
దుబాయ్: ఆసియా కప్ 2022 టోర్నమెంట్‌లో భాగంగా ఇంకొన్ని గంటల్లో భారత జట్టు తన చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో ప్రతిష్ఠాత్మక మ్యాచ్ ఆడబోతోంది. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా ఈ సాయంత్రం 7:30 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. దీనికోసం సర్వం సిద్ధమైంది. కరోనా వైరస్ బారిన పడటం వల్ల నిన్నటి వరకు జట్టుకు దూరంగా ఉన్న హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ అందుబాటులోకి వచ్చాడు. మ్యాచ్ కోసం అభిమానులు ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తోన్నారు.
విరాట్ కోహ్లీ లాగే ఈ మ్యాచ్ కూడా ఓపెనర్ కేఎల్ రాహుల్‌కు ప్రత్యేకమైనదే. కోహ్లీకి ఇది వందో టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్. దీనితో అన్ని ఫార్మాట్లలోనూ వంద మ్యాచ్‌లు ఆడిన ఏకైక టీమిండియా ప్లేయర్‌గా గుర్తింపును సాధిస్తాడీ కింగ్. ఇదివరకే వన్డే ఇంటర్నేషనల్స్, టెస్ట్ ఫార్మట్‌లో 100 మ్యాచ్‌లను ఆడేశాడు. ఇప్పటివరకు కోహ్లీ 99 టీ20 ఇంటర్నేషనల్స్ ఆడాడు. 3,308 పరుగులు చేశాడు. ఇందులో 30 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. బ్యాటింగ్ యావరేజ్ 50.12. అలాగే 137.66 స్ట్రైక్ రేట్‌తో బౌలర్లపై విరుచుకుపడ్డాడు.
కేఎల్ రాహుల్‌కూ ఇది ప్రత్యేకమైనదే. ఈ సంవత్సరం అతను ఆడబోయే తొలి టీ20 ఇంటర్నేషనల్ ఇదే. ఈ ఏడాది ఇప్పటివరకు ఈ ఫార్మట్‌లో అడుగు పెట్టలేదు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ ముగిసిన తరువాత అతను గాయపడ్డాడు. సుమారు మూడు నెలల పాటు విశ్రాంతి తీసుకున్నాడు. క్రికెట్‌కు దూరంగా గడిపాడు. దక్షిణాఫ్రికా, ఐర్లాండ్, ఇంగ్లాండ్, వెస్టిండీస్ పర్యటనలకు ఎంపిక కాలేదు. కిందటి వారమే ముగిసిన జింబాబ్వే సిరీస్‌తో మళ్లీ పునరాగమనం చేశాడు. అది 50 ఓవర్ల ఫార్మట్.
ఇప్పుడు తాజాగా ఆసియా కప్ 2022లో టీ20 ఫార్మట్ మ్యాచ్‌లను ఆడబోతోన్నాడు. తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్‌ను ఢీ కొట్టబోతోన్నాడు.. జట్టుతో కలిసి. కేప్టెన్ రోహిత్ శర్మతో కలిసి ఇన్నింగ్‌ను ఆరంభించనున్నాడు. జింబాబ్వే పర్యటనలో కూడా పెద్దగా రాణించకపోవడం ఒకింత ఆందోళనకు గురి చేసే విషయం. ఫటాఫట్ ఫార్మట్‌కు దూరంగా ఉండటం..విరామం తరువాత ఆడబోయే తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్‌తో తలపడనుండటం ఉత్కంఠతకు గురి చేస్తోంది.