India vs Pakistan: టీ20 వరల్డ్ కప్ 2026 నాకౌట్ దశలో భారత్, పాకిస్థాన్ జట్లు తలపడటం తనకు ఇష్టం లేదని భారత మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కుండబద్దలు కొట్టారు. సాధారణంగా అభిమానులు భారత్-పాక్ ఫైనల్ ఆడాలని కోరుకుంటారు.. కానీ అశ్విన్ మాత్రం అందుకు భిన్నమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. లీగ్ దశలో భారత్ చేతిలో పాక్ ఘోరంగా ఓడిపోయిందని.. ఒకవేళ వారు ఫైనల్ వరకు వస్తే తమ వ్యూహాలను మార్చుకుని మరింత పట్టుదలగా వచ్చే ప్రమాదం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. అందుకే సెమీస్ లేదా ఫైనల్లో పాక్ కంటే మరే ఇతర జట్టునైనా ఎదుర్కోవడం ఉత్తమమని రవిచంద్రన్ అశ్విన్ పేర్కొన్నారు.
అస్సలు పోలికే లేదు..
ప్రస్తుతం టీ20 క్రికెట్లో భారత్ స్థాయికి, పాకిస్థాన్ స్థాయికి అస్సలు పోలికే లేదని అశ్విన్ విశ్లేషించారు. టీమిండియా ఇప్పుడున్న ఫామ్ చూస్తుంటే పాకిస్థాన్ కంటే ఒకటి లేదా రెండు ఖండాలమేర ముందు ఉందని ఎద్దేవా చేశారు. కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియం పిచ్ చాలా కఠినమైనదని.. అక్కడ భారత్ చేసిన 175 పరుగులు సాధారణ పిచ్‌లపై 250 పరుగులతో సమానమని ఆయన వివరించారు. పాకిస్థాన్ బ్యాటర్లు కనీసం పోరాటం కూడా చేయకుండా 114 పరుగులకే ఆలౌట్ అవ్వడం వారి వైఫల్యానికి నిదర్శనమని అశ్విన్ అనడం గమనార్హం.

టీ20ల్లో ఫాలో-ఆన్ ఉంటే బాగుండేది!
ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ ప్రదర్శన ఎంత పేలవంగా ఉందంటే.. టెస్టు క్రికెట్‌లో లాగా టీ20ల్లో కూడా ఫాలో-ఆన్ నిబంధన ఉంటే బాగుండేదని అశ్విన్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. భారత్ నిర్దేశించిన లక్ష్యాన్ని చేధించే క్రమంలో పాక్ ఏ దశలోనూ ఒత్తిడిని తట్టుకోలేకపోయిందని.. ఒకవేళ భారత్ మరో 20 పరుగులు అదనంగా చేసి ఉంటే వారు ఇన్నింగ్స్ ఓటమిని మూటగట్టుకునే వారని విమర్శించారు. పాక్ బ్యాటర్లలో కనీసం మ్యాచ్‌ను ముగించాలనే తపన కూడా కనిపించడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
బాబర్ ఆజం తీరుపై ఆగ్రహం
పాకిస్థాన్ స్టార్ బ్యాటర్ బాబర్ అజామ్ తన పాత తప్పులనే మళ్లీ మళ్లీ పునరావృతం చేస్తున్నారని రవిచంద్రన్ అశ్విన్ విమర్శించారు. ముఖ్యంగా జస్ప్రీత్ బూమ్రా బౌలింగ్‌లో బాబర్ ఆడుతున్న తీరు ఆశ్చర్యకరంగా ఉందని పేర్కొన్నారు. రెండేళ్ల క్రితం బుమ్రా బౌలింగ్‌లో ఏ విధంగానైతే థర్డ్ మ్యాన్ దిశగా బంతిని నెట్టి ఔట్ అయ్యారో.. ఇప్పుడు కూడా అదే షాట్ ఆడి వికెట్ పారేసుకున్నారని గుర్తు చేశారు. ప్రపంచ స్థాయి బ్యాటర్ అనిపించుకునే వ్యక్తి ఒకే రకమైన తప్పుతో పదే పదే ఔట్ అవ్వడం ఏంటని అశ్విన్ ప్రశ్నించారు.
వ్యూహాల లోపం.. కొరవడిన కసి
పాకిస్థాన్ జట్టులో వ్యూహాత్మక లోపాలు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయని రవిచంద్రన్ అశ్విన్ అన్నారు. మిడిలార్డర్‌లో మహమ్మద్ నవాజ్ వంటి ఆటగాళ్లు క్రీజులోకి వచ్చినప్పుడు కనీసం పరుగులు చేసే ప్రయత్నం చేయకుండా డిఫెన్స్‌కే పరిమితం కావడం టీ20 ఫార్మాట్‌కే విరుద్ధమని ఆయన మండిపడ్డారు. భారత బౌలర్ల ధాటికి పాక్ ఆటగాళ్లు చేతులెత్తేశారని.. ఇలాంటి ఆటతీరుతో టీమిండియాకు సవాల్ విసరడం అసాధ్యమని స్పష్టం చేశారు. ప్రస్తుతం పాక్ జట్టు సూపర్-8 రేసులో నిలవాలంటే నమీబియాతో జరిగే మ్యాచ్‌లో భారీ విజయం సాధించాల్సిన ఒత్తిడిలో ఉందని అశ్విన్ ముగించారు.