
న్యూఢిల్లీ: అఫ్గానిస్థాన్‌తో మ్యాచ్‌లో అజేయ అర్ధశతకంతో పాకిస్థాన్‌కు విజయాన్నిందించిన షోయబ్ మాలిక్‌ను ధోనీతో పోలుస్తున్నాడు పేస్ దిగ్గజం వసీం అక్రమ్. ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో మాలిక్ చివరి ఓవర్లో సిక్స్, ఫోర్ బాది జట్టును గెలిపించాడు.
'అనుభవానికి సరితూగేది ఏదీ లేదు. అఫ్గానిస్థాన్‌తో మ్యాచ్‌లో మాలిక్ మరోసారి ఈ విషయాన్ని రుజువు చేశాడు. ధోనీలాగా మ్యాచ్‌ను ముగించాడు. బౌలర్‌ను ఎదుర్కొనేటపుడు మాలిక్ ముఖంలో ఎలాంటి హావభావాలు కనబడవు. అది బౌలర్లకు చిరాకు తెప్పిస్తుంది' అని ట్వీట్ చేశాడు.
శుక్రవారం అఫ్గానిస్థాన్‌తో నువ్వానేనా అన్నట్టుగా సాగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ 3 వికెట్ల తేడాతో గెలిచింది. 258 పరుగుల ఛేదనలో పాకిస్థాన్‌ను అఫ్గాన్ స్పిన్నర్లు ముప్పుతిప్పలు పెట్టారు. ముఖ్యంగా రషీద్ ఖాన్ (3/46). అయితే ఓ వైపు వికెట్లు పడుతున్నా.. షోయబ్ మాలిక్ (51) ఎక్కడా ఒత్తిడికి లోనవకుండా తుదికంటా పోరాడడంతో మరో మూడు బంతుల్లోనే పాకిస్థాన్ లక్ష్యాన్ని ఛేదించింది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్థాన్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 257 పరుగులు చేయగా.. పాక్ 49.3 ఓవర్లలోనే 258/7తో గెలిచి ఊపిరి పీల్చుకుంది. చివరి ఓవర్‌లో 10 పరుగులు అవసరమవగా.. షోయబ్ మాలిక్ వరుసగా 6, 4 బాది పాక్‌ని గెలిపించాడు.