
దుబాయ్: ఆసియా కప్ 2022 టోర్నమెంట్‌లో పాకిస్తాన్‌పై మ్యాచ్ గెలిచిన తరువాత టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా పేరు మారుమోగిపోతోంది. తొలుత బంతితో ఆ తరువాత బ్యాట్‌తో చెలరేగిపోయాడు. తన నాలుగు ఓవర్లలో 25 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీసుకున్నాడు. ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్, ఇఫ్తికర్ అహ్మద్, ఖుష్‌దిల్ షాలను పెవిలియన్ దారి పట్టించాడు. అద్భుతమైన షార్ట్ బంతుల్లో వికెట్లను పడగొట్టాడు.
అనంతరం బ్యాటింగ్‌లో విజృంభించాడు. 17 బంతుల్లో 33 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. చివరి ఓవర్ నాలుగో బంతికి సిక్స్ కొట్టి జట్టును గెలిపించడం మ్యాచ్‌కే హైలైట్. హార్దిక్ పాండ్యాను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ సహా పలువురు నాయకులు ప్రశింసించారు. అభినందిస్తూ ట్వీట్లు పెట్టారు. ఆయనను హీరోగా కీర్తిస్తోన్నారు కోట్లాదిమంది అభిమానులు. మ్యాచ్‌ను ఒంటిచేత్తో గెలిపించడం పట్ల పండగ చేసుకుంటోన్నారు.
హార్దిక్ పాండ్యా భార్య నటాసా స్టాంకోవిక్ కూడా దీనికి మినహాయింపు కాదు. అతణ్ని స్టార్ అని కీర్తించింది. తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో వరుసగా పోస్టులు పెట్టింది. మ్యాచ్‌ను ఫినిష్ చేసిన తరువాత హార్దిక్ పాండ్యా బ్యాట్ ఎత్తి నిల్చున్న ఫొటోను ఆమె తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. గర్వంగా ఉంది అనే క్యాప్షన్ దానికి జత చేశారు. దీనికి రెడ్ హార్ట్ ఎమోజీ, స్టార్ ఎమోజీని జోడించారు. తన భావోద్వేగాలను పంచుకున్నారు.
దుబాయ స్టేడియంలో ఆదివారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్.. 19.5 ఓవర్లల్లో 147 పరుగులకు ఆలౌట్ అయింది. ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ ఒక్కడే టాప్ స్కోరర్. 42 బంతుల్లో నాలుగు ఫోర్లు, ఒక సిక్స్‌తో 43 పరుగులు చేశాడతను. టాప్ ఆర్డర్‌లో ఇఫ్తికర్ అహ్మద్ 28 పరుగులు చేశాడు. టీమిండియా బౌలర్ల దెబ్బకు కేప్టెన్ బాబర్ ఆజమ్ సహా మిగిలిన బ్యాటర్లెవరూ భారీ స్కోర్ సాధించలేకపోయారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత్.. అయిదు వికెట్లు మాత్రమే కోల్పోయి ఆ లక్ష్యాన్ని ఛేదించింది.