ఎడమ చెయ్యి ఎఫెక్ట్ కలిసొస్తుందా?: బిగ్ కన్ఫ్యూజన్‌లో రోహిత్ శర్మ..!!

దుబాయ్: ఆసియా కప్ 2022 టోర్నమెంట్‌లో భాగంగా ఇంకొన్ని గంటల్లో భారత జట్టు చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో ప్రతిష్ఠాత్మక మ్యాచ్ ఆడబోతోంది. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా ఈ సాయంత్రం 7:30 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. దీనికోసం సర్వం సిద్ధమైంది. కరోనా వైరస్ బారిన పడటం వల్ల నిన్నటి వరకు జట్టుకు దూరంగా ఉన్న హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ అందుబాటులోకి వచ్చాడు. మ్యాచ్ కోసం అభిమానులు ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తోన్నారు.

ప్లేయింగ్ 11పై..
ఈ పరిణామాల మధ్య కేప్టెన్ రోహిత్ శర్మ గందరగోళంలో పడినట్టు కనిపిస్తోన్నాడు. పాకిస్తాన్‌పై ఆడబోయే మ్యాచ్ కోసం తుదిజట్టులో ఎవరిని తీసుకోవాలనే విషయం మీద హిట్ మ్యాన్ మల్లగుల్లాలు పడుతున్నాడు. ఎవరెవరిని ప్లేయింగ్ 11లో ఆడించాలనే విషయం మీద ఓ స్పష్టతకు రాలేకపోతోన్నాడు. శనివారం నాటి విలేకరుల సమావేశంలోనూ ఇదే విషయాన్ని స్పష్టం చేసిన విషయం తెలిసిందే. తుది జట్టును ఇంకా ఎంపిక చేయలేదని, దీనిపై కసరత్తు కొనసాగుతోందని వ్యాఖ్యానించాడు.

బ్యాటింగ్ ఆర్డర్
శ్రీలంక-ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరిగే మ్యాచ్ ఫలితం వెలువడిన తరువాతే ఎవరిని ఆడించాలనే విషయంపై తుది కసరత్తు చేస్తామనీ పేర్కొన్నాడు రోహిత్ శర్మ. దీనికి కారణాలు లేకపోలేదు. బ్యాటింగ్ ఆర్డర్‌లో అయిదో స్థానంలో ఎవరిని తీసుకోవాలనే విషయం మీద రోహిత్ శర్మ కాస్త ఆందోళన, గందరగోళానికి గురవుతున్నట్లు చెబుతున్నారు. తొలి నాలుగు స్థానాలు ఖాయమైనప్పటికీ.. లోయర్ ఆర్డర్‌లో బలమైన బ్యాటర్‌గా ఈ ఇద్దరిలో ఎవరిని తీసుకోవాలనే విషయం మీద ఎటూ తేల్చుకోలేకపోతోన్నాడని అంటున్నారు.

తొలి నాలుగు స్థానాల్లో..
తొలి నాలుగు స్థానాల్లో అంటే- ఓపెనింగ్ పెయిర్‌గా రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ దాదాపు ఖాయమైనట్టే. వన్‌డౌన్‌లో విరాట్ కోహ్లీ, టాప్ ఆర్డర్‌లో సూర్యకుమార్ యాదవ్ బరిలోకి దిగుతారు. రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్.. ఈ బ్యాటింగ్ లైనప్ దాదాపుగా ఫిక్స్ అయింది. ఆ తరువాత వచ్చే బ్యాటర్ ఎవరనేది ఇంకా తేలట్లేదు. అయిదో స్థానంలో రిషభ్ పంత్‌ను బరిలోకి దింపాలా? లేక దినేష్ కార్తీక్‌ను తీసుకోవాలా? అనే విషయంపై పీటముడి పడినట్లు సమాచారం.

పంత్ వైపే మొగ్గు..
ఇద్దరూ వికెట్ కీపర్ బ్యాటర్లే. ఎలాంటి పరిస్థితుల్లోనూ క్రీజ్‌లో పాతుకుపోయి బ్యాటింగ్ చేయగల సామర్థ్యం ఉంది. భారీ షాట్లతో బౌలర్లపై ఎదురుదాడికి దిగే అటాకింగ్ పవర్ వీరి సొంతం. ఇద్దరూ ఫుల్ ఫామ్‌లోనే ఉంటోన్నారు. వారిలో ఒక్కరికి మాత్రమే తుదిజట్టులో తీసుకునే అవకాశం ఉంది. ఆ ఒక్కరు ఎవరనేది కేప్టెన్ రోహిత్ శర్మ-హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ తీసుకునే నిర్ణయం మీదే ఆధారపడి ఉంది. ఇద్దరినీ తీసుకోవాల్సి వస్తే- దీపక్ హుడాకు చోటు దక్కదు.

పంత్ వైపే..
రోహిత్ శర్మ మాత్రం ఒకింత రిషభ్ పంత్ వైపే మొగ్గు చూపొచ్చనే అభిప్రాయాలు ఉన్నాయి. దీనికి కారణం- అతను లెఫ్ట్ హ్యాండర్ కావడమే. లెఫ్ట్ హ్యాండ్ బ్యాటింగ్ ఎప్పుడూ బౌలర్‌ను ఒకింత గందరగోళానికి గురి చేస్తుంది. తన లైన్ అండ్ లెంగ్త్, రిథమ్‌ను సవరించుకునేలా చేస్తుంది. అదే ఇప్పుడు రిషభ్ పంత్‌ను జట్టులోకి తీసుకోవడానికి ఓ ప్రధాన కారణంగా మారొచ్చని అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి.

హార్దిక్, జడేజా స్థానాలు..
ప్రస్తుతానికి రవీంద్ర జడేజా ఒక్కడే లెఫ్ట్ హ్యాండర్. అతనికి తోడుగా పంత్‌ను కూడా తీసుకుంటే బాగుంటుందని రోహిత్ శర్మ అభిప్రాయపడుతున్నాడు. అయిదో స్థానం తరువాత ఆల్ రౌండర్లు హార్ధిక్ పాండ్యా, రవీంద్ర జడేజా ఆ తరువాతి స్థానాల్లో ఉంటారు. లోయర్ ఆర్డర్‌లో భువనేశ్వర్ కుమార్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్ ఉంటారు. ఇదీ ప్రాథమికంగా నిర్దారించిన బ్యాటింగ్ లైనప్. ఇందులో మార్పులు ఉండొచ్చు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications