India vs Pakistan: ఆసియా కప్ 2025లో భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య జరగనున్న మహా సంగ్రామానికి కొన్ని గంటల సమయం మాత్రమే మిగిలి ఉంది. క్రికెట్ ప్రపంచం మొత్తం ఈ హై-వోల్టేజ్ మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ మెగా పోరుకు ముందు దుబాయ్‌లోని వాతావరణం, పిచ్ పరిస్థితి, రెండు జట్ల బలాబలాలను విశ్లేషించుకుందాం.
దుబాయ్ వాతావరణం.. పిచ్ పరిస్థితి
నేడు(ఆదివారం) దుబాయ్ వాతావరణం మ్యాచ్‌కు పూర్తిగా అనుకూలంగా ఉండనుంది. వర్షం పడే అవకాశం అస్సలు లేకపోవడంతో ప్రేక్షకులు ఎలాంటి అంతరాయం లేకుండా పూర్తి మ్యాచ్‌ను చూడొచ్చు. పగటిపూట గరిష్ట ఉష్ణోగ్రత 39 డిగ్రీల సెల్సియస్, రాత్రిపూట కనిష్ట ఉష్ణోగ్రత 30 డిగ్రీల సెల్సియస్‌గా ఉండవచ్చు. అయితే రాత్రిపూట మంచు ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఇది బౌలర్లకు, ముఖ్యంగా స్పిన్నర్లకు సవాలుగా మారవచ్చు. అందుకే టాస్ గెలిచిన జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకోవడానికి మొగ్గు చూపే అవకాశం ఉంది.

దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం పిచ్ స్పిన్నర్లకు బాగా అనుకూలిస్తుంది. యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో భారత స్పిన్నర్లు అద్భుతంగా రాణించారు. కుల్దీప్ యాదవ్ తన స్పిన్ మాయాజాలంతో కేవలం 2.1 ఓవర్లలో 7 పరుగులు మాత్రమే ఇచ్చి ఏకంగా 4 వికెట్లు పడగొట్టాడు. అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి కూడా కీలక వికెట్లు తీశారు. దీనిని బట్టి ఈ మ్యాచ్‌లో కూడా భారత స్పిన్ త్రయం పాక్ బ్యాటర్లకు పెద్ద సవాలు విసరనుందని చెప్పవచ్చు. అదే సమయంలో పేసర్లకు కూడా ప్రారంభ ఓవర్లలో పేస్, బౌన్స్ లభించే అవకాశం ఉంది.
జట్ల ప్రస్తుత ఫామ్, ప్లేయింగ్-11 అంచనాలు
ఆసియా కప్ 2025లో రెండు జట్లు తమ తొలి మ్యాచ్‌లలో విజయం సాధించి మంచి ఆత్మవిశ్వాసంతో ఉన్నాయి. టీమిండియా యూఏఈపై 9 వికెట్ల తేడాతో సునాయాసంగా గెలిచి గ్రూప్-ఏ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. పాకిస్థాన్ కూడా ఒమన్‌ను 93 పరుగుల తేడాతో ఓడించి రెండో స్థానంలో ఉంది. ఈరోజు మ్యాచ్‌లో గెలిచిన జట్టు సూపర్-4 దశకు దాదాపుగా అర్హత సాధించినట్లే.
తుది జట్ల అంచనా..
భారత తుది జట్టు (అంచనా): అంచనా జట్టు: అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), అర్ష్‌దీప్ సింగ్/శివం దూబే, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి.
పాకిస్తాన్ తుది జట్టు (అంచనా): సయీమ్ అయూబ్, సాహిబ్జాదా ఫర్హాన్, మహ్మద్ హారిస్ (వికెట్ కీపర్), ఫఖర్ జమాన్, సల్మాన్ అలీ ఆగా (కెప్టెన్), హసన్ నవాజ్, మహ్మద్ నవాజ్, ఫహీమ్ అష్రఫ్, షాహీన్ అఫ్రిది, సుఫియాన్ ముకీమ్, అబ్రార్ అహ్మద్.