

హైదరాబాద్: ఆసియాకప్‌లో భాగంగా భారత్-పాక్ జట్ల మధ్య జరుగుతున్న ఆసక్తికర పోరులో అనూహ్య సంఘటన చోటు చేసుకుంది. టీమిండియా ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా బౌలింగ్ చేస్తూ ఒక్కసారిగా మైదానంలో కూప్పకూలాడు. ఇన్నింగ్స్ 18వ ఓవర్ వేస్తున్న హార్దిక్ పాండ్యా అదే ఓవర్ ఐదో బంతిని బౌల్ వేసిన అనంతరం కిందపడ్డాడు.
బంతిని వేసిన తర్వాత కుడి కాలును నేలపై సరిగా వేయడంలో పాండ్యా ఇబ్బందిపడ్డాడు. బాధతో విలవిలలాడిపోయాడు. దీంతో తన నడుముని పట్టుకొని పిచ్‌పై పడుకున్నాడు. అదే సమయంలో జట్టులోని సహచర క్రికెటర్లు అతని వద్దకు పరిస్థితి ఎలా ఉందోనని పరీశించారు. అప్పటికే జట్టు ఫిజియో మైదానంలోకి చేరుకొని అతని గాయాన్ని పరిశీలించారు.

గాయం తీవ్రంగా ఎక్కువగా ఉండటంతో స్ట్రెచర్ తీసుకువచ్చి వెంటనే అతన్ని మైదానం నుంచి తీసుకెళ్లారు. పాండ్యా వెళ్లిపోవడంతో అతని స్థానంలో 18వ ఓవర్ చివరి బంతికి అంబటి రాయుడు వేశాడు. ప్రస్తుతం దుబాయ్‌లో ఎండలు మండుతున్న సంగతి తెలిసిందే. దీంతో ఆటగాళ్లు తీవ్ర ఇబ్బందులుపడుతున్నారు.
పాండ్యాకు తీవ్రమైన వెన్ను నొప్పి వచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అతను లేచి నిలబడుతున్నాడని డాక్టర్లు తెలిపారు. ప్రస్తుతం 28 ఓవర్లు ముగిసేసరికి పాకిస్థాన్ 5 వికెట్ల నష్టానికి 100 పరుగులు చేసింది. క్రీజులో ఆసిఫ్ అలీ(9), షాదబ్ ఖాన్(2) పరుగులతో ఉన్నారు.