
కివీస్‌పై కనికరం లేకుండా..
ప్రస్తుతం న్యూజిలాండ్ జట్టు.. భారత్‌లో పర్యటిస్తోంది. మూడు టీ20 ఇంటర్నేషనల్స్ మ్యాచ్‌లను ఆడుతోంది. ఈ సిరీస్‌లో ఇప్పటికే రెండు మ్యాచ్‌లు ముగిసిపోయాయి. సిరీస్‌ను టీమిండియా కైవసం చేసుకుంది. ఈ సిరీస్‌లో చివరి మ్యాచ్ ఆదివారం సాయంత్రం 7 గంటలకు మొదలవుతుంది. కోల్‌కతలోని ఈడెన్ గార్డెన్స్ దీనికి వేదిక కానుంది. దీని తరువాత టెస్ట్ మ్యాచ్‌లు మొదలవుతాయి. రెండు టెస్టులను ఈ రెండు జట్లు ఆడాల్సి ఉంది. ఇప్పుడున్న ఫామ్ చూస్తోంటే.. కివీస్‌పై కనికరం లేకుండా మిగిలిన మ్యాచ్‌లను టీమిండియా దున్నేయడం ఖాయంగా కనిపిస్తోంది.

ఆసక్తి కలిగించట్లే..
న్యూజిలాండ్‌తో టీమిండియా సిరీస్ ఏ మాత్రం ఆసక్తి కలిగించట్లేదు. స్వదేశంలోనే ఈ సిరీస్ సాగుతున్నప్పటికీ.. అభిమానులు పెద్దగా స్పందించట్లేదు. దీనికి కారణాలేమిటనేది స్పష్టంగా తెలియరావట్లేదు గానీ.. క్రికెట్ అంటే మొహం మొత్తిందన అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. టీ20 ప్రపంచకప్ వంటి టోర్నమెంట్‌లో కనీసం సెమీ ఫైనల్స్‌కు కూడా చేరుకోకుండా స్వదేశానికి తిరుగుముఖం పట్టిందనే అక్కసు కూడా ఓ కారణం కావచ్చని అంటున్నారు నెటిజన్లు.

సిరీస్ దక్కించుకున్నా నో రెస్పాన్స్..
న్యూజిలాండ్ అల్లాటప్పా జట్టేమీ కాదు. ఆల్‌రౌండర్లతో నిండి ఉంది. కేన్ విలియమ్సన్ వంటి ఒకరిద్దరు ఈ సిరీస్‌కు అందుబాటులో ఉండట్లేదు గానీ.. జట్టు ఆటతీరులో ఎలాంటి మార్పూ లేదు. మార్టిన్ గప్టిల్ గానీ, డెరిల్ మిఛెల్, గ్లెన్ ఫిలిప్స్, జిమ్మీ నీషమ్, శాంట్నర్ వంటి హేమాహేమీలు టీమ్‌లో ఉన్నారు. తమ స్థాయికి తగ్గట్టుగా ఆడుతున్నారు. ఇటు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, భువనేష్ కుమార్, వెంకటేష్ అయ్యర్ వంటి మాస్టర్ బ్లాస్టర్లు ఉన్నా.. విజయాలు సాధిస్తున్నా.. ఫ్యాన్స్ నుంచి మాత్రం నో రెస్పాన్స్.

టీఆర్పీ ఢమాల్..
టీమిండియా ఫ్యాన్స్ ఎవరూ పెద్దగా ఈ మ్యాచ్‌లను చూడట్లేదనడానికి నిదర్శనం టీఆర్పీ రేటింగ్స్, వ్యూవర్‌షిప్. రాంచీ స్టేడియంలో శుక్రవారం రాత్రి ముగిసిన మ్యాచ్‌ను చూసిన వారి సంఖ్య 30 నుంచి 35 లక్షల లోపే. ఇది లోయెస్ట్ ఫర్ ఎవర్. టీమిండియా ఆడిన ఏ మ్యాచ్ కూడా ఇంత తక్కువ సంఖ్యలో వ్యూవర్‌షిప్‌ను రికార్డు చేసుకోలేదు. చివరికి- స్కాట్లాండ్, నమీబియా వంటి చిన్న జట్లపై ఆడిన మ్యాచ్‌లు కూడా 45 లక్షలకు పైగా వ్యూవర్‌షిప్ సాధించాయి. కివీస్ సిరీస్‌కు అనూహ్యంగా టీఆర్పీ రేటింగ్స్ గానీ, వ్యూవర్‌షిప్ గానీ పడిపోయింది.

రోహిత్ శర్మ కేప్టెన్సీపై మొహం మొత్తిందా..
టీ20 ఫార్మట్‌కు రోహిత్ శర్మ కేప్టెన్‌గా ఉంటున్నాడు. పూర్తిస్థాయి కేప్టెన్‌గా రోహిత్ శర్మకు ఇదే తొలి సిరీస్. అయినా ఫ్యాన్స్ ఏ మాత్రం ఆసక్తి చూపట్లేదనడానికి వ్యూవర్‌షిప్ సాక్ష్యంగా తీసుకోవచ్చు. రోహిత్ శర్మ కేప్టెన్‌గా ఉన్నా.. న్యూజిలాండ్ వంటి బలమైన జట్టుపై సిరీస్ గెలిచినా పట్టించుకోవట్లేదు ఫ్యాన్స్. బ్లాక్ క్యాప్స్‌తో టీ20 సిరీస్ నడుస్తోందనే విషయం తెలుసుకునే సరికే.. దాన్ని టీమిండియా గెలుచుకుంది కూడా. ఇలా అభిమానుల నుంచి ఆదరణ లేకుండానే ఈ సిరీస్ ముగింపుదశకు వచ్చింది.

కోహ్లీ డుమ్మా కారణమా?
దీనికి కారణం- విరాట్ కోహ్లీ లేకపోవడమేననే అభిమానులు కూడా ఉన్నారు. ఇదివరకు విరాట్ కోహ్లీ సారథ్యంలో టీమిండియా ఆడిన ఏ మ్యాచ్‌కు కూడా ఇంత తక్కువ స్థాయిలో వీవర్ షిప్ లభించలేదు. టీ20 ప్రపంచకప్‌లో భాగంగా భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌ను ఏకంగా కోటి మంది తిలకించారు. ఐపీఎల్ 2021 ఫైనల్ మ్యాచ్ కూడా అదే స్థాయిలో వ్యూవర్‌షిప్‌ను సాధించింది. చెన్నై సూపర్ కింగ్స్-కోల్‌కత నైట్ రైడర్స్ మధ్య సాగిన ఈ మ్యాచ్‌ను 75 లక్షల మందికి పైగా తిలకించారు. ఆ తరువాత క్రమంగా ప్రజాదరణను మ్యాచ్‌లు కోల్పోతూ వస్తోన్నాయి.


Click it and Unblock the Notifications
