IND vs PAK: శ్రీలంక వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా ఆదివారం(ఫిబ్రవరి 15) జరగాల్సిన భారత్-పాకిస్థాన్ హైవోల్టేజ్ మ్యాచ్‌పై వరుణుడి నీలినీడలు కమ్ముక్కున్నాయి. కొలంబోలో జరగబోయే ఈ ప్రతిష్టాత్మక మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉందని శ్రీలంక వాతావరణ శాఖ హెచ్చరించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఆదివారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు 50 నుంచి 70 శాతం వరకు కురిసే అవకాశం ఉంది. మ్యాచ్ ప్రారంభమయ్యే రాత్రి 7 గంటల సమయంలో భారీ వర్షం పడితే టాస్ పడటం కూడా కష్టమేనని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ కీలక మ్యాచ్ రద్దయితే సమీకరణాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం.
మ్యాచ్ రద్దయితే పాకిస్థాన్‌కు భారీ లాభం!
ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్ నిర్వహించడం సాధ్యం కాకపోతే ఐసీసీ నిబంధనల ప్రకారం ఇరు జట్లకు ఒక్కో పాయింట్ కేటాయిస్తారు. ఇదే జరిగితే పాకిస్థాన్‌కు కలిసొచ్చే అంశం.ప్రస్తుతం భారత్, పాక్ రెండు జట్లు తమ మొదటి రెండు మ్యాచ్‌లు గెలిచి 4 పాయింట్లతో ఉన్నాయి. మ్యాచ్ రద్దయి తలో పాయింట్ వస్తే ఇరు జట్ల ఖాతాలో 5 పాయింట్లు చేరుతాయి. దీనివల్ల భారత్, పాకిస్థాన్ నేరుగా సూపర్-8 దశకు క్వాలిఫై అవుతాయి.

టోర్నీ నుంచి 3 జట్లు అవుట్
భారత్-పాక్ మ్యాచ్ రద్దయి ఆ రెండు జట్లు సూపర్-8కి చేరితే.. గ్రూప్-ఏలోని మిగిలిన మూడు జట్లు టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి వస్తుంది. 3 మ్యాచ్‌ల్లో 2 పాయింట్లతో ఉన్న అమెరికా, తన తదుపరి మ్యాచ్ గెలిచినా గరిష్టంగా 4 పాయింట్లకే చేరుకుంటుంది. మరోవైపు నెదర్లాండ్స్ జట్టు ఇప్పటివరకు 2 పాయింట్లతోనే ఉంది.. తదుపరి మ్యాచ్ గెలిచినా భారత్, పాక్ కంటే వెనుకబడతారు. ఆడిన 2 మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయి 0 పాయింట్లతో ఉన్న నమీబియాకు ఇప్పటికే అవకాశాలు మూసుకుపోయాయి.
రిజర్వ్ డే లేదు.. ఫ్యాన్స్‌లో ఆందోళన
ఐసీసీ నిబంధనల ప్రకారం టీ20 వరల్డ్ కప్ 2026లో గ్రూప్ దశ మ్యాచ్‌లకు అలాగే సూపర్-8 మ్యాచ్‌లకు రిజర్వ్ డే లేదు. కేవలం సెమీఫైనల్, ఫైనల్ మ్యాచ్‌లకు మాత్రమే రిజర్వ్ డే కేటాయించారు. ఒకవేళ ఆదివారం మ్యాచ్ జరగకపోతే క్రికెట్ అభిమానులకు నిరాశ తప్పదు. అయితే మ్యాచ్ ఫలితం తేలితే మాత్రం గెలిచిన జట్టు నేరుగా సూపర్-8కి వెళ్తుంది, ఓడిన జట్టు తన తదుపరి మ్యాచ్ వరకు వేచి చూడాల్సి ఉంటుంది.