భారత్ Vs కివీస్ మ్యాచ్ రద్దు: ప్రపంచకప్ మ్యాచ్‌ల నిర్వహణపై ఫ్యాన్స్ నిరాశ!

హైదరాబాద్: ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న వన్డే వరల్డ్‌కప్‌ను వరుణుడు వదిలేలా కనిపించడం లేదు. ఒక మ్యాచ్ రద్దయితే ఏదో అనుకున్నారు. రెండో మ్యాచ్ రద్దయితే సర్దుకున్నారు. ఇక, ముచ్చటగా మూడోది కూడా రద్దు అయింది. తాజాగా నాలుగో మ్యాచ్ కూడా వర్షార్పణం అయింది.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
గురువారం నాటింగ్‌హామ్ వేదికగా న్యూజిలాండ్, భారత్ మధ్య జరగాల్సిన మ్యాచ్ టాస్ పడకుండానే రద్దైంది. ఎడతెరిపి లేని వర్షం కారణంగా పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన మ్యాచ్ చివరకు వర్షం ఎంతకూ తగ్గకపోవడంతో అంఫైర్లు మ్యాచ్‌ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఇరు జట్లకు చెరో పాయింట్ లభించింది.

వరుస విజయాలతో
నిజానికి భారత్, న్యూజిలాండ్ జట్లు వరుస విజయాలతో దూసుకుపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ అనగానే అభిమానుల అంచనాలు రెట్టింపయ్యాయి. ఈ మ్యాచ్‌కి ముందు ఓపెనర్‌గా కేఎల్ రాహుల్ ఎలా ఆడతాడో? నాలుగు స్థానంలో ఎవరు బ్యాటింగ్‌కు దిగుతారో? మళ్లీ ఇద్దరు స్పిన్నర్లనే ఆడిస్తారా? ఈ మ్యాచ్‌లో కోహ్లీ సెంచరీ సాధిస్తాడా? లాంటి ఎన్నెన్నో విశ్లేషణలు చేశారు.

సందడే లేదు
తీరా ఆట మొదలయ్యే సమయానికి మైదానంలో ఈ సందడేమీ కనిపించలేదు. అందుకు కారణంగా వరుణుడు ఈ మ్యాచ్‌కి అంతరాయం కలిగించడమే. ఒక్క బంతీ వేయకుండా, కనీసం టాస్ కూడా పడకుండానే ఈ మ్యాచ్ రద్దైంది. గత ప్రపంచకప్‌లో వర్షం వల్ల గరిష్టంగా రద్దయిన మ్యాచ్‌ల సంఖ్య రెండు.

మూడో వంతు పూర్తయ్యేసరికే
అయితే, ప్రస్తుతం ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్‌లో మాత్రం మూడో వంతు పూర్తయ్యేసరికే నాలుగు మ్యాచ్‌లు వర్షార్ఫణమయ్యాయి. అంతకముందు పాకిస్థాన్-శ్రీలంక, దక్షిణాఫ్రికా-వెస్టిండీస్, శ్రీలంక-బంగ్లాదేశ్ మ్యాచ్‌లు వర్షం వల్ల రద్దయిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ జాబితాలోకి ఇండియా-న్యూజిలాండ్ జట్లు కూడా చేరాయి.

ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన అభిమానులు
ఈ మ్యాచ్‌కోసం ఎంతో ఆసక్తిగా చూసిన అభిమానులకు చివరకు నిరాశే మిగిలింది. ప్రపంచంలోనే అత్యుత్తమ క్రికెట్ స్టేడియాలు ఉన్న దేశాల్లో ఇంగ్లాండ్ ఒకటి. అలాంటి ఇంగ్లాండ్‌లో... అది వరల్డ్‌కప్‌లో వర్షం కారణంగా మ్యాచ్‌లు రద్దు కావడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ముఖ్యంగా వర్షం పడుతున్న సమయంలో మైదానం మొత్తాన్ని పూర్తిగా కవర్లతో కప్పలేకపోవడం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది.

నాటింగ్‌హామ్ మైదానంలో
గురువారం భారత్-న్యూజిలాండ్ మ్యాచ్‌కు ఆతిథ్యమిచ్చిన నాటింగ్‌హామ్ మైదానంలో వర్షం పడుతున్నపుడు కేవలం పిచ్ పక్కన కొంత భాగాన్ని మాత్రమే కప్పి ఉంచారు. వర్షం తగ్గినప్పటికీ ఔట్‌ఫీల్డ్ చిత్తడిగా ఉండటంతో మ్యాచ్ సాధ్యపడలేదు. నిజానికి భారత్ లాంటి దేశాల్లో మైదానం మొత్తం కవర్లతో కప్పేయడం వల్లే ఇది సాధ్యమయ్యేదని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

402 మ్యాచ్‌లు జరిగితే
ప్రస్తుత టోర్నీకి ముందు వరకు ప్రపంచకప్‌లో 402 మ్యాచ్‌లు జరిగితే.. అందులో టాస్ పడకుండా రద్దయిన మ్యాచ్‌లు రెండు మాత్రమే. కానీ, ఈ టోర్నీలో ఇప్పటివరకు 18 మ్యాచ్‌లు పూర్తి కాగా.. అందులో మూడు టాస్ పడకుండానే రద్దకాగా... మరో మ్యాచ్ ఆట ఆరంభమైన కొద్దిసేపటికే ఆగిపోయింది.

భారత్-పాక్ మ్యాచ్‌పై వర్ష ప్రభావం?
ఇండియా-కివీస్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో ప్రస్తుతం అందరి దృష్టి టోర్నీకే హైలెట్‌గా నిలిచే భారత్-పాక్ మ్యాచ్‌పై పడింది. ఆదివారం పాకిస్థాన్‌తో జరగనున్న మ్యాచ్‌లో ఇలా జరిగితే అటు భారత్, పాక్ అభిమానులతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు సైతం నిరాశకు గురవుతారు. మరోవైపు భారత్-పాక్ మ్యాచ్‌కి వర్ష భయం లేదని అంటున్నారు. ఏం జరుగుతుందో తెలియాలంటే ఇంకో రెండు రోజులు ఆగాల్సిందే.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications