హైదరాబాద్: టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ సోషల్ మీడియాలో నిత్యం అభిమానులతో టచ్‌లో ఉంటాడనే సంగతి తెలిసిందే. తనతో పాటు తన కుటుంబ విషయాలను సైతం అభిమానులతో పంచుకుంటాడు. తాజాగా ధావన్ తన ట్విట్టర్‌లో ఓ వీడియోని పోస్టు చేశాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
మూడు వన్డేల సిరిస్‌లో భాగంగా భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య బుధవారం పూణె వేదికగా రెండో వన్డే జరిగింది. మ్యాచ్ ప్రారంభానికి ముందు ఇరు జట్లు మైదానంలో జాతీయ గీతాన్ని ఆలపించాయి. ఈ సమయంలో ధావన్ కుమారుడు జోరావర్ తన తల్లితో కలిసి ఇంట్లో ఉన్న టీవీలో లైవ్‌ని వీక్షించాడు.

ఈ సమయంలో ధావన్ కనిపించగానే జొరావర్ 'అమ్మా.. నాన్నే కదా' అని చెప్పాడు. దీంతో వెంటనే ధావన్ భార్య ఆయేషా అవును అని చెప్పింది. దీనికి సంబంధించిన వీడియోని ధావన్ ట్విట్టర్‌లో అభిమానులతో పంచుకుంటూ 'టీవీలో టీమిండియా జట్టు కనిపించడంతో నా కుమారుడు జొరావర్ నేను ఎక్కడున్నానని వెతుక్కోవడం చూసి ఎంతో సంబరపడిపోయాను. ఆ దేవుని ఆశీస్సులతో పాటు నా ఆశీస్సులు అతనికి ఎల్లప్పుడూ ఉంటాయి. లవ్ యూ' అని కామెంట్ పెట్టాడు.
ఇదిలా ఉంటే రెండో వన్డేలో న్యూజిలాండ్‌పై భారత్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మూడు వన్డేల సిరీస్‌లో ఇరు జట్లు చెరో మ్యాచ్ గెలిచి 1-1తో సమంగా ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో 68 పరుగులు చేసిన శిఖర్ ధావన్ జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. మూడు వన్డేల సిరిస్ విజేత ఎవరో తేల్చే చివరి వన్డే ఆదివారం కాన్పూర్‌లో జరగనుంది.