
ముంబై: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా కొనసాగుతోన్న టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్ ఫీవర్.. భారత్‌ను ఆవహించింది. సూపర్ 12 మ్యాచ్‌లు ఆరంభమైన రెండో రోజే భారత్.. తన చిరకాల ప్రత్యర్థి, దాయాది దేశాన్ని ఎదుర్కొనబోతోండటం దీన్ని మరింత తీవ్రతరం చేసింది. యావత్ దేశం ఫోకస్ మొత్తం భారత్-పాకిస్తాన్ మ్యాచ్ మీదే నిలిచింది. ఈ టోర్నమెంట్‌లో ఈ రెండు జట్లు కూడా తొలిసారిగా ఎదురెదురు పడ్డాయి. టీమ్-1లో శనివారం రాత్రి రెండు మ్యాచ్‌లు ముగిశాయి.
దక్షిణాఫ్రికా-ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్-వెస్టిండీస్ మధ్య పోరు ముగిసింది. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాలు బోణీ కొట్టాయి. టేబుల్ టాపర్లుగా నిలిచాయి. టీమ్-2లో ఉన్న శ్రీలంక-బంగ్లాదేశ్ మధ్య మరో మ్యాచ్ షార్జా స్టేడియంలో మొదలవుతుంది. మధ్యాహ్నం 3:30 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది. సాయంత్రం 7:30 గంటలకు దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా భారత్-పాకిస్తాన్ మధ్య పోటీ ఆరంభమౌతుంది. స్టార్ నెట్‌వర్క్ దీన్ని టెలికాస్ట్ చేస్తుంది.
కాగా- బిగ్ స్క్రీన్స్ మీద కూడా ఈ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. ఇదొక్కటే కాదు- టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా ఆడే అన్ని మ్యాచ్‌లు కూడా సినిమా థియేటర్లల్లో లైవ్ టెలికాస్ట్ కానున్నాయి. పీవీఆర్ సినిమాస్‌లల్లో మాత్రమే ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుంది. దేశవ్యాప్తంగా 30కి పైగా నగరాల్లో 75 థియేటర్లల్లో భారత్-పాకిస్తాన్ మ్యాచ్ సహా భారత జట్టు ఆడే అన్ని పోటీలను లైవ్ టెలికాస్ట్ చేయడానికి పీవీఆర్ సినిమాస్ గ్రూప్ థియేటర్ల యాజమాన్యం ఏర్పాట్లు పూర్తి చేసింది.
ఈ మేరకు పీవీఆర్ సినిమాస్ యాజమాన్యం.. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్‌తో ఓ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. టీమిండియా ఆడే అన్ని మ్యాచ్‌లను లైవ్ టెలికాస్ట్ చేయడానికి అవసరమైన ప్రసార హక్కులను కొనుగోలు చేసింది. హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ-నేషనల్ క్యాపిటల్ రీజియన్, అహ్మదాబాద్, అమృత్‌సర్, ఆనంద్ (గుజరాత్), భిలాయ్, భిలాస్‌పూర్, చండీగఢ్, గాంధీనగర్, జలంధర్, జల్‌గావ్, జామ్‌నగర్, లాతూర్, లక్నో, లూధియానా, మొహాలి, ముంబై, నాగ్‌పూర్, నాందెడ్, నాసిక్, పఠాన్‌కోట్, ప్రయాగ్‌రాజ్, పుణె, రాయ్‌పూర్, సూరత్, వడోదర వంటి నగరాల్లోని పీవీఆర్ సినిమాస్‌లల్లో ఆయా మ్యాచ్‌ల ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది.