లీ అవతలి ఎండ్‌ నుంచి పరుగెత్తుకొచ్చాడు. తప్పనిసరి పరిస్థితుల్లో ధావన్ కూడా పరుగెత్తాల్సి వచ్చింది. అక్కడే ఉన్న ఫీల్డర్‌ మార్క్రమ్‌ విసిరిన బంతి నేరుగా వికెట్లకు తాకింది. దీంతో 15 ఓవర్లు ముగిసే సరికి భారత్‌ రెండు వికెట్ల నష్టానికి 75 పరుగులు చేసింది. ధావన్‌ ఇప్పటి వరకు రెండు సార్లు రనౌట్‌ కాగా ఈ రెండు సార్లు అవతలి వైపు ఉన్న ఆటగాడు కోహ్లీనే కావడం గమనార్హం.


తొలి వికెట్ కోల్పోయిన భారత్
డర్బన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి వన్డేలో భారత్ తొలి వికెట్ కోల్పోయింది. 270 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌ ఓపెనర్లు ఆరంభం నుంచే దూకుడుగా ఆడారు. మోర్కెల్ వేసిన ఇన్నింగ్స్ 7వ ఓవర్ మూడో బంతికి రోహిత్ శర్మ(20) కీపర్ డికాక్‌కి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో ప్రస్తుతం 10 ఓవర్లు ముగిసేసరికి భారత్ 1 వికెట్ నష్టానికి 49 పరుగులు చేసింది. క్రీజులో ధావన్(22), కోహ్లీ(5) ఉన్నారు.

India vs South Africa 1st ODI in Durban

భారత్ విజయ లక్ష్యం 270
డర్బన్ వేదికగా భారత్‌తో జరుగుతున్న తొలి వన్డేలో కెప్టెన్ డుప్లెసిస్ (120: 112 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సులు) సెంచరీతో రాణించడంతో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ దక్షిణాఫ్రికా జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 269 పరుగులు చేసింది. దీంతో భారత్‌కు 270 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది.

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా ఓపెనర్ హషీం ఆమ్లా (16)‌ని ఆదిలోనే పెవిలియన్‌కి పంపి భారత్ శిబిరంలో ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఉత్సాహం నింపాడు. ఆ తర్వాత దూకుడుగా ఆడుతున్న డికాక్‌ (34)ని స్పిన్నర్ చాహల్ పెవిలియన్‌కు పంపాడు.

ఈ ఇద్దరూ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగగా ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన దక్షిణాఫ్రికా కెప్టెన్ డుప్లెసిస్‌ జట్టుని నడిపించి తన కెరీర్‌లో 9వ సెంచరీ సాధించి జట్టుని ఆదుకున్నాడు. కెరీర్‌లో డుప్లెసిస్‌కి ఇది తొమ్మిదో శతకంకాగా.. భారత్‌పై రెండోది. మరో ఎండ్‌లో భారత బౌలర్లు వికెట్లు తీయడంతో సఫారీ జట్టు ఒకానొక దశలో 134/5తో ఒత్తిడిలో పడింది.

ఈ క్రమంలో డుప్లెసిస్‌తో కలిసి క్రిస్‌ మోరీస్ (37) భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగి స్కోరు బోర్డుని పరుగులెత్తించాడు. జట్టు స్కోరు 208 పరుగుల వద్ద అతడ్ని కుల్దీప్ యాదవ్ క్లీన్‌ బౌల్డ్ చేయగా.. చివర్లో ఆండిల్ (27 నాటౌట్) ఫరవాలేదనిపించాడు. కాగా, చివరి ఓవర్‌లో సిక్స్ కొట్టేందుకు ప్రయత్నిస్తూ డుప్లెసిస్‌ ఔటయ్యాడు.

భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ మూడు, చాహల్ రెండు వికెట్లు తీయగా.. భువనేశ్వర్ కుమార్, జస్‌ప్రీత్ బుమ్రా చెరో వికెట్ పడగొట్టారు.


Bumarah

దక్షిణాఫ్రికా బ్యాటింగ్ తీరు సాగిందిలా:

డుమిని ఔట్: నాలుగో వికెట్ కోల్పోయిన దక్షిణాఫ్రికా
డర్బన్ వేదికగా భారత్‌తో జరుగుతున్న తొలి వన్డేలో దక్షిణాఫ్రికా నాలుగో వికెట్ కోల్పోయింది. జట్టు స్కోరు 122 పరుగుల వద్ద జెపీ డుమిని (12) కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. ప్రస్తుతం 27 ఓవర్లకు దక్షిణాఫ్రికా 4 వికెట్లు కోల్పోయి 129 పరుగులు చేసింది. క్రీజులో డుప్లెసిస్ (48), డేవిడ్ మిల్లర్ (6) పరుగులతో ఉన్నారు.


నొప్పితో డగౌట్ చేరిన కోహ్లీ
డర్బన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి వన్డేలో కెప్టెన్ కోహ్లీ మైదానాన్ని వీడాడు. ఫీల్డింగ్‌ చేస్తూ బంతిని అందుకునే క్రమంలో పరుగెడుతున్న కోహ్లీ మోకాలిని నేలకు ఆనించాడు. దీంతో కోహ్లీ కాలు గట్టిగా నేలలో కూరుకుపోవడంతో నొప్పితో డగౌట్‌ చేరాడు. దీంతో ధోని కెప్టెన్సీ బాధ్యతలను చేపట్టాడు. ప్రస్తుతం 21 ఓవర్లు ముగిసే సరికి ఆతిథ్య జట్టు 3 వికెట్ల నష్టానికి 103 పరుగులు చేసింది. డుప్లెసిస్‌ (40), డుమిని పరుగులేమీ చేయకుండా క్రీజులో ఉన్నారు.


మార్క్రమ్ (9) ఔట్: మూడో వికెట్ కోల్పోయిన సఫారీలు
డర్బన్ వేదికగా భారత్‌తో జరుగుతున్న తొలి వన్డేలో దక్షిణాఫ్రికా మూడో వికెట్ కోల్పోయింది. మార్క్రమ్ (9) పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔటయ్యాడు. స్పిన్నర్‌ యజువేంద్ర చాహల్‌ వేసిన 15 ఓవర్‌ నాలుగో బంతికి పాండ్యాకు క్యాచ్ ఇచ్చి మార్క్రమ్ వెనుదిరిగాడు. ప్రస్తుతం 24 ఓవర్లు ముగిసే సరికి దక్షిణాఫ్రికా 3 వికెట్లు కోల్పోయి 116 పరుగులు చేసింది. క్రీజులో డుప్లెసిస్ (44), డుమిని (9) పరుగులతో ఉన్నారు.


రెండో వికెట్ కోల్పోయిన దక్షిణాఫ్రికా
డర్బన్ వేదికగా భారత్‌తో జరుగుతున్న తొలి వన్డేలో దక్షిణాఫ్రికా రెండో వికెట్ కోల్పోయింది. ఓపెనర్‌ క్వింటన్‌ డికాక్‌ (34) పరుగుల వద్ద ఔటయ్యాడు. స్పిన్నర్‌ యజువేంద్ర చాహల్‌ వేసిన 15 ఓవర్‌ చివరి బంతికి ఎల్బీగా పెవిలియన్‌కు చేరాడు. దీంతో 15 ఓవర్లు ముగిసే సరికి దక్షిణాఫ్రికా 2 వికెట్లు కోల్పోయి 84 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో డుప్లెసిస్‌ (29), మార్క్రమ్ పరుగులేమీ చేయకుండా క్రీజులో ఉన్నారు.


డర్బన్‌లో తొలి వన్డే: బుమ్రాకే తొలి వికెట్
డర్బన్ వేదికగా భారత్‌తో జరుగుతున్న తొలి వన్డేలో దక్షిణాఫ్రికా తొలి వికెట్ కోల్పోయింది. జట్టు స్కోరు 30 పరుగుల వద్ద బుమ్రా బౌలింగ్‌లో హషీమ్ ఆమ్లా (16) ఎల్బీగా వెనుదిరిగాడు. దీంతో దక్షిణాఫ్రికా 8 ఓవర్లకు గాను వికెట్ నష్టానికి 31 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో డీకాక్ (13), డుప్లెసెస్ (1) పరుగుతో ఉన్నారు.


టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా

ఆరు వన్డేల సిరిస్‌లో భాగంగా భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య తొలి వన్డే ప్రారంభమైంది. డర్బన్‌లోని కింగ్స్‌మీడ్‌లో జరుగుతున్న ఈ వన్డేలో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి మూడు వన్డేలకు దూరమైన ఏబీ డివిలియర్స్ స్థానంలో ఐడెన్ మార్క్రమ్ జట్టులోకి వచ్చాడు.

మరోవైపు రహానేకు తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు. టీమిండియా ఇద్దరు స్పిన్నర్లు, ఇద్దరు పేసర్లతో బరిలోకి దిగింది. కుల్దీప్ యాదవ్, యజువేంద్ర చాహల్, భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్ భారాన్ని మోయనున్నారు. జాదవ్, పాండ్యా రూపంలో ఇద్దరు ఆల్‌రౌండర్లను టీమ్‌లోకి తీసుకున్నారు.

ఇండియా vs దక్షిణాఫ్రికా తొలి వన్డే స్కోరు కార్డు

తొలి వన్డే జరిగే వేదికలో టీమిండియా ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. 1992 నుంచి డర్బన్‌లో సఫారీలతో ఆడిన ఏడు వన్డేల్లో టీమిండియా ఆరింట్లో ఓడింది. ఒక మ్యాచ్ మాత్రం వర్షం కారణంగా ఫలితం తేలలేదు. అయితే ఇదే స్టేడియంలో 2003 వరల్డ్‌కప్‌లో భాగంగా జరిగిన మ్యాచ్‌ల్లో ఇంగ్లాండ్, కెన్యాలపై విజయం సాధించింది.

ఇప్పుడు ఆ చరిత్రను తిరిగరాసే అవకాశం కోహ్లీసేనకు వచ్చింది. మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ కోల్పోయినప్పటికీ, జోహెన్స్ బర్గ్‌లోని వాండరర్స్ పిచ్‌పై మూడో టెస్ట్ గెలిచి ఆత్మవిశ్వాసంతో ఉన్న టీమిండియా పరిమిత ఓవర్ల సిరిస్‌ను విజయంతో మొదలుపెట్టాలని చూస్తోంది.

టీమిండియా ఇప్పటివరకు సఫారీ గడ్డపై ఆడిన నాలుగు ద్వైపాక్షిక సిరీస్‌ల్లో ఓటమిపాలైంది. ఇందులో రెండు సార్లు దక్షిణాఫ్రికా టీమిండియాను వైట్ వాష్ చేసింది. 1992-93 సిరీస్‌లో 5-2తో, 2006-07లో 4-0తో, 2010-11లో 3-2తో, 2013-14లో 2-0తో దక్షిణాఫ్రికా సిరిస్‌లను నెగ్గింది.

గత 25 ఏళ్లలో సఫారీ గడ్డపై భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య 28 వన్డేలు జరగ్గా అందులో 21 వన్డేల్లో దక్షిణాఫ్రికా విజయం సాధించింది. అంతేకాదు జనవరి, 2016 నుంచి సొంతగడ్డపై దక్షిణాఫ్రికా మొత్తం 19 వన్డేలు ఆడింది. ఇందులో 17 వన్డేల్లో విజయం సాధించగా, కేవలం రెండింట్లో మాత్రమే ఓటమిపాలైంది.

ఈ క్రమంలో ఇంగ్లాండ్, ఐర్లాండ్, ఆస్ట్రేలియా, శ్రీలంక, బంగ్లాదేశ్‌లను దక్షిణాఫ్రికా వైట్ వాష్ చేసింది. దక్షిణాఫ్రికా చివరిసారిగా ఫిబ్రవరి 6, 2016న సొంతగడ్డపై ఇంగ్లాండ్ చేతిలో ఓటమిపాలైంది. ఆ తర్వాత వరుసగా 17 విజయాలను సాధించింది. ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికాతో జరగబోయే తొలి వన్డేలో కోహ్లీసేన ఏ మేరకు రాణిస్తుందో అన్నది ఆసక్తికరంగా మారింది.


జట్ల వివరాలు:
టీమిండియా: విరాట్ కోహ్లీ(కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), శిఖర్ ధావన్, రహానే, శ్రేయాస్ అయ్యర్, మనీష్ పాండే, కేదార్ జాదవ్, హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్, భువనేశ్వర్ కుమార్, జాస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చహల్, అక్షర్ పటేల్, మొహమ్మద్ షమి, శార్తుల్ ఠాకూర్.

దక్షిణాఫ్రికా: ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), హషిమ్ ఆమ్లా, క్విన్టన్ డే కాక్ (వికెట్ కీపర్), జెపీ డుమిని, ఇమ్రాన్ తాహిర్, ఐడెన్ మార్క్రమ్, డేవిడ్ మిల్లర్, మోర్నే మోర్కెల్, క్రిస్ మోరిస్, లుంగి ఎంగిడి, ఆండిల్, కగిసో రబడ, తబ్రిజ్ షమ్సీ , జోండో

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Friday, February 2, 2018, 7:10 [IST]
Other articles published on Feb 2, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+