ఐదవ టీ20.. కోహ్లీ రికార్డు బద్దలు కొట్టిన రోహిత్!!

మౌంట్‌మాంగనీ: న్యూజిలాండ్ పర్యటనలో తొలి అంకాన్ని భారత జట్టు అజేయంగా ముగించింది. ఆదివారం జరిగిన ఐదో టీ20లోనూ కోహ్లీసేన ఏడు వికెట్లతో విజయం సాధించింది. మొదట భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 163 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (41 బంతుల్లో 60 రిటైర్డ్ హర్ట్; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), కేఎల్ రాహుల్ (33 బంతుల్లో 45; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. కుగ్లిన్ 2 వికెట్లు తీశాడు. అనంతరం న్యూజిలాండ్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 156 పరుగులు చేసి ఓడింది. రాస్ టేలర్ (47 బంతుల్లో 53; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), టీమ్ సీఫెర్ట్ (30 బంతుల్లో 50; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) హాఫ్ సెంచరీలు చేశారు. శార్దుల్ ఠాకూర్, నవదీప్ సైనీ చెరో 2 వికెట్లు తీశారు. ఈ విజయంతో టీమిండియా సిరీస్‌ను 5-0తో క్లీన్ స్వీప్ చేసింది. అటు సొంత దేశంలో కివీస్ చెత్త ఓటమిని మూటగట్టుకుంది.

రోహిత్ ప్రపంచ రికార్డు:
ఐదో టీ20లో 'హిట్‌మ్యాన్' రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ చేయడంతో ఓ ప్రపంచ రికార్డు సాధించాడు. టీ20ల్లో అత్యధిక సార్లు 50+ స్కోరు సాధించిన మొదటి ఆటగాడిగా నిలిచాడు. 25 సార్లు రోహిత్ 50+ స్కోర్లు చేసాడు. దీంతో కెప్టెన్ విరాట్ కోహ్లీ పేరిట ఉన్న రికార్డును బద్దలుకొట్టాడు. ఇప్పటివరకు రోహిత్ 108 టీ20 మ్యాచ్‌లు ఆడి.. నాలుగు సెంచరీలు, 21 హాఫ్ సెంచరీలతో 50+ స్కోర్లు సాధించిన వారిలో అందరికంటే ముందున్నాడు.

కోహ్లీ@ 24:
విరాట్ కోహ్లీ 24 అర్ధ శతకాలు సాధించాడు. అయితే కోహ్లీ ఇప్పటివరకు 82 మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. ఐదవ టీ20 మ్యాచ్‌కు విరాట్ విశ్రాంతి తీసుకున్న విషయం తెలిసిందే. న్యూజిలాండ్ బ్యాట్స్‌మన్ మార్టిన్ గప్టిల్, ఐర్లాండ్‌కు చెందిన పాల్ స్టిర్లింగ్ 17 సార్లు 50+ స్కోర్లు చేశారు. ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ 16 సార్లు ఈ ఘనత అందుకున్నాడు.

టీ20లో అత్యధిక పరుగులు:
టీ20లలో పరుగుల పరంగా మాత్రం రోహిత్ కంటే కోహ్లీనే ముందున్నాడు. కోహ్లీ 50.80 సగటుతో 2,794 పరుగులు చేసాడు. రోహిత్ 32.62 సగటుతో 2,773 పరుగులు సాధించాడు. కోహ్లీకి 21 పరుగుల దూరంలో మాత్రమే రోహిత్ నిలిచాడు. కొంతకాలంగా వీరిద్దరూ 'టాప్' ప్లేస్ కోసం పోటీ పడుతున్న విషయం తెలిసిందే. ఐపీఎల్ ముగిసే వరకు టీ20 అంతర్జాతీయ సిరీస్‌లు లేనందున అప్పటివరకు కోహ్లీ టాప్‌లో కొనసాగనున్నాడు.

బీసీసీఐ ప్రస్తుతం పరిశీలనలో రోహిత్:
ఐదవ టీ20లో కోహ్లీ విశ్రాంతి తీసుకున్నాడు. అతడి స్థానంలో 'హిట్‌మ్యాన్' రోహిత్ సారథ్య బాధ్యతలు అందుకున్నాడు. భారత ఇన్నింగ్స్‌లో మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన రోహిత్.. 41 బంతుల్లో 60 పరుగులు చేశాడు. ఈ సమయంలో అతని పిక్క కండరాలు పట్టేశాయి. ఫిజియో వచ్చి ప్రాథమిక చికిత్స చేశాడు. అనంతరం ఓ భారీ సిక్స్ బాదినా.. ఆ తర్వాత బంతికి రోహిత్ బాగా ఇబ్బంది పడ్డాడు. దీంతో మైదానం వీడాడు. ఫీల్డింగ్ సమయంలో కూడా మైదానంలోకి దిగలేదు. 'రోహిత్ శర్మను ప్రస్తుతం పరిశీలనలో ఉంచాం. త్వరలోనే పూర్తి వివరాలు అందజేస్తాం' అని బీసీసీఐ ఓ ప్రకటనలో పేర్కొంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications