IND vs PAK: కొలంబోలోని ప్రేమదాస స్టేడియం వేదికగా జరిగిన టీ20 వరల్డ్ కప్ 2026 హై-వోల్టేజ్ పోరులో భారత్ మరోసారి తన ఆధిపత్యాన్ని చాటుకుంది. దాయాది పాకిస్థాన్‌ను భారీ తేడాతో చిత్తు చేసి.. ప్రపంచకప్ చరిత్రలో ఆ జట్టుపై 8వ విజయాన్ని నమోదు చేసింది. అయితే ఈ ఓటమి కంటే కూడా టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తీసుకున్న ఓ నిర్ణయం పాక్ మాజీ ఆటగాళ్లను తీవ్రంగా కలచివేస్తోంది.
పాక్ జట్టుకు చెంపదెబ్బ?
ఈ కీలక పోరులో భారత్ నిర్దేశించిన 176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్ బ్యాటర్లు భారత బౌలింగ్‌ను ఎదుర్కోలేక చేతులెత్తేశారు. అయితే మ్యాచ్ ఉత్కంఠగా సాగుతున్న సమయంలో సూర్యకుమార్ యాదవ్ పార్ట్ టైమ్ బౌలర్లయిన తిలక్ వర్మ, రింకూ సింగ్ చేత బౌలింగ్ చేయించాడు. తిలక్ వర్మ ఒక ఓవర్ వేయడమే కాకుండా కీలకమైన షాదాబ్ ఖాన్ వికెట్‌ను పడగొట్టాడు. రింకూ సింగ్ కూడా ఒక ఓవర్ బౌలింగ్ చేసి పాక్ బ్యాటర్లను కట్టడి చేశాడు.

దీనిపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ బాసిత్ అలీ ఘాటుగా స్పందించారు. "ముఖ్యమైన మ్యాచ్‌లో రెగ్యులర్ బౌలర్లు కాకుండా పార్ట్ టైమర్లతో బౌలింగ్ చేయించడం పాకిస్థాన్ క్రికెట్ స్థాయిని అవమానించడమే. సూర్యకుమార్ యాదవ్ ఈ నిర్ణయంతో పాకిస్థాన్‌కు గట్టి చెంపదెబ్బ కొట్టాడు" అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ మ్యాచ్‌కు ముందు పాకిస్థాన్ జట్టు ఆడబోమని మొండికేయడం, స్పిన్నర్ ఉస్మాన్ తారిక్ గురించి అతిగా ప్రచారం జరగడం వంటి ఎన్నో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. కానీ మైదానంలో భారత్ ఆ అహంకారాన్ని అణిచివేసింది. ఈ ఓటమితో పాకిస్థాన్ ప్రపంచకప్ నుంచి నిష్క్రమించే ప్రమాదంలో పడింది. మరోవైపు టీమిండియా తన అద్భుత ప్రదర్శనతో సెమీస్ దిశగా దూసుకుపోతోంది. ముఖ్యంగా సీనియర్ బౌలర్లు ఉండగానే యువ ఆటగాళ్లతో బౌలింగ్ చేయించి వికెట్లు తీయడం సూర్యకుమార్ యాదవ్ మాస్టర్ మైండ్‌కు నిదర్శనంగా నిలిచింది.