
భారత్-పాక్..
రెండో మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ ఢీ కొనబోతోన్నాయి. ఇదే దుబాయ్ స్టేడియంలో ఆదివారం సాయంత్రం 7:30 గంటలకు ఈ మ్యాచ్ షెడ్యూల్ అయింది. రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా బాబర్ ఆజమ్ సేనతో తలపడనుంది. సుదీర్ఘ విరామం అనంతరం ఈ రెండు జట్ల మ్యాచ్ జరగనుంది. భారత్-పాకిస్తాన్ మధ్య మ్యాచ్ అంటే దాన్ని మ్యాచ్‌గా మాత్రమే చూడరు అభిమానులు. అంతకుమించి అనే స్థాయిలో ఉంటుంది.

నెట్స్‌లో..
బాబర్ ఆజమ్ సారథ్యంలో బలమైన జట్టుగా ఆవిర్భవించిన పాకిస్తాన్ జట్టును ఢీ కొట్టడానికి టీమిండియా శ్రమిస్తోంది. నెట్ ప్రాక్టీస్‌లో చెమటోడుస్తోంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్, భువనేశ్వర్ కుమార్, విరాట్ కోహ్లీ, దీపక్ హుడా, రవీంద్ర జడేజా, సూర్యకుమార్ యాదవ్.. ఇలా టీమ్ మొత్తం నెట్‌లో గంటల తరబడి ప్రాక్టీస్ చేస్తోంది. హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ పర్యవేక్షణలో ప్లేయర్లు రాటుదేలుతున్నారు.

అందరి దృష్టీ కోహ్లీ మీదే..
ఫామ్ కోల్పోవడం వల్ల విమర్శల సునామీని ఎదుర్కొంటోన్న విరాట్ కోహ్లీపైనే అందరి దృష్టీ నిలిచింది. ఈ టోర్నమెంట్‌లో కోహ్లీ ఎలా ఆడబోతోన్నాడనేది ఆసక్తి రేపుతోంది. కోహ్లీ కేరీర్‌లో ఈ టోర్నమెంట్ అత్యంత కీలకంగా మారింది. ఇందులో గనక విఫలమైతే జట్టులో స్థానం కోల్పోయే ప్రమాదం కూడా లేకపోలేదంటూ వార్తలు వస్తోన్న నేపథ్యంలో- కోహ్లీ నెట్స్‌లో శ్రమిస్తోన్నాడు. స్పిన్, పేస్ బౌలింగ్‌ను ఎదుర్కొంటోన్నాడు. తనదైన శైలిలో షాట్లను ఆడుతున్నాడు.
రివర్స్ స్వీప్ షాట్లతో..
ఎప్పుడూ లేనివిధంగా రివర్స్ స్వీప్ షాట్లను విరాట్ కోహ్లీ నెట్స్‌లో ప్రాక్టీస్ చేయడం కనిపించింది. రివర్స్ స్వీప్ షాట్లను 100 శాతం ఖచ్చితత్వంతో ఆడాడు. అదే దూకుడును మ్యాచ్‌లో కొనసాగించగలిగితే- అతని బ్యాట్ నుంచి పరుగుల వరద పారుతుందనడంలో సందేహాలు అక్కర్లేదు. విమర్శకులందరికీ తన బ్యాటింగ్‌తో సమాధానం చెప్పగలడు. మిగిలిన ప్లేయర్లతో పోల్చుకుంటే కోహ్లీ ఒక్కడే ఒత్తిడిని ఎదుర్కొంటోన్నాడు.

ఆ రికార్డ్..
ఆసియా కప్‌లో రెండో ఇన్నింగ్‌లో బ్యాటింగ్‌కు దిగి జట్టును విజయ తీరాలకు చేర్చిన టీమిండియా జట్టులో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో విరాట్ కోహ్లీ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. సక్సెస్ ఫుల్ ఛేజింగ్‌లో అతను 494 పరుగులు చేశాడు. 98.80 యావరేజ్ అతని సొంతం. కోహ్లీ కంటే ముందు రోహిత్ శర్మ ఉన్నాడు. 47.75 యావరేజ్‌తో రోహిత్ 522 పరుగులు చేశాడు. ఇక మూడోస్థానం సచిన్ టెండుల్కర్‌దే. 452 పరుగులు చేశాడీ మాస్టర్ బ్లాస్టర్.


Click it and Unblock the Notifications
