
అబుధాబి: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా ఆసియా కప్ మెగా క్రికెట్ టోర్నమెంట్ ఇవ్వాళ ఆరంభం కానుంది. గ్రూప్-బీలో శ్రీలంక-ఆఫ్ఘనిస్తాన్ తలపడబోతోన్నాయి. ఇదే తొలి మ్యాచ్. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ఈ రెండు జట్లు తలపడనున్నాయి. భారత కాలమానం ప్రకారం ఈ సాయంత్రం 7:30 గంటలకు మ్యాచ్ ఆరంభమౌతుంది. గ్రూప్-ఏలో భారత్, పాకిస్తాన్, హాంకాగ్, గ్రూప్-బీలో శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ ఆడనున్నాయి.
ఈ టోర్నమెంట్‌లో ప్రస్తుతం అందరి దృష్టీ విరాట్ కోహ్లీ మీదే నిలిచింది. ఈ మధ్యకాలంలో పూర్తిస్థాయిలో ఫామ్‌ను కోల్పోయిన అతను ఎలా ఆడతాడనేది ఆసక్తికరంగా మారింది. ఫామ్ కోల్పోవడం వల్ల విమర్శలను ఎదుర్కొంటోన్నాడు కింగ్ కోహ్లీ. కోహ్లీ కేరీర్‌లో ఈ టోర్నమెంట్ అత్యంత కీలకం. ఇందులో గనక విఫలమైతే జట్టులో స్థానం కోల్పోయే ప్రమాదం కూడా లేకపోలేదనే అభిప్రాయాలు సైతం ఉన్నాయి. ఒక్క భారీ ఇన్నింగ్ అతని బ్యాట్ నుంచి జాలువారితే విమర్శలు చెక్ పెట్టినట్టే అవుతుంది.
ఈ క్రమంలో తోటి ప్లేయర్ల కంటే కూడా విరాట్ కోహ్లీనే ఎక్కువ ఒత్తిడిని ఎదుర్కొంటోన్నాడు. ఈ పరిణామాలు అటు పాకిస్తాన్ ప్లేయర్లను కూడా కలవరానికి గురి చేస్తోంది. ఆసియా కప్‌లో విరాట్ కోహ్లీ సెంచరీ చేయాలని తాను కోరుకుంటున్నానంటూ పాకిస్తాన్ స్పిన్ బౌలర్ షాదాబ్ ఖాన్ వ్యాఖ్యానించాడు. అతను ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాటర్ అనడంలో సందేహాలు అక్కర్లేదని తేల్చి చెప్పాడు. ప్రతి ప్లేయర్‌కూ కేరీర్‌లో ఎప్పుడో ఒకప్పుడు గడ్డు పరిస్థితులను ఎదుర్కొనడం ఖాయమని చెప్పాడు.
ప్రస్తుతం విరాట్ కోహ్లీ అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటోన్నాడని షాదాబ్ ఖాన్ అన్నాడు. ఈ ఆసియాకప్‌లో విరాట్ కోహ్లీ పరుగుల కొరతను తీర్చుకోవాలని ఆశిస్తున్నానని పేర్కొన్నాడు. కోహ్లీ ఫామ్ కోసం ప్రార్థిస్తానని చెప్పాడు. ఈ టోర్నమెంట్‌లో కోహ్లీ సెంచరీ చేయాలని ఓ సగటు అభిమానిగా తాను కోరుకుంటోన్నానని, ఆ సెంచరీ తమ జట్టు మీద మాత్రం కాకూడదని నవ్వుతూ చెప్పాడు. షహెన్‌షా అఫ్రిది, మహ్మద్ వసీంలను మిస్ అయ్యామని, వారిద్దరూ టెర్రిఫిక్ ప్లేయర్లని చెప్పాడు.