హైదరాబాద్: ముంబై వేదికగా న్యూజిలాండ్‌తో వాంఖడే స్టేడియంలో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, ధోనిలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఎందుకంటే విరాట్ కోహ్లీకి ఇది 200వ వన్డే కాగా, 2011 వరల్డ్ కప్ ఫైనల్లో ఇదే స్టేడియంలో సిక్సుతో ధోని టీమిండియాకు ఘన విజయాన్ని అందించాడు.

దీంతో వీరిద్దరూ క్రీజులోకి వస్తున్న సమయంలో స్టేడియంలోని అభిమానులు హోరెత్తించారు. ధావన్ అవుటైన తర్వాత క్రీజులోకి కోహ్లీ వస్తున్న సమయంలో కోహ్లీ.. కోహ్లీ అంటూ స్టేడియం మొత్తం హోరెత్తించారు. ఆ తర్వాత ధోని క్రీజులోకి వస్తున్న సమయంలో కూడా ధోని... ధోని అంటూ పెద్ద పెద్దగా అరిచారు.
ఈ మ్యాచ్‌లో వీరిద్దరూ అభిమానులు సైతం అలరించారు. ధోనితో కలిసి విరాట్ కోహ్లీ 57 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఈ క్రమంలోనే ఇన్నింగ్స్ 30వ ఓవర్‌లో పరుగు తీస్తుండగా ధోని కంట్లో నలసు పడింది. దీంతో కాసేపు నొప్పితో విలవిలలాడిన ధోనీ.. మరో ఎండ్‌లో ఉన్న కోహ్లీ వద్దకు వెళ్లి సమస్యని వివరించాడు.
దీంతో వెంటనే తన చేతికి ఉన్న గ్లౌవ్స్‌ని తొలగించిన కోహ్లీ.. ధోని కంట్లోని నలుసుని తొలగించాడు. దీనికి సంబంధించిన వీడియోని బీసీసీఐ తన అధికారిక ట్విట్టర్‌లో పోస్టు చేసింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. కాగా, ఈ మ్యాచ్‌లో సెంచరీ చేసిన విరాట్ కోహ్లీ అరుదైన రికార్డుని సొంతం చేసుకున్నాడు.
దక్షిణాఫ్రికా స్టార్ బ్యాట్స్‌మెన్ ఏబీ డివిలియర్స్ తర్వాత 200వ వన్డేలో సెంచరీ సాధించిన రెండో బ్యాట్స్‌మన్‌గా చరిత్ర సృష్టించాడు. అంతేకాదు వన్డేల్లో క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ (49) తర్వాత అత్యధిక సెంచరీలు చేసిన క్రికెటర్‌గా గుర్తింపు పొందాడు. కోహ్లీ రాణించడంతో టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 280 పరుగులు చేసింది.