
దుబాయ్: జై షా. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ కార్యదర్శి. అంతకుమించి- భారతీయ జనతా పార్టీ బిగ్ షాట్, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కుమారుడు. తాజాగా వివాదాలకు కేంద్ర బిందువు అయ్యారు. ఆయన వైఖరి పట్ల అభిమానులు మండిపడుతున్నారు. జాతీయ పతాకాన్ని అవమానించారని, దీనికి వివరణ ఇవ్వాల్సిందేనంటూ పట్టుబట్టారు. దీనిపై జై షా ఎలా స్పందిస్తారనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
ఆసియా కప్ 2022 టోర్నమెంట్‌లో భాగంగా ఆదివారం రాత్రి దుబాయ్ స్టేడియంలో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించిన అనంతరం చోటు చేసుకున్న ఘటన ఇది. చివరి ఓవర్ నాలుగో బంతిని హార్దిక్ పాండ్యా సిక్స్‌గా మలిచి జట్టుకు విజయాన్ని అందించడంతో- అప్పటి వరకు ఉత్కంఠభరితంగా మ్యాచ్‌ను చూస్తోన్న అభిమానుల ఆనందం కట్టలు తెంచుకుంది. జాతీయ పతాకాలను స్టేడియంలో రెపరెపలాడించారు.
వీఐపీ బాక్స్‌లో ఉంటూ మ్యాచ్ చూస్తోన్న జై షా, ఇతర ప్రముఖులు కూడా లేచి నిల్చుని గట్టిగా చప్పట్లు కొట్టారు. తిరంగా రెపరెపలాడించారు. ఆ సమయంలో జై షా పక్కనే నిల్చున్న ఓ వ్యక్తి తన చేతిలో ఉన్న జాతీయ జెండాను ఆయనకు అందించడానికి ప్రయత్నించాడు. జెండాను జై షా చేతికి ఇవ్వబోగా.. చప్పట్లు కొడుతూ కనిపించిన ఆయన దీన్ని అందుకోవడానికి నిరాకరించారు. తలను అడ్డంగా ఊపారు.
దీనికి సంబంధించిన అయిదు సెకెన్ల నిడివి ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అమిత్ షా వైఖరిని నెటిజన్లు తప్పుపడుతున్నారు. ఆయనను ట్రోల్ చేస్తోన్నారు. తిరంగాను తీసుకోవడానికి ఎందుకు ఇష్టపడట్లేదంటూ నిలదీస్తోన్నారు. ఇదేనా మీ దేశభక్తి అంటూ నిలదీస్తోన్నారు. ప్రతి ఇంటి మీదా జాతీయ జెండాను ఎగువేయాలంటూ సలహాలను మాత్రం ఇస్తారు.. తాము మాత్రం దీన్ని పాటించరంటూ ధ్వజమెత్తుతున్నారు.
మొన్నటికి మొన్నే కేంద్ర ప్రభుత్వం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించింది. హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్నీ అంతే ఘనంగా చేపట్టింది. ప్రధాని విజ్ఞప్తి మేరకు సోషల్ మీడియాలో యూజర్లందరూ తమ డీపీలను జాతీయ పతాకాలతో నింపేశారు. ప్రతి ఇంటిపైనా తిరంగాను ఎగురవేశారు. ఆ కార్యక్రమాన్ని నెటిజన్లు గుర్తు చేస్తోన్నారు. జాతీయ పతాకాన్ని అవమానించారంటూ భగ్గుమంటోన్నారు.