ఆసియా కప్ 2025లో భాగంగా టీమిండియా, పాకిస్థాన్ జట్ల మధ్య దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ తర్వాత కొత్త వివాదం మొదలైంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా గెలిచిన అనంతరం భారత ఆటగాళ్లు పాకిస్థాన్ ఆటగాళ్లకు షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. దీనిపై పాకిస్థాన్ కోచ్ మైక్ హెస్సన్ తీవ్రంగా స్పందించారు.
పాకిస్థాన్ కోచ్ మైక్ హెస్సన్ ఆగ్రహం
పాక్ కోచ్ మైక్ హెస్సన్ మాట్లాడుతూ.. టీమిండియా ఆటగాళ్లు షేక్ హ్యాండ్స్ ఇవ్వకపోవడ చాలా బాధగా అనిపించిందని అన్నారు. భారత ఆటగాళ్ల ప్రవర్తన తమ జట్టును నిరుత్సాహపరిచిందని ఆయన చెప్పుకొచ్చారు. మ్యాచ్ ముగిసిన తర్వాత పాకిస్థాన్ ఆటగాళ్లందరూ షేక్ హ్యాండ్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని.. కానీ సూర్యకుమార్ యాదవ్, శివం దూబే మైదానం వదిలి వెళ్లిపోయారని ఆయన ఆరోపించారు.

పహల్గాం ఘటన ప్రభావం
ఈ ప్రవర్తన సరైనది కాదని పాక్ కోచ్ హెస్సన్ మండిపడ్డారు. ఆటను ఆటలాగే చూడాలని కోరారు. అయితే దీనికి ముందు టాస్ సమయంలో కూడా పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘాకు టీమిండియా ఆటగాళ్లు షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడం గమనార్హం. ఇటీవల జరిగిన పహల్గాం సంఘటన నేపథ్యంలో సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని జట్టు ఇలా వ్యవహరించిందని సమాచారం. ఈ విషయంలో భారత అభిమానులు మాత్రం టీమిండియా ఆటగాళ్ల తీరును సమర్థిస్తున్నారు.
మలుపు తిప్పిన కుల్దీప్, అభిషేక్
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 127 పరుగులు చేసింది. షాహీన్ షా అఫ్రిది(16 బంతుల్లో 4 సిక్స్‌లతో 33 నాటౌట్) ఒక్కడే దూకుడుగా ఆడగా.. సాహిబ్జాదా ఫర్హాన్(44 బంతుల్లో ఫోర్, 3 సిక్స్‌లతో 40) ఆచితూచి ఆడాడు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్(3/18) మూడు వికెట్లు తీయగా.. అక్షర్ పటేల్(2/18), జస్‌ప్రీత్ బుమ్రా(2/28) రెండేసి వికెట్లు పడగొట్టారు. హర్దిక్ పాండ్యా, వరుణ్ చక్రవర్తీ చెరో వికెట్ తీసారు.
అనంతరం భారత్ 15.5 ఓవర్లలో 3 వికెట్లకు 131 పరుగులు చేసి గెలుపొందింది. సూర్యకుమార్ యాదవ్(37 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 47 నాటౌట్), అభిషేక్ శర్మ(13 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 31), తిలక్ వర్మ(31 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 31) రాణించారు. పాకిస్థాన్ బౌలర్లలో సైమ్ అయుబ్(3/35) ఒక్కడే మూడు వికెట్లు తీసాడు.