
తృటిలో రోహిత్ శర్మ సెంచరీ మిస్
ఏడు నెలల తర్వాత తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతున్న రోహిత్ శర్మ ఊహించిన విధంగానే అద్భుత ప్రదర్శన చేశాడు. మరో ఓపెనర్ ధావన్‌తో కలిసి 2013 ఆటను పునరావృతం చేశాడు. తొలి ఓవర్‌లో ఆమిర్ అద్భుతమైన స్వింగ్‌తో కాస్త ఇబ్బందిపెట్టినా... ఇతర బౌలర్లను రోహిత్ శర్మ ఎదుర్కొన్న తీరు అద్భుతం. ధావన్ కూడా కుదురుకోవడానికి సమయం తీసుకోవడంతో తొలి 5 ఓవర్లలో 15 పరుగులు మాత్రమే వచ్చాయి. తొలి స్పెల్‌లో 4 ఓవర్లు వేసిన ఆమిర్ 14 పరుగులిచ్చినా వికెట్ మాత్రం తీయలేకపోయాడు.

10వ ఓవర్‌లో వర్షం అంతరాయం
10వ ఓవర్‌లో వర్షం అంతరాయం కలిగించినప్పటికీ విరామం తర్వాత రోహిత్ శర్మ పాక్ బౌలర్ షాబాద్ బౌలింగ్‌లో మిడ్‌వికెట్‌లో భారీ సిక్సర్‌తో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత ధావన్ కూడా స్పీడ్ పెంచి రియాజ్ (20వ) ఓవర్‌లో 4,4,4,2 పరుగులతో అర్ధసెంచరీ పూర్తి చేశాడు. ఈ క్రమంలో జట్టు స్కోరు కూడా 100 పరుగులు దాటింది. ప్రమాదకరంగా మారుతున్న ఈ జంటను 25వ ఓవర్‌లో ధవన్‌ను ఔట్ చేయడం ద్వారా షాదాబ్ విడగొట్టాడు. భారీ షాట్‌కు ప్రయత్నించిన ధవన్.. డీప్ మిడ్‌వికెట్‌లో అజర్ అలీ చేతికి చిక్కాడు. దీంతో తొలి వికెట్‌కు 136 పరుగుల భాగస్వామ్యం ముగిసింది.

రోహిత్‌కు చక్కటి సహకారం అందించిన కోహ్లీ
ధవన్ ఔటైన తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన కోహ్లీ.. రోహిత్‌కు చక్కని సహకారం అందించాడు. స్ట్రయిక్ రొటేషన్‌తో చకచకా పరుగులు రాబడుతూ స్కోరు బోర్డును వేగంగా ముందుకు తీసుకెళ్లారు. 34వ ఓవర్‌లో రెండోసారి వర్షం అంతరాయం కలిగించింది. మ్యాచ్ మొదలైన తర్వాత రియాజ్ ఓవర్‌లో రెండో సిక్సర్ కొట్టిన రోహిత్.. కోహ్లీ తొందరపాటు వల్ల 37వ ఓవర్‌లో అనూహ్యంగా రనౌట్ అయ్యాడు. షాదాబ్ బంతిని పాయింట్‌లోకి పంపిన కోహ్లీ సింగిల్స్ కోసం పరుగెత్తాడు. కానీ రోహిత్ సకాలంలో క్రీజ్‌లోకి చేరుకోలేకపోయాడు. దీంతో రోహిత్ శర్మ తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. ఈ ఇద్దరు రెండో వికెట్‌కు 56 పరుగులు జత చేశారు.

పాక్ బౌలర్లపై విరుచుకుపడ్డ యువరాజ్
రోహిత్ శర్మ అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన వెటరన్ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ పాక్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఆరంభంలోనే క్యాచ్ ఔట్ నుంచి బయటపడ్డా.. కోహ్లీతో కలిసి బౌండరీల వర్షం కురిపించాడు. రియాజ్ క్యాచ్ మిస్ చేయడంతో ఊపిరి పీల్చుకున్న కోహ్లీ 45వ ఓవర్ నుంచి విశ్వరూపం చూపెట్టాడు. భారీ సిక్సర్లు, ఫోర్లతో రెచ్చిపోయి వరుసగా 17, 21 పరుగులు రాబట్టారు. ఈ క్రమంలో 47వ ఓవర్ రెండో బంతికి యువరాజ్ ఎల్బీగా వెనుదిరగాడు. ఆ తర్వాత కోహ్లీ సిక్స్, ఫోర్‌తో 11 పరుగులు రాబట్టాడు. ఈ ఇద్దరు మూడో వికెట్‌కు 93 పరుగులు జోడించారు.

ఆఖరి ఓవర్‌లో హార్దిక్ పాండ్యా హ్యాట్రిక్ సిక్సులు
యువరాజ్ అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన హార్దిక్ పాండ్యా ఆఖరి ఓవర్ తొలి మూడు బంతులను హార్దిక్ భారీ సిక్సర్లుగా మలిచాడు, ఆఖరి బంతిని విరాట్ కోహ్లీ ఫెన్సింగ్‌ను దాటించడంతో 23 పరుగులు సాధించడంతో భారత్ భారీ నిర్ణీత 48 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 319 పరుగులు చేసింది.

పాక్ టాప్ ఆర్డర్ విఫలం
వర్షం కారణంగా పాకిస్థాన్ లక్ష్యాన్ని కుదించినప్పటికీ, పాక్ బ్యాట్స్‌మెన్ ఏ దశలోనూ దానిని సద్వినియోగపరచుకోలేకపోయారు. పాక్ టాప్ ఆర్డర్‌లోఅజర్ అలీ మెరుగ్గా ఆడినా మిగతా వారు నిరాశపర్చారు. భువనేశ్వర్ (1/23), ఉమేశ్ (3/30) ఆరంభం నుంచే కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి ఒత్తడిలో పడేశారు. హఫీజ్ కాసేపు పోరాడే ప్రయత్నం చేసినా.. మ్యాచ్ మధ్యలో జడేజా స్పిన్ మ్యాజిక్‌తో చెలరేగాడు. 24వ ఓవర్‌లో షోయబ్ మాలిక్ (15)ను జడేజా రనౌట్ చేసిన తీరు మ్యాచ్‌కే హైలెట్. షోయబ్ మాలిక్ అవుటైన తర్వాత మ్యాచ్ స్వరూపమే మారిపోయింది. వచ్చిన బ్యాట్స్‌మన్ వచ్చినట్లుగా పెవిలియన్‌కు క్యూ కట్టడంతో మంచి భాగస్వామ్యాలను నమోదు చేయలేకపోయారు. ఆఖర్లో ఉమేశ్ మూడు బంతుల్లో రెండు వికెట్లు తీసి పాక్ పరాజయాన్ని ఖాయం చేశాడు.


Click it and Unblock the Notifications