
షార్జా: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ గడ్డపై భారత క్రికెట్ జట్టు చెలరేగుతోంది. ఆసియా కప్ 2022 టోర్నమెంట్‌పై పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. గ్రూప్-ఏలో భాగంగా ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌లల్లోనూ విజయఢంకా మోగించింది. ఈ గ్రూప్‌లో అగ్రస్థానంలో నిలిచింది. రెండో రౌండ్‌కు అలవోకగా అర్హత సాధించింది. సూపర్ 4లో పాకిస్తాన్‌తో తలపడడానికి సన్నద్ధమౌతోంది. భారత్‌తో పాటు పాకిస్తాన్, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్ సూపర్ 4కు అర్హత సాధించాయి.
రెండో రౌండ్‌లో ఈ నాలుగు జట్లు కూడా మూడేసి చొప్పున మ్యాచ్‌లను ఆడతాయి. టీమిండియా తొలుత పాకిస్తాన్, అనంతరం శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్‌లను ఎదుర్కొంటుంది. పాకిస్తాన్‌తో మ్యాచ్ ఆదివారం షెడ్యూల్ అయింది. 6వ తేదీన శ్రీలంకతో తలపడుతుంది. 8వ తేదీన ఆఫ్ఘనిస్తాన్‌ను ఢీ కొడుతుంది. సరిగ్గా వారం రోజుల తరువాత పాకిస్తాన్‌ను మరోసారి ఎదుర్కొనబోతోంది. ఈ మ్యాచ్ కోసం టీమిండియా కఠోరంగా ప్రాక్టీస్ చేస్తోంది.
ఈ పరిస్థితుల మధ్య రవీంద్ర జడేజా గాయంతో వైదొలగడం టీమిండియాకు కొంత ఇబ్బంది కలిగించే అంశమే అయనప్పటికీ.. మరో ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ రూపంలో రీప్లేస్‌మెంట్ లభించింది. రవీంద్ర జడేజా తరహాలోనే అక్షర్ పటేల్ కూడా స్పిన్ బౌలర్ కమ్ బ్యాటర్. లోయర్ మిడిలార్డర్‌లో బ్యాటింగ్ చేయగల సమర్థుడు. రవీంద్ర జడేజాలో ఉండే క్వాలిటీస్ అన్నీ అక్షర్‌లో ఉన్నాయని, అది నిజంగా టీమిండియా చేసుకున్న అదృష్టమని మాజీ క్రికెటర్ వసీం జాఫర్ వ్యాఖ్యానించాడు.
రవీంద్ర జడేజా లేని లోటు తెలియకుండా రాణించగల శక్తి సామర్థ్యాలు అక్షర్ పటేల్‌కు ఉన్నాయని చెప్పాడు. పాకిస్తాన్, హాంకాంగ్‌పై రవీంద్ర జడేజా అంచనాలకు తగ్గట్టే ఆడాడని, సూపర్-4లోనూ అదే స్థాయి దూకుడును ప్రదర్శిస్తాడని ఆశించానని అన్నాడు. దురదృష్టం అతన్ని గాయం రూపంలో వెంటాడని చెప్పాడు. రవీంద్ర జడేజా అందుబాటులో లేకపోవడం వల్ల టీమిండియా పెద్డగా ఆందోళన చెందనక్కర్లేదని, అచ్చంగా అతని తరహాలోనే ఆడగల మరో ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ ఉన్నాడని చెప్పాడు.
రవీంద్ర జడేజా స్థానాన్ని అక్షర్ పటేల్‌తో భర్తీ చేయాలనుకోవడం బ్యాడ్ ఐడియా కాదని తేల్చి చెప్పాడు. అక్షర్ పటేల్‌కు ప్రత్యామ్నాయం మరొకరు కనిపించట్లేదని వసీం జాఫర్ పేర్కొన్నాడు. వెస్టిండీస్ పర్యటనలో అక్షర్ ఎలా ఆడాడనేది అందరూ చూశారని, పవర్ ప్లేలో సమర్థవంతంగా బౌలింగ్ చేయగలనని ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్లల్లో తనను తాను నిరూపించుకున్నాడని చెప్పాడు. జడేజా లేని లోటు రానివ్వడని అంచనా వేశాడు.